వైకాపా ఎమ్మెల్యేలు చంపేస్తామని బెదిరించారు

‘‘వైకాపా ఎమ్మెల్యేలు టీజేఆర్‌ సుధాకర్‌బాబు, వీఆర్‌ ఎలీజా, వెలంపల్లి శ్రీనివాస్‌, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, మరికొందరు అసెంబ్లీలో నాపైన, నా సహచర ఎమ్మెల్యేలపైన భౌతికదాడికి పాల్పడ్డారు.

Published : 21 Mar 2023 05:20 IST

నా ఛాతీపైన కొట్టారు.. తోసేశారు
సహచర ఎమ్మెల్యేలపైనా భౌతికదాడికి పాల్పడ్డారు
వారిపై చర్యలు తీసుకోవాలి
తుళ్లూరు పోలీసుస్టేషన్‌లో ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి ఫిర్యాదు

ఈనాడు - అమరావతి, తుళ్లూరు గ్రామీణం-న్యూస్‌టుడే: ‘‘వైకాపా ఎమ్మెల్యేలు టీజేఆర్‌ సుధాకర్‌బాబు, వీఆర్‌ ఎలీజా, వెలంపల్లి శ్రీనివాస్‌, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, మరికొందరు అసెంబ్లీలో నాపైన, నా సహచర ఎమ్మెల్యేలపైన భౌతికదాడికి పాల్పడ్డారు. చంపేస్తామని బెదిరించారు. తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అసభ్య పదజాలంతో దూషించారు. దీనివెనుక నేరపూరిత కుట్ర ఉంది. వారిపై కేసు నమోదుచేసి చర్యలు తీసుకోవాలి’’ అని ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి సోమవారం రాత్రి తుళ్లూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తెదేపా ఎమ్మెల్యేలు బెందాళం అశోక్‌, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మల రామానాయుడు, రామరాజు, ఇతర తెదేపా నాయకులతో కలిసి సోమవారం రాత్రి తుళ్లూరు ఎస్సై సోమేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు.

నా ఛాతీపై కొట్టారు... తోసేశారు

‘‘జీవో1పై చర్చకు అనుమతించాలని కోరుతూ అసెంబ్లీలో మేం వాయిదా తీర్మానాన్ని ఇచ్చాం. దాన్ని సభాపతి తిరస్కరించారు. చర్చకు అనుమతించాలంటూ ఉదయం 10 గంటల సమయంలో నేను, బెందాళం అశోక్‌, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మరికొందరం కలిసి సభాపతి పోడియం వద్దకు వెళ్లాం. అదే సమయంలో వైకాపా ఎమ్మెల్యే టీజే సుధాకర్‌బాబు సభాపతి పోడియం వైపు వచ్చారు. నా ఛాతీపై కొట్టారు. నన్ను తోసేశారు. నేను కిందపడిపోయాను. బెందాళం అశోక్‌ నన్ను కాపాడేందుకు యత్నించారు. అదే సమయంలో వైకాపా ఎమ్మెల్యే వీఆర్‌ ఎలిజా... సుధాకర్‌బాబుతో కలిసి వచ్చి.. అశోక్‌పైన, నాపైన భౌతికదాడికి పాల్పడ్డారు. తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. చంపేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో అశోక్‌ బొటనవేలికి గాయమైంది. పోడియం కింద నిలుచున్న గోరంట్ల బుచ్చయ్యచౌదరి వైపు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, వైకాపా ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు దూసుకెళ్లారు. ఆయన ఛాతీపై కొట్టారు. తోసేసి.. నా దగ్గరకు వచ్చేందుకు ప్రయత్నించారు. మధ్యలో ఉన్న బుచ్చయ్యచౌదరిపై దాడిచేసి, నన్ను దూషించారు. ఆ తర్వాత బుచ్చయ్యచౌదరిని చంపేస్తామని బెదిరించారు. తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు’’ అని బాలవీరాంజనేయస్వామి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు