జోడో యాత్రతో సమైక్య సందేశం

భారత్‌ జోడో యాత్రతో దేశ ప్రజలకు సమైక్య సందేశం పంపామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. కర్ణాటకలోని బెళగావిలో సోమవారం నిర్వహించిన ‘యువక్రాంతి’ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

Published : 21 Mar 2023 04:08 IST

బెళగావి సమావేశంలో రాహుల్‌గాంధీ

ఈనాడు, బెంగళూరు: భారత్‌ జోడో యాత్రతో దేశ ప్రజలకు సమైక్య సందేశం పంపామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. కర్ణాటకలోని బెళగావిలో సోమవారం నిర్వహించిన ‘యువక్రాంతి’ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘దేశంలోని వ్యాపారాలన్నీ కేవలం ఇద్దరు, ముగ్గురు చేతుల్లోకి వెళ్తున్నాయి. విమానాశ్రయాలు, ఓడరేవులు, రహదారుల ప్రాజెక్టులన్నీ భాజపాకు సన్నిహితులైన అదానీకి చేరుతున్నాయి. ఈ దేశం రైతులు, కార్మికులు, పేదలు, యువకుల సొత్తు. జోడో యాత్రతో ఇదే సందేశాన్ని చేరవేశాం’ అని వివరించారు. దేశంలో అత్యంత అవినీతి పాలన ఉన్న రాష్ట్రం కర్ణాటక. కేఎస్‌డీఎల్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ రూ.8 కోట్ల అక్రమ నగదుతో దొరికిపోయినా.. ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు. పోలీస్‌ ఎస్సై నియామకాల్లో తాజా అక్రమాలు, వివిధ అభివృద్ధి పనుల కోసం 40 శాతం కమీషన్‌పై గుత్తేదారుల సంఘం ప్రధానికి లేఖ రాసినా స్పందన లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల సమష్టి నాయకత్వంలో భాజపాను గద్దె దింపాలని రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. అనంతరం కన్నడనాట నిరుద్యోగ యువతకు భరోసా కల్పించే ‘యువనిధి’ హామీ పథకాన్ని రాహుల్‌ ఆవిష్కరించారు. నిరుద్యోగ పట్టభద్రులకు రూ.3 వేలు, పాలిటెక్నిక్‌ డిప్లొమా చేసిన వారికి రూ.1,500 చొప్పున ప్రతినెలా భృతి ఇస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. రానున్న అయిదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు.

నడ్డా రిమోట్‌ ఎవరి చేతిలో ఉంది?

ఖర్గే ఓ రిమోట్‌ కంట్రోల్‌ అధ్యక్షుడంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విమర్శను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇదే సభలో ఖండించారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రిమోట్‌ ఎవరి చేతిలో ఉందో చెప్పాలని ప్రశ్నించారు. కశ్మీరులో 40 రోజుల కిందట రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరేందుకు దిల్లీ పోలీసులు ఆయన ఇంటికి వెళ్లడమేంటి? ఆయనను ఎంత కాలం వేధిస్తారో వేధించండి. మమ్మల్ని మట్టిలో కలపాలని చూసినా.. మొక్కల్లా మళ్లీ పుడతామని స్పష్టం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని