సమయమొచ్చినప్పుడు ప్రజలే సమాధానమిస్తారు

అవినీతికర భాజపా ప్రభుత్వ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, సమయమొచ్చినప్పుడు ప్రజలే సరైన సమాధానమిస్తారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు.

Published : 21 Mar 2023 05:19 IST

ప్రియాంకా గాంధీ వ్యాఖ్య

దిల్లీ: అవినీతికర భాజపా ప్రభుత్వ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, సమయమొచ్చినప్పుడు ప్రజలే సరైన సమాధానమిస్తారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు. దిల్లీ పోలీసులు తన సోదరుడు రాహుల్‌ గాంధీ ఇంటికి రావడంపై ఆమె ట్విటర్‌లో స్పందించారు. ‘మహిళల తరఫున ఎందుకు మాట్లాడుతున్నారని రాహుల్‌కు పోలీసులు నోటీసు ఇచ్చారు. ఆయనే కాదు.. దళితులు, గిరిజనులు, పేదలు, రైతులు, యువత భాజపా ప్రభుత్వ వేధింపులను ఎదుర్కొంటున్నారు. 38 షెల్‌ కంపెనీలను పెట్టిన అదానీకి మాత్రం ఎటువంటి నోటీసులు ఇవ్వరు’ అని ఆమె విమర్శించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈవ్‌ టీజింగ్‌కు విద్యార్థిని బలైన సంఘటన భాజపా ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనంగా నిలుస్తోందని మరో ట్వీట్‌లో ధ్వజమెత్తారు.

రాహుల్‌కు ఒమర్‌ అబ్దుల్లా మద్దతు

జమ్ము: మహిళలు ఇంకా వేధింపులకు గురవుతున్నారన్న రాహుల్‌ గాంధీ వ్యాఖ్యల్లో తప్పేముందని, దానికే నోటీసులిస్తారా అని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా ప్రశ్నించారు. ‘ఇది దేశంలో నిత్యం ఏదో ఒకచోట జరగడం నిజం కాదా? ఆ విషయాన్ని రాహుల్‌ గాంధీ చెప్పడంలో కొత్తేముంది. ఏ పత్రిక తిరగేసినా ఎక్కడో ఒకచోట అత్యాచార వార్తలు కనిపిస్తూనే ఉంటాయి కదా’ అని పేర్కొన్నారు. ఆయన కశ్మీర్‌ ఒక్కదాని గురించే మాట్లాడలేదని, పాదయాత్ర సందర్భంగా దేశంలోని పరిస్థితిని తనతో ప్రస్తావించారని సోమవారమిక్కడ ఆయన తెలిపారు.


భాజపాలో చేరిన వైకాపా మైనార్టీ సంఘ నేత చాంద్‌బాషా

ఈనాడు, అమరావతి: వైకాపా మైనార్టీ సంఘం నాయకుడు షేక్‌ చాంద్‌బాషా భాజపాలో చేరారు. విజయవాడలోని భాజపా కార్యాలయంలో సోమవారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. గతంలో గుంటూరులో మున్సిపల్‌ కౌన్సిలర్‌గా, పీసీసీ కార్యదర్శిగా, మైనార్టీ విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ప్రస్తుతం వైకాపా మైనార్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఆ పదవికి రాజీనామాచేసి, భాజపాలో చేరారు. ఈ మేరకు రాష్ట్ర భాజపా కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.


తెదేపా ఎమ్మెల్యేలపై దాడిని ఖండిస్తున్నాం: సీపీఐ

ఈనాడు, అమరావతి: శాసనసభలో తెదేపా సభ్యులపై వైకాపా ఎమ్మెల్యేల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ ప్రకటించారు. ‘‘ప్రజాస్వామిక వ్యవస్థకు పట్టుగొమ్మగా ఉండాల్సిన శాసనసభ దాడులకు వేదిక కావడం విచారకరం. ప్రజాసమస్యలపై పరిష్కారానికి చర్చల ద్వారా కృషిచేయాల్సిన అధికార పార్టీ శాసనసభ్యులు.. ప్రతిపక్ష తెదేపా ఎమ్మెల్యేలపై భౌతిక దాడులకు తెగబడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఇదొక దురదృష్టకరమైన రోజు. ఇంత జరిగినా సీఎం జగన్‌ స్పందించకపోవడం తగదు’’ అని వెల్లడించారు.


అరాచక.. గూండా పాలన: సీపీఎం

ఈనాడు, అమరావతి: శాసనసభలో తెదేపా ఎమ్మెల్యేలపై వైకాపా ఎమ్మెల్యేల దాడిని చూస్తే ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనిపిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. జీవో-1కు వ్యతిరేకంగా చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జీవో-1పై అడిగితే కొట్టడడమేంటి? ఇది అరాచక, గూండా పాలన. దీనికి స్వస్తి చెప్పకపోతే ప్రజలే బుద్ధి చెబుతారు. అసెంబ్లీలో ప్రతిపక్షాల నిరసన కొత్తకాదు. భగత్‌సింగ్‌ పార్లమెంటులో పేపర్లు విసిరేశారు. వైకాపా ప్రభుత్వానికి పతనం దగ్గర పడిందని హెచ్చరించారు. ధర్నాచౌక్‌లో ఆందోళనలకు అనుమతించడం లేదు. శ్మశాన కార్మికులు తమ సమస్యలపై నిరసన తెలిపేందుకు వస్తే అరెస్టుచేశారు. రాష్ట్రాన్నే జైలుగా మార్చేశారు. ఈ జైల్లోనే ప్రజలు వైకాపాకు సమాధి కడతారు. సీఎం జగన్‌ సభకు పిల్లలను తరలించి, వారికి ఆహారం పెట్టలేదు. సీఎంకు ఒక నిబంధన, ప్రతిపక్షాలకు ఒక నిబంధనా? పౌరహక్కుల కోసం పోరాడేందుకు ఎవ్వరి అనుమతీ అవసరం లేదు’’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని