మావాళ్లను కొట్టి.. మాపైనే నిందలు

‘‘శాసనసభలో మా ఎమ్మెల్యేలపై అధికారపార్టీ సభ్యులు దాడిచేయడమే కాక.. మావాళ్లే వారిపై దాడిచేసినట్టు చెబుతున్నారు. ఇదీ కోడికత్తి, గొడ్డలివేటు డ్రామా లాంటిదే.

Updated : 21 Mar 2023 06:39 IST

ఇది మరో కోడికత్తి.. గొడ్డలివేటు లాంటి డ్రామా
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీచింది చిన్నగాలే.. రేపు రాబోయేది సునామీ
తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు, అమరావతి: ‘‘శాసనసభలో మా ఎమ్మెల్యేలపై అధికారపార్టీ సభ్యులు దాడిచేయడమే కాక.. మావాళ్లే వారిపై దాడిచేసినట్టు చెబుతున్నారు. ఇదీ కోడికత్తి, గొడ్డలివేటు డ్రామా లాంటిదే. మా ఎమ్మెల్యేలైన బాలవీరాంజనేయస్వామి, 75 ఏళ్ల బుచ్చయ్యచౌదరిపై దాడిచేశారు. ఒక సైకో వందలమంది సైకోలను తయారుచేస్తాడు. అలాంటివాళ్లను శాశ్వతంగా రాజకీయాల నుంచి తరిమికొట్టాలంటే ప్రజల తిరుగుబాటు తప్ప మరో దారి లేదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు దానికి నాంది పలికారు. ఇప్పుడు వీచింది చిన్న గాలే. రేపు రాబోయేది సునామీ. దానిలో వైకాపా నాయకులు కొట్టుకుపోవడం ఖాయం’’ అని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తెదేపా ఎమ్మెల్యేలపై దాడి శాసనసభ చరిత్రలో చీకటిరోజుగా ఆయన అభివర్ణించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు తెదేపా అభ్యర్థులకు అభినందన కార్యక్రమం సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఆ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల గొంతునొక్కేందుకు ప్రభుత్వం తెచ్చిన జీవో 1కి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ‘‘జీవో 1ను రద్దుచేయాలని కోరితే మా ఎమ్మెల్యేలపై దాడిచేశారు. అధికారంలో ఉన్నవారు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. 151 మంది ఉన్నామని, ఏమైనా చేయగలమని వైకాపా ఎమ్మెల్యేలు గతంలోనూ చాలాసార్లు మాట్లాడారు. ఏం... మేం 20 మందే ఉంటే, మమ్మల్ని చంపేస్తారా? ఏమనుకుంటున్నారు? రేపటినుంచి మీరు బయట తిరగగలరా? మీ పోలీసులు కూడా మిమ్మల్ని కాపాడలేరు. మీరు బెదిరిస్తే మేం పారిపోం. మమ్మల్ని బెదిరిస్తేనో, భయభ్రాంతుల్ని చేస్తేనో, ఒక స్వామినో, మరో ఎమ్మెల్యేనో కొడితేనో, కేసులు పెడితేనో భయపడిపోం. ఎన్నో సంక్షోభాలు చూశాం. మాకు ఇదో లెక్క కాదు’’ అని ఆయన హెచ్చరించారు. 

బాధపడుతున్నా...

‘‘నా తమ్ముడు, ఎమ్మెల్యే స్వామిపై దెబ్బపడకుండా చూడలేకపోయానని బాధపడుతున్నా. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడూ... విపక్ష సభ్యుల్ని కొట్టించాలన్న ఆలోచన రాలేదు. ఈ రోజు అయిదు కోట్ల ప్రజల సాక్షిగా ఎమ్మెల్యేకే రక్షణ లేకుండా పోయింది. మా ఎమ్మెల్యేలను కొట్టి, కనీసం విచారం వ్యక్తం చేయలేదు. పైగా సస్పెండ్‌ చేశారు’’ అని చంద్రబాబు మండిపడ్డారు. 1984లో ఆగస్టు సంక్షోభం తర్వాత... ఎన్టీఆర్‌ అసెంబ్లీకి బలపరీక్షకు వెళ్లినప్పుడూ ఇలాంటి ఘోరం జరగలేదన్నారు. ‘‘రాష్ట్ర విభజన సమయంలో పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. అసెంబ్లీకి విభజన బిల్లు పంపి.. చర్చించి ఓటు వేయాలన్నారు. అప్పుడూ సభ్యులు కొట్టుకోలేదు. పరిటాల రవిని చంపినప్పుడు 16 రోజులు, ఎల్లంపల్లి ఎత్తిపోతల ప్రాజెక్టుపై 19 రోజులు చర్చ జరిగింది. ఎన్నో అవిశ్వాస తీర్మానాలు పెట్టాం. హోరాహోరీ పోరాడాం. అప్పుడూ ఇలాంటి ఘటనల్లేవు. ’’ అని చంద్రబాబు గుర్తుచేశారు.

సభాగౌరవాన్ని మంటగలిపిన సైకో

‘‘శాసనసభలో ఆవేశంలో కొన్ని ఘటనలు జరగొచ్చు. కానీ దానికి బాధ్యులలో పరివర్తన వస్తుంది. అక్కడి పెద్దవాళ్లంతా కూర్చుని... ఇలాంటి తప్పులు జరగకూడదని సర్దిచెబుతారు. తప్పు చేసినవారు విచారం వ్యక్తం చేస్తారు. కానీ వైకాపా    సభ్యులకు అలాంటి సంస్కారం లేదు. సభ గౌరవాన్ని మంటగలిపిన సైకో జగన్‌రెడ్డి. ఒక నాయకుడికి విజ్ఞత లేనప్పుడు, పనికిమాలిన వ్యక్తులు ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి’’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

విలన్లను ఇంటికి పంపే బాధ్యత ప్రజలదే

‘‘తెదేపా ఎమ్మెల్యేలపై వైకాపా సభ్యులు దాడిచేస్తుంటే స్పీకర్‌ ఎందుకు పట్టించుకోలేదు? ఆయన అంత నిస్సహాయుడా? తెదేపా సభ్యులు గొడవ చేస్తుంటే... మార్షల్స్‌ని పిలిచి సస్పెండ్‌ చేసే అవకాశం స్పీకర్‌కి ఉంది కదా? రోజూ చేస్తున్నది అదే కదా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం? ప్రజాసమస్యలపై ఎవరూ మాట్లాడకూడదు, మాట్లాడితే దాడులు చేస్తామంటే ఎలా? స్వామీ... ఈ రోజు జరిగిన దానికి మీరు బాధపడొద్దు. మీ త్యాగం వృథాగా పోదు. విలన్లుగా వచ్చి మిమ్మల్ని కొట్టినవారు మళ్లీ శాసనసభలో అడుగుపెట్టకుండా చేసే బాధ్యత ప్రజలది. దానికి ప్రతి తెదేపా కార్యకర్తా కృషిచేస్తారు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

జీవో 1పై తాడోపేడో తేల్చుకుంటాం

‘‘జీవో 1 తెచ్చినందుకు ప్రభుత్వానికి సిగ్గుండాలి. ప్రజల సమస్యలపై మాట్లాడే హక్కు ప్రతిపక్షానికి, ప్రజాసంఘాలకు ఉంది. దాన్ని కాదనే హక్కు ఈ ప్రభుత్వానికి ఎక్కడుంది?’’ అని చంద్రబాబు మండిపడ్డారు. ఈ నెల 25 నుంచి తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించి జీవో 1పై ప్రజల్లో చైతన్యం తెస్తారని, వారిని శాసనసభలో కొట్టిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళతారని చంద్రబాబు తెలిపారు.

కప్పం కట్టలేదని బలి తీసుకున్నారు

వైకాపా నాయకుల ఇసుక దందాకు ప్రేమ్‌రాజు అనే వ్యక్తి బలైపోయారని చంద్రబాబు ఆరోపించారు. ‘‘అధికారుల్ని నేరాల్లో భాగస్వాముల్ని చేసినట్టే... ఇక్కడ అవినీతిలో భాగస్వాముల్ని చేశారు. రాష్ట్రం ఎక్కడికి పోతోంది?’’ అని ఆయన మండిపడ్డారు.

జగన్‌ పులివెందుల పిల్లి... రామగోపాల్‌రెడ్డే పులి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెదేపా అభ్యర్థుల్ని చంద్రబాబు అభినందించారు. ‘‘జగన్‌రెడ్డి పులివెందులలో పిల్లిలా మారితే... అదే పులివెందుల నుంచి గెలిచిన రామగోపాల్‌రెడ్డి పులిలా మారారు. పులివెందులలో ఇన్నాళ్లూ మన నాయకులు సరిగ్గా చేయకే... వాళ్లు గెలుస్తూ వచ్చారు. ఈ ఎన్నికల్లో పులివెందులలో ఒక బూత్‌లో వైకాపా నాయకులు రౌడీయిజం చేస్తుంటే రామగోపాల్‌రెడ్డి వాళ్లందర్నీ బయటకు లాగిపడేశారు. దాంతో ఒక సానుకూల సంకేతం వెళ్లింది. పులివెందులలో జగన్‌రెడ్డి ఓడిపోయారు. రామగోపాల్‌రెడ్డి గెలిచారు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘ఉత్తరాంధ్ర నుంచి గెలిచిన వేపాడ చిరంజీవిరావుకు విద్యావేత్తగా మంచిపేరుంది. ఆయనను అభ్యర్థిగా ప్రకటించిన మర్నాడే... ఆ స్థానాన్ని గెలుస్తామన్న నమ్మకం కలిగింది. తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీగా గెలిచిన శ్రీకాంత్‌... పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నానంటూ ముందుకొచ్చి తన కాలేజీలో పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. పార్టీ అంటే ఆయనకు అచంచల విశ్వాసం’’ అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ముగ్గురి విజయంలో వారి భార్యల కృషి కూడా ఎంతో ఉందని ప్రశంసించారు.


తెదేపాలోకి వైకాపా నాయకులు

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: కుప్పంకు చెందిన పలువురు వైకాపా నాయకులు సోమవారం తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో 60 మంది వైకాపా దళిత నాయకులు చంద్రబాబును కలిశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని