‘రాహుల్‌, అదానీల’ రగడే

పార్లమెంటు ఉభయ సభలు సోమవారం ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకుండానే వాయిదాపడ్డాయి. లండన్‌లో చేసిన వ్యాఖ్యలపై బేషరతుగా రాహుల్‌ గాంధీ క్షమాపణలు చెప్పాలని అధికార భాజపా, అదానీ అంశంపై జేపీసీ వేయాల్సిందేనని విపక్షాలు ఎవరికి వారు పట్టుబట్టడంతో రెండు సభల్లో గందరగోళం నెలకొంది.

Published : 21 Mar 2023 04:58 IST

పార్లమెంటు ఉభయ సభలు వాయిదా
కాంగ్రెస్‌ నేత క్షమాపణకు భాజపా పట్టు
అదానీపై జేపీసీకి విపక్షాల డిమాండ్‌
మాట్లాడేందుకు అవకాశమివ్వాలని స్పీకరుకు రాహుల్‌ లేఖ

దిల్లీ: పార్లమెంటు ఉభయ సభలు సోమవారం ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకుండానే వాయిదాపడ్డాయి. లండన్‌లో చేసిన వ్యాఖ్యలపై బేషరతుగా రాహుల్‌ గాంధీ క్షమాపణలు చెప్పాలని అధికార భాజపా, అదానీ అంశంపై జేపీసీ వేయాల్సిందేనని విపక్షాలు ఎవరికి వారు పట్టుబట్టడంతో రెండు సభల్లో గందరగోళం నెలకొంది. ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే లండన్‌లో రాహుల్‌ వ్యాఖ్యల అంశాన్ని భాజపా సభ్యులు లేవనెత్తి నినాదాలకు దిగారు. వారికి పోటీగా కాంగ్రెస్‌, ఇతర పక్షాల సభ్యులు అదానీ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండు చేస్తూ నినాదాలు చేశారు. దేశం మొత్తం చూస్తోందని, అందరూ కూర్చోవాలని స్పీకరు ఓం బిర్లా ఎంత విజ్ఞప్తి చేసినా ఎవరూ వినలేదు. దీంతో ఆయన సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఇరు పక్షాల నేతలు తన ఛాంబరుకు వస్తే మాట్లాడి సమస్యను పరిష్కరించుకుందామని, సభను సజావుగా జరుపుకొందామని ఈ సందర్భంగా సూచించారు. శిరోమణి అకాలీదళ్‌ ఎంపీ హర్‌సిమ్రత్‌ కౌర్‌ సభలో ప్లకార్డు ప్రదర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభమాయ్యాకా పరిస్థితులు చక్కబడలేదు. గందరగోళం మధ్యే కొన్ని బిల్లులను, నివేదికలను ప్రభుత్వం సభ ముందుంచింది. ఆ తర్వాత సభను స్పీకరు మంగళవారానికి వాయిదా వేశారు.

రాజ్యసభలోనూ..

రాజ్యసభలోనూ సోమవారం పరిస్థితులు చక్కబడలేదు. రాహుల్‌, అదానీ అంశాలపై సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో సభ రెండుసార్లు సమావేశమై వెంటనే వాయిదా పడింది. ఉదయం భాజపా, విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించడంతో ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. సభ మళ్లీ 2 గంటలకు సమావేశమైనా అదే తీరు కొనసాగింది. బిజూ జనతాదళ్‌ సభ్యుడిని మాట్లాడాలని డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ సూచించారు. ఆయన మాట్లాడేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో రాజ్యసభ మంగళవారానికి వాయిదా పడింది.

నా వ్యాఖ్యలపై సభలో మాట్లాడతా: రాహుల్‌ లేఖ

లండన్‌లో తాను చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభలో మాట్లాడేందుకు అవకాశమివ్వాలని స్పీకరు ఓం బిర్లాకు రాహుల్‌ గాంధీ లేఖ రాశారు. లండన్‌ నుంచి వచ్చాక గతవారం ఆయన స్పీకరును కలిశారు. తాజాగా లేఖ రాశారు. ఇప్పటిదాకా రాహుల్‌ తన వ్యాఖ్యలపై బహిరంగంగా స్పందించలేదు.

క్షమాపణలు చెబితేనే సభ జరిగేది: కేంద్ర మంత్రి

లండన్‌లో చేసిన వ్యాఖ్యలపై బేషరతుగా రాహుల్‌ గాంధీ క్షమాపణలు చెబితేనే సభ సజావుగా సాగే అవకాశముందని కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి స్పష్టం చేశారు. ‘ఎవరైనా విదేశాలకు వెళ్లినప్పుడు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంటుంది. కానీ ఆ స్వేచ్ఛ బాధ్యతతో కూడుకున్నదై ఉండాలి. ప్రజాస్వామ్య మౌలిక పునాదిపైనే దాడి జరుగుతోందని రాహుల్‌ విదేశీ గడ్డపై ఆరోపించారు. విదేశీయుల జోక్యాన్ని కోరారు. అందుకే ఆయన క్షమాపణలు చెప్పాకే సభ వాయిదాల పర్వానికి తెరపడుతుంది’ అని పురి స్పష్టం చేశారు.

ప్రభుత్వానిదే బాధ్యత: విపక్షాలు

పార్లమెంటులో ప్రతిష్టంభనకు అధికార భాజపాదే బాధ్యతని విపక్షాలు విమర్శించాయి. అదానీ అంశంపై జేపీసీ వేయకుండా అడ్డుకోవడానికే రాహుల్‌ అంశాన్ని తెరమీదకు తెస్తోందని ఆరోపించాయి. సోమవారం ఉదయం కాంగ్రెస్‌, డీఎంకే, ఆర్జేడీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, జేడీయూ, ఆప్‌, శివసేన నేతలు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో సమావేశమై పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఉదయం సభ వాయిదా పడ్డాక వారు మీడియాతో మాట్లాడారు. ‘జేపీసీ వేయడానికి ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది. బదులుగా అంశాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోంది. జేపీసీ వేసేవరకూ మా ఆందోళనలను ఆపేది లేదు’ అని స్పష్టం చేశారు. మరోవైపు మంగళవారం సభలో రాహుల్‌ గాంధీ మాట్లాడేందుకు అనుమతి కోరామని, స్పీకరు అనుమతిస్తే ఆయన మాట్లాడతారని ఖర్గే తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు