CM Jagan: నేరగాళ్లకు దేవుడు మొట్టికాయలు వేస్తాడు
నేరగాళ్లకు దేవుడు సరైన సమయంలో మొట్టికాయలు వేస్తాడని సీఎం జగన్ అన్నారు. తెదేపాకు ప్రజలు ఇప్పటికే మొట్టికాయలు వేశారని, గజదొంగల ముఠా మళ్లీ రాజ్యాధికారం చేపట్టకుండా ప్రజలు ఇంకా గట్టిగా మొట్టికాయలు వేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వెల్లడించారు.
ఎంత తెలివైన నేరస్థుడైనా ఏదో ఒక పొరపాటు చేస్తాడు
నైపుణ్య కుంభకోణాన్ని చంద్రబాబే నడిపారు
కేబినెట్ ఆమోదం, ఉత్తర్వులకు విరుద్ధంగా ఒప్పందం
శాసనసభలో సీఎం జగన్
ఈనాడు, అమరావతి: నేరగాళ్లకు దేవుడు సరైన సమయంలో మొట్టికాయలు వేస్తాడని సీఎం జగన్ అన్నారు. తెదేపాకు ప్రజలు ఇప్పటికే మొట్టికాయలు వేశారని, గజదొంగల ముఠా మళ్లీ రాజ్యాధికారం చేపట్టకుండా ప్రజలు ఇంకా గట్టిగా మొట్టికాయలు వేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వెల్లడించారు. శాసనసభలో సోమవారం నైపుణ్యాభివృద్ధి సంస్థ కుంభకోణంపై చర్చలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎంత తెలివైన నేరస్థుడైనా ఎక్కడో చోట ఏదో ఒక పొరపాటు చేస్తాడు. దేవుడు మొట్టికాయలు వేయాలనుకున్నప్పుడు అవి కచ్చితంగా బయటపడతాయి. నైపుణ్యం పేరుతో డబ్బులు దోచేయడం చంద్రబాబుకే తెలిసిన గొప్ప నైపుణ్యం. కుంభకోణాన్ని చంద్రబాబే నడిపారు. రూ.371 కోట్ల ప్రభుత్వనిధులు హారతికర్పూరంలా మాయమైపోయాయి. ఈ డబ్బు డొల్లకంపెనీల ద్వారా రకరకాలుగా తిరిగి, చంద్రబాబుకు వచ్చింది. ఈ కుంభకోణం రాష్ట్రంలో మొదలై విదేశాలకు చేరింది. అక్కడి నుంచి చంద్రబాబు నివాసం ఉన్న హైదరాబాద్‌కి వచ్చింది. ఈ కుంభకోణంపై సీఐడీతోపాటు జీఎస్టీ ఇంటెలిజెన్స్, ఐటీ, ఈడీ.. ఇలా సంస్థలన్నీ దర్యాప్తు చేస్తున్నాయి. చేయని నైపుణ్యాభివృద్ధిని ఎలా చూపించాలి? దోచేసిన డబ్బును ఎలా జేబులోకి తెచ్చుకోవాలి? చట్టానికి దొరకకుండా ఏయే దస్త్రాలను మాయం చేయాలి? విచారణ జరిగితే తప్పించుకునేందుకు ఏం చేయాలి? ఇవన్నీ ముందుగానే ఊహించుకొని విజన్ రూపకల్పన చేసినట్లు కనిపిస్తోంది’’ అని ఆరోపించారు.
నైపుణ్యంతో దోచేశారు..
‘‘ఇది దేశచరిత్రలోనే నిరుద్యోగులు, విద్యార్థుల పేరిట జరిగిన అతిపెద్ద కుంభకోణం. నైపుణ్యం పేరిట గత ప్రభుత్వంలో ఎలా దోచేశారన్నది సభ ద్వారా ఎమ్మెల్యేలు, ప్రజలందరికీ తెలియాలి. చంద్రబాబు 2014లో అధికారం చేపట్టిన రెండు నెలలకే నైపుణ్యాభివృద్ధి కుంభకోణం మొదలైంది. తమ మనుషులను నైపుణ్యాభివృద్ధి సంస్థలో పెట్టారు. అక్కడినుంచి కథ నడిపించారు. సీమెన్స్ ఇండియా కంపెనీలో ఓ ఉన్నతాధికారితో లాలూచీ పడ్డారు. ఆయన్ను వాడుకొని దోపిడీ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు మొత్తం రూ.3,356 కోట్లయితే ప్రభుత్వవాటా 10శాతం. సీమెన్స్ 90% పెడుతుందట. ప్రపంచంలో ఎక్కడైనా ప్రైవేటు కంపెనీ రూ.3వేల కోట్లు ఎలా ఇస్తుందని ఆలోచించలేదు. లాలూచీపడ్డ ఇద్దరు వ్యక్తులు తయారుచేసిన అంచనాలను నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా నోట్‌గా పెట్టించారు. కేబినెట్‌లోకి దీన్ని ప్రత్యేక ఐటమ్‌గా తీసుకొచ్చి, ఉత్తర్వులిచ్చారు. కేబినెట్‌లో నోట్ పెట్టడం నిబంధనలకు విరుద్ధం’’ అన్నారు.
ఒప్పందంలో అనేక లోపాలు
‘‘కేబినెట్ ఆమోదం, ఉత్తర్వులు ఒకలా ఉండగా.. ఒప్పందంలో ఇందుకు విరుద్ధంగా ఉంది. ఆరు క్లస్టర్లలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, టెక్నికల్ నైపుణ్యాభివృద్ధి సంస్థలు ఏర్పాటుచేస్తామని, ఇందులో ఒక్కో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు ప్రభుత్వం రూ.55 కోట్లు వెచ్చిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీమెన్స్ 90% గ్రాంటు ఇన్ ఎయిడ్ కింద రూ.3వేల కోట్లు ఇస్తుందని చెప్పారు. ఒప్పందానికి వచ్చేసరికి గ్రాంటు ఇన్ ఎయిడ్ ప్రస్తావన లేకుండా చేశారు. ప్రభుత్వం ఇవ్వాల్సిన 10% కాంట్రిబ్యూషన్ కాస్తా ఫైనాన్షియల్ అసిస్టెన్స్‌గా మార్చేశారు. ఇక్కడే కుంభకోణానికి బీజం పడింది. ఏ లేఖ ఆధారంగా.. ఏ తేదీ జారీచేసిన.. ఏ ఉత్తర్వు ఆధారంగా.. ఒప్పందం కుదుర్చుకున్నారో ఒప్పందంలో ఖాళీగా వదిలేశారు. ఉత్తర్వుల్లో ఉన్న అంశాలు ఒప్పందంలో లేకపోతే ఎలా సంతకాలు చేశారు? చంద్రబాబు స్క్రిప్టు, డైరెక్షన్ లేకుండా జరుగుతాయా? ప్రభుత్వం నుంచి 10% నిధులు విడుదల చేసినా సీమెన్స్ నుంచి ఒక్క పైసా రాలేదు. ప్రభుత్వం నుంచి ఒక విడత డబ్బులు వెళ్తాయి. తర్వాత డొల్ల కంపెనీల ద్వారా చంద్రబాబుకు చేరగానే రెండోవిడత విడుదల చేశారు. మేము డీబీటీ ద్వారా బటన్ నొక్కితే అక్కాచెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్తుంది. కానీ, చంద్రబాబు బటన్ నొక్కితే ప్రభుత్వఖాతా నుంచి చంద్రబాబు ఖాతాలోకి వెళ్లాయి. డబ్బుల విడుదలపై ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి తన నోట్‌ఫైల్‌లో అప్పటి సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు చేసినట్లు పేర్కొన్నారు. చంద్రబాబు ప్రధాన నిందితుడు అనేందుకు ఇంకా నిదర్శనాలు కావాలా?’’ అని ప్రశ్నించారు.
ఆ నిధులు ఎక్కడికి పోయాయి?
‘‘ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ఎక్కడికి పోయాయోనని తీగ లాగితే డొంక కదిలింది. సీమెన్స్ సంస్థ వారు అంతర్గతంగా విచారణ చేసి, మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. ప్రభుత్వ ఉత్తర్వులు, ఒప్పందంతో తమకు సంబంధం లేదని చెప్పారు. తమ కంపెనీలో పనిచేసే సుమన్‌బోస్ అనే వ్యక్తి యాజమాన్యాన్ని గానీ, లీగల్ బృందాన్ని గానీ సంప్రదించలేదని కోర్టుకు తెలిపారు. సీమెన్స్ ఎలాంటి ఆర్థిక సహాయ కార్యక్రమాలు నిర్వహించలేదని, ఇలాంటి పథకాలు తమ సంస్థలో లేవని చెప్పింది. సీమెన్స్‌కు రూ.370 కోట్లు ఇచ్చారు. వాళ్లు తమకు రాలేదంటున్నారు. ఈ డబ్బులు ఎవరికి పోయాయి? అనేక డొల్లకంపెనీల ద్వారా మనీలాండరింగ్ జరిగి, వీళ్ల చేతుల్లోకి వచ్చింది. నైపుణ్యాభివృద్ధి కుంభకోణంపై 2018 జూన్‌లో ఒక వ్యక్తి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. విచారణ మొదలుపెట్టిన ఏసీబీ ఆ తర్వాత వచ్చిన ఆదేశాలతో దస్త్రాన్ని మూలకు పడేసింది. ఆ తర్వాత నోట్‌ఫైల్స్ మాయం చేశారు. వివిధ శాఖల్లో ఉండే షాడో ఫైల్స్ ద్వారా నైపుణ్య కుంభకోణాన్ని తోడడం మొదలుపెట్టాకే బయటకు వచ్చింది. ఈ కుంభకోణంలో ప్రధానపాత్ర పోషించిన పీవీఎస్‌పీ/స్కిల్లర్, డిజైన్‌టెక్ సేవాపన్ను కట్టకుండా పన్ను కోసం క్లెయిమ్ చేశాయి. రూ.కోట్లు క్లెయిమ్ చేయడంతో జీఎస్టీ అధికారులకు అనుమానం వచ్చింది. ఈ కంపెనీల లావాదేవీలపై దృష్టిపెట్టారు. ఇది 2017లోనే బయటపడింది. దీనిపై అప్పటి రాష్ట్రప్రభుత్వం స్పందించలేదు. ఈ కేసులో సీఐడీ అరెస్టులు చేస్తుంటే రాజకీయ కక్షసాధింపు అంటూ గగ్గోలు పెడుతున్నారు. ఈ కేసులో ఈడీ నలుగుర్ని అరెస్టు చేసింది. కుంభకోణం చేసి, పట్టుబడిన తర్వాత వీళ్లు దొరికిపోతున్నందున చంద్రబాబులో అంత భయం ఉంది’’ అని ఆరోపణలు గుప్పించారు.
నైపుణ్యాభివృద్ధి సంస్థ కుంభకోణంలో ఇక అరెస్టులు: మంత్రి అమర్‌నాథ్
‘ నైపుణ్యాభివృద్ధి సంస్థ కుంభకోణంలో ఈడీ ఇటీవల 10 మందిని అరెస్టు చేసింది. ఇక అరెస్టయ్యేది సూత్రధారే’ అని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ విమర్శించారు. శాసనసభలో లఘుచర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘రూ.241 కోట్లలో రూ.173 కోట్లు జమ అయిన స్కిల్లర్ అనే కంపెనీని, ఈ ఒప్పందానికి నెలరోజుల ముందే స్థాపించారు’ అని పేర్కొన్నారు. డొల్ల కంపెనీలకు మళ్లించిన నిధుల్లో రెండు టోకెన్లు హైదరాబాద్‌కు వెళ్లాయని, అవి ఎవరి కోసం వెళ్లాయనే దానిపై దర్యాపు చేయాలని వైకాపా ఎమ్మెల్యే కన్నబాబు కోరారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TSPSC: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరో 13 మంది డిబార్
-
Crime News
Nellore: భర్త అంత్యక్రియలు ముగిసిన కొన్ని గంటలకే భార్య మృతి
-
Viral-videos News
Viral Video: ఇదేం వెర్రో..? రన్నింగ్కారుపై పుష్ అప్స్ తీస్తూ హల్చల్!
-
Politics News
Andhra News: జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే స్వాగతిస్తాం: సీపీఐ రామకృష్ణ
-
Movies News
Srikanth Odhela: వైభవంగా ‘దసరా’ దర్శకుడి వివాహం.. నాని పోస్ట్‌తో శుభాకాంక్షల వెల్లువ
-
Politics News
PM Modi: పేదలను మోసగించడమే కాంగ్రెస్ వ్యూహం: ప్రధాని మోదీ