గిరిజనుల గొంతు తడపని భగీరథ

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఐటీడీఏ ద్వారా తవ్వించిన బావులే రాష్ట్రవ్యాప్తంగా గిరిజనుల గొంతు తడుపుతున్నాయని.. భారాస సర్కారు రూ.42 వేల కోట్లతో చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఒక్క గిరిజన గ్రామానికీ సక్రమంగా తాగునీరు సరఫరా కావడం లేదని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క విమర్శించారు.

Published : 21 Mar 2023 04:21 IST

సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ధ్వజం

ఈనాడు డిజిటల్‌-ఆసిఫాబాద్‌, న్యూస్‌టుడే-జైనూర్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఐటీడీఏ ద్వారా తవ్వించిన బావులే రాష్ట్రవ్యాప్తంగా గిరిజనుల గొంతు తడుపుతున్నాయని.. భారాస సర్కారు రూ.42 వేల కోట్లతో చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఒక్క గిరిజన గ్రామానికీ సక్రమంగా తాగునీరు సరఫరా కావడం లేదని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క విమర్శించారు. కుమురం భీం నినాదం జల్‌, జంగల్‌, జమీన్‌ పోరాట స్ఫూర్తితో భారాసపై ఉద్యమం చేయాలని గిరిజనులకు పిలుపునిచ్చారు. భట్టి చేపట్టిన ‘హాథ్‌ సే హాథ్‌ జోడో’ పాదయాత్ర సోమవారం అయిదో రోజుకు చేరుకుంది. ఉదయం ఆదిలాబాద్‌ జిల్లాలోని ఉట్నూరు మండలం శంకర్‌నాయక్‌ తండాలో ప్రారంభమైంది. హస్నాపూర్‌, జంగాం, ఉషేగాం మీదుగా కుమురం భీం జిల్లా జైనూర్‌ మండలంలోకి చేరుకుంది. జంగాం రాంజీగూడలో ఆదివాసీ ఓజ కళాకారులు తయారు చేసిన బొమ్మలను భట్టి పరిశీలించారు. మార్కెటింగ్‌, ధర గురించి అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం జైనూర్‌లోని కుమురం భీం కూడలి వద్ద మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు ఎటు పోతున్నాయని ప్రశ్నించారు. దేశ సంపదను అదానీకి మోదీ దోచిపెడుతున్నారని ఆరోపించారు. రాహుల్‌ గాంధీని అరెస్ట్‌ చేయాలన్న భాజపా నేతల వ్యాఖ్యలను ఖండించారు. మద్యం కేసులో ఆప్‌ నేత కేజ్రీవాల్‌, ఎమ్మెల్సీ కవితలను అరెస్ట్‌ చేయాల్సిందేనన్నారు. పాదయాత్రకు లభిస్తున్న జనాదరణ చూసి, ప్రతీచోట విద్యుత్తు సరఫరాను నిలిపివేస్తున్నారని ఆరోపించారు. ఆయన వెంట ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు, కాంగ్రెస్‌ పార్టీ కుమురం భీం జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని