అవినీతి జరిగితే ఆధారాలు బయటపెట్టలేదేం?

సీఎం జగన్‌ తన అసమర్థతను, చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవం గురించి ప్రజల్లో చర్చ జరగకూడదనే.. తెదేపా ప్రభుత్వహయాంలో నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులో అవినీతి అంటూ శాసనసభలో పసలేని పాతపాట పాడారని తెదేపా సీనియర్‌ నేత, ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ ధ్వజమెత్తారు.

Published : 21 Mar 2023 05:21 IST

ఈడీ విచారణ జరుగుతుండగా సభలో చర్చించడం ప్రభావితం చేయడం కాదా?
ప్రేమచంద్రారెడ్డి ప్రమేయంపై ఎందుకు మాట్లాడరు?
పీఏసీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ ధ్వజం

ఈనాడు, అమరావతి: సీఎం జగన్‌ తన అసమర్థతను, చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవం గురించి ప్రజల్లో చర్చ జరగకూడదనే.. తెదేపా ప్రభుత్వహయాంలో నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులో అవినీతి అంటూ శాసనసభలో పసలేని పాతపాట పాడారని తెదేపా సీనియర్‌ నేత, ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ ధ్వజమెత్తారు. రాష్ట్రప్రజల సమస్యలు, అకాల వర్షాలకు నష్టపోయిన రైతుల గురించి సభలో ఒక్కమాటా మాట్లాడని ముఖ్యమంత్రి.. నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టుపై రెండు గంటల సుదీర్ఘ ఉపన్యాసమిచ్చారని మండిపడ్డారు. తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీనాయకుల ముఖాన బట్టకాల్చి వేయాలన్నదే జగన్‌ ఉద్దేశమని సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ కేశవ్‌ దుయ్యబట్టారు. ‘‘ఈ వ్యవహారంలో సీమెన్స్‌, సెంట్రల్‌ టూల్‌ డిజైన్‌ సంస్థలు, నిధులు విడుదల చేసిన ప్రేమచంద్రారెడ్డి తప్పుచేయకుండా... చంద్రబాబు తప్పుచేశారని చెప్పడం జగన్‌ రాజకీయ అజ్ఞానం కాదా? నిజంగానే నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిగ్గుతేలిస్తే, ఆ వివరాల్ని, ఆధారాల్ని ప్రజల ముందు ఎందుకు పెట్టట్లేదు? జగన్‌వి నిరాధార ఆరోపణలని తేలిపోతుందన్న భయమా? ఆ అంశంపై ఈడీ నివేదిక వచ్చేవరకూ ఆగకుండా.. జగన్‌ ఊరికే అవినీతి, డొల్ల కంపెనీలని ఆరోపిస్తే సరిపోతుందా? అసలు ఈ దేశానికి నీకిది-నాకది (క్విడ్‌ప్రోకో) అన్న పదాన్ని పరిచయం చేసిందే జగన్‌రెడ్డి. డొల్ల కంపెనీలు, మనీలాండరింగ్‌కు ఆయనే ఆద్యుడు. జగన్‌ అవినీతిపై మేం ఆధారాలు బయటపెట్టాక, దానిపై సీబీఐ విచారించి, ఈడీ ఆస్తులు జప్తుచేశాకే ఆయన జైలుకెళ్లారు. నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులో తెదేపా ప్రభుత్వంగానీ, చంద్రబాబుగానీ తప్పు చేసుంటే ఈడీ విచారణలో తేలుతుంది’’ అన్నారు.

నివేదికలు బయట పెట్టరేం?

సీబీఐ విచారణ వివరాలను, ఏసీబీ నివేదికను... చివరకు వైకాపా ప్రభుత్వం సేకరించిన వివరాలను ఎందుకు బయటపెట్టరని కేశవ్‌ మండిపడ్డారు. ‘‘నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టుపై వైకాపా ప్రభుత్వం హయాంలోనే అర్జా శ్రీకాంత్‌ ఇచ్చిన నివేదికను ఎందుకు బయట పెట్టట్లేదు? తెదేపా ప్రభుత్వంగానీ, చంద్రబాబుగానీ తప్పులు చేసినట్టుగా ఆ నివేదికలో లేదు. ఎవరికి, ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయని అడిగితే సమాధానం చెప్పరు’’ అన్నారు.

నిధులు విడుదల చేసింది ప్రేమచంద్రారెడ్డే కదా?

‘‘జగన్‌ ముఖ్యమంత్రయ్యాక ఆరు నెలలకోసారి నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులపై సమీక్షిస్తున్నారు. చంద్రబాబు ఏర్పాటుచేసిన నైపుణ్యశిక్షణ కేంద్రాల్లోనే జగన్‌ ప్రభుత్వం కూడా యువతకు శిక్షణనిస్తోంది. అన్నక్యాంటీన్లనే మూసేసిన జగన్‌... నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులో తెదేపా ప్రభుత్వం అవినీతి చేసుంటే, నైపుణ్య శిక్షణకేంద్రాల్ని ఎందుకు కొనసాగిస్తున్నారు? నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులో 10% సొమ్మును విడుదల చేసింది ప్రేమచంద్రారెడ్డే కదా? సీమెన్స్‌ సంస్థ రూ.3వేల కోట్ల పరికరాలు, సాఫ్ట్‌వేర్‌ తెచ్చామని చెబితే... అది నిజమో కాదో తేల్చాలని కేంద్రప్రభుత్వ సంస్థ సెంట్రల్‌ టూల్‌డిజైన్‌కు ఆయన లేఖ రాశారు. సాఫ్ట్‌వేర్‌ను, ఇతర పరికరాల్ని సీమెన్స్‌ సంస్థ సమకూర్చిందని ఆ సంస్థ నివేదిక ఇచ్చింది. తర్వాతే ప్రేమచంద్రారెడ్డి నిధులు విడుదల చేశారు. తెదేపా పెద్దల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లాయని దుష్ప్రచారం చేయడానికి బదులు, ఆ ఖాతాల వివరాలేవో ప్రభుత్వం బయటపెట్టొచ్చు కదా?’’ అని కేశవ్‌ ప్రశ్నించారు.


కుంభకోణం జరిగిందని ఏసీబీ, సీబీఐ ఎక్కడైనా చెప్పాయా?

‘‘తెదేపా హయాంలో చేపట్టిన నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఏసీబీ, సీబీఐ నివేదికల్లో చెప్పాయా? విభజన అనంతరం ఏపీలోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంపై తెదేపా ప్రభుత్వం దృష్టిపెట్టింది. అదే సమయంలో తాము దేశవ్యాప్తంగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటుచేశామని, గుజరాత్‌తోనూ ఒప్పందం చేసుకున్నామని సీమెన్స్‌ సంస్థ చెప్పింది. కొందరు ఐఏఎస్‌ అధికారులను గుజరాత్‌ వెళ్లి సీమెన్స్‌ శిక్షణ కార్యక్రమాల్ని పరిశీలించాలని చంద్రబాబు ఆదేశించారు. అనంతరం సీమెన్స్‌, డిజైన్‌టెక్‌, ఏపీ ప్రభుత్వం త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నాయి. వేరే రాష్ట్రాలూ సీమెన్స్‌తో ఒప్పందాలు చేసుకున్నాయి. డిజైన్‌టెక్‌ సంస్థ జీఎస్టీ ఎగ్గొట్టిందని ఆరోపణలు వచ్చాయి. దానిపై పుణెలో విచారణ మొదలైంది. సీబీఐ, ఏసీబీ విచారణ జరిపి నివేదిక ఇచ్చాయి. ఇప్పుడు జగన్‌ దాని గురించి మాట్లాడుతూ... ఆ నివేదిక నాటి ముఖ్యమంత్రికి అందింది కాబట్టే, దాన్ని పక్కనపెట్టారని అంటున్నారు. ఒక సంస్థ జీఎస్టీ ఎగ్గొట్టడం... ఆ సంస్థ వ్యవహారమన్న వాస్తవం ప్రజలకు చెప్పకుండా, చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని చెప్పడం మసిపూసి మాయ చేయడమే’’ అని కేశవ్‌ విమర్శించారు.


గుజరాత్‌ ప్రభుత్వానికీ డబ్బులు ముట్టాయని జగన్‌ చెప్పగలరా?

‘‘జగన్‌రెడ్డి సీఐడీ విచారణతో సంతృప్తి చెందకుండా, ఈడీ విచారణ కోరారు. ఈడీ విచారిస్తుండగానే... మళ్లీ సీఐడీతో ఎందుకు విచారణ జరిపిస్తున్నారు? ఈడీ ఛార్జిషీట్‌ వేసేవరకూ ఎందుకు ఓపిక పట్టలేకపోతున్నారు? ఒక అంశంపై విచారణ జరుగుతుండగా... దానిపై సభలో మాట్లాడకూడదని సీఎంకు తెలీదా? నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులో గుజరాత్‌ ప్రభుత్వ పెద్దలకూ డబ్బులు ముట్టాయని జగన్‌ అనగలరా? ఏపీతో పాటు ఆ ప్రాజెక్టును అమలుచేసిన మరో నాలుగు రాష్ట్రప్రభుత్వాలూ అవినీతికి పాల్పడ్డాయా?’’ అని కేశవ్‌ దుయ్యబట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని