జీవో 1పై మండలిలో రగడ

ప్రజాస్వామ్య హక్కులను హరించేలా ప్రభుత్వం జారీచేసిన జీవో 1ను రద్దుచేయాలంటూ తామిచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి ఛైర్మన్‌ మోషేనురాజు తిరస్కరించడంతో తెదేపా సభ్యులు నిరసనకు దిగారు.

Updated : 21 Mar 2023 06:06 IST

తెదేపా.. పీడీఎఫ్‌ ఎమ్మెల్సీల నిరసన
తెదేపా సభ్యుల వాకౌట్‌

ఈనాడు, అమరావతి: ప్రజాస్వామ్య హక్కులను హరించేలా ప్రభుత్వం జారీచేసిన జీవో 1ను రద్దుచేయాలంటూ తామిచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి ఛైర్మన్‌ మోషేనురాజు తిరస్కరించడంతో తెదేపా సభ్యులు నిరసనకు దిగారు. ‘ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ.. రాష్ట్రప్రభుత్వం తీరు’ అనే అంశంపై పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు ప్రవేశపెట్టిన వాయిదాతీర్మానాన్నీ ఛైర్మన్‌ తిరస్కరించారు. దీనిపై తెదేపా, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు నిరసనకు దిగడంతో సభలో గందరగోళం ఏర్పడింది. ఈ పరిస్థితుల నడుమే ప్రశ్నోత్తరాలను ఛైర్మన్‌ కొనసాగించారు.

జీవో1 రద్దు చేయాల్సిందే

జీవో1పై తెదేపా ఎమ్మెల్సీలు.. మంత్రుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. సోమవారం ఉదయం సభ ప్రారంభం కాగానే తెదేపా ఎమ్మెల్సీలు ఛైర్మన్‌కు వాయిదాతీర్మానం అందించారు. దీనిపై చర్చకు అంగీకరించకపోవడంతో పోడియంలోకి దూసుకొచ్చి.. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ‘దీనిపై ఛైర్మన్‌ మాట్లాడుతూ.. రోజూ ఏదో ఒక కాగితం పట్టుకొచ్చి ఇలా చేయడం భావ్యం కాదని, అభ్యంతరం ఉంటే కోర్టుకు వెళ్లాలని సూచించారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. జీవోలు రాజ్యాంగబద్ధంగానే ఉంటాయన్నారు. నిబంధనలను అతిక్రమిస్తేనే సమస్యలు వస్తాయన్నారు. తెదేపా సభ్యులు ప్లకార్డులను చింపి.. పోడియంలో విసిరేసి నిరసన తెలిపారు. చర్చకు అనుమతించకపోవడానికి నిరసన తెలుపుతూ ఉదయం 10.31కు వాకౌట్‌ చేశారు. మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ ‘వారి రాతలపై వారికే నమ్మకం లేదు. అందుకే చింపి విసిరేసి వెళ్తున్నారు’ అన్నారు.

రాష్ట్రంలో నిరసన తెలపే హక్కులేదా?

‘ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ.. ప్రభుత్వం తీరు’ అనే అంశంపై చర్చకు అనుమతించాలని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు మరో వాయిదాతీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. దీన్నీ ఛైర్మన్‌ తిరస్కరించడంతో వారూ నిరసనకు దిగారు. ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో నిరసన తెలపడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు. నిరసన తెలిపేందుకు వెళ్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలను అరెస్టుచేశారు. న్యాయవాదులు నిరసన తెలిపే పరిస్థితి లేదు. చివరకు కాటికాపరులనూ అరెస్టుచేశారు. సీపీఎస్‌ విధానంపై నిరసన తెలపడానికి సమావేశం ఏర్పాటుచేసుకున్నా అరెస్టుచేశారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్‌వాడీల సమస్యలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి బొత్స చెప్పడంతో నిరసన ఉపసంహరించారు.


మూడు బిల్లులకు ఆమోదం

* ఆంధ్రప్రదేశ్‌ చుక్కల భూముల సవరణ బిల్లు, 2023ను మండలి ఆమోదించింది.

* ఆంధ్రప్రదేశ్‌ భూ హక్కులు, పట్టాదారు పాసుపుస్తకాల (సవరణ) బిల్లు, 2023కు ఆమోదం

* ఆంధ్రప్రదేశ్‌ (ఆంధ్ర ప్రాంత) ఇనామ్‌ రద్దు, రైత్వారీ పట్టాగా మార్పు (సవరణ) బిల్లు, 2023కు ఆమోదం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని