Vitapu-Botsa: విఠపు పరీక్షలో.. బొత్సకు 2 మార్కులే!

‘అడిగిన ప్రశ్న ఏంటి? మీరు చెప్పే సమాధానం ఏమిటి?  మీరు చెప్పిన సమాధానానికి ఉపాధ్యాయుడిగా 10కి కనీసం 2 మార్కులు కూడా నేను వేయలేను’ అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణపై ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విఠపు బాల సుబ్రమణ్యం విరుచుకుపడ్డారు.

Updated : 21 Mar 2023 08:25 IST

పీడీఎఫ్‌ ఎమ్మెల్సీల ప్రశ్నల పరంపర
సమాధానం చెప్పలేక ఇబ్బంది పడిన మంత్రి బొత్స
డీఎస్‌సీ ద్వారా ఉద్యోగాల భర్తీపై కొరవడిన స్పష్టత

ఈనాడు, అమరావతి: ‘అడిగిన ప్రశ్న ఏంటి? మీరు చెప్పే సమాధానం ఏమిటి?  మీరు చెప్పిన సమాధానానికి ఉపాధ్యాయుడిగా 10కి కనీసం 2 మార్కులు కూడా నేను వేయలేను’ అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణపై ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విఠపు బాల సుబ్రమణ్యం విరుచుకుపడ్డారు. శాసన మండలిని తప్పుదోవ పట్టించేలా మంత్రి ప్రశ్నకు పొసగని సమాధానం ఇచ్చారని విమర్శించారు. ‘సభలో అడిగిన ప్రశ్నలకు కచ్చితమైన సమాధానం రాదు..వచ్చినా సరైన సమాచారం ఇవ్వరన్న అభిప్రాయాన్ని కలిగించవద్దు’ అని ఆయన మంత్రికి సూచించారు. సభలో ఈ చర్చకు దారితీసిన పరిస్థితులు ఇవి.

‘2019 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం నిర్వహించిన డీఎస్‌సీల వివరాలు తెలపండి? నియమించిన ఉపాధ్యాయుల సంఖ్య చెప్పండి? ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు కొత్త డీఎస్‌సీని ప్రకటించేందుకు ప్రభుత్వం దగ్గర ఏమైనా ప్రతిపాదన ఉందా’ అని తెదేపా, పీడీఎఫ్‌ సభ్యులు శాసనమండలిలో ప్రశ్నించారు. దీనికి మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానమిస్తూ.. ‘2019లో డీఎస్‌సీ ద్వారా 14,219 పోస్టులను భర్తీ చేశాం. 2018, 1998లలో నిర్వహించిన డీఎస్‌సీలో అర్హత సాధించిన అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇస్తున్నాం. ఇంకా 771 పోస్టులు మాత్రమే ఖాళీ ఉన్నాయి. పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచడం వల్ల ఖాళీలు రాలేదు. శాంక్షన్‌ పోస్టులను ఎక్కడా రద్దు చేయలేదు’ అని చెప్పారు. మంత్రి ఇచ్చిన ఈ సమాధానంపై పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ విఠపు బాల సుబ్రమణ్యం తీవ్రంగా స్పందించారు. ‘సభ్యులు అడిగిన ప్రశ్న ఏంటి? మంత్రి ఇచ్చిన సమాధానం ఏంటి? ఈ ప్రశ్నకు విద్యార్థి ఎవరైనా ఇదే జవాబు రాస్తే.. 10కి 2 మార్కులు కూడా నేను ఇవ్వను. ఉపాధ్యాయుడిని కాబట్టి ఇలా చెబుతున్నా. ఎప్పుడో చేసిన నియామకాల గురించి చెప్పడం ఏంటి? కొత్త డీఎస్‌సీ ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి ఉందా..లేదా అని అడిగిన ప్రశ్నకు మంత్రి ఎక్కడ సమాధానం చెప్పారు. సహజంగా మీరు చెప్పే మాటలు ‘‘ఉంది’’..‘‘లేదు’’..‘‘ఉత్పన్నం కాదు’’ అనే పదాల్లో ఏదో ఒకటి చెప్పండి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వాట్సప్‌ గ్రూపులో పెడితే.. ఆశ్చర్య పోతారు

‘సభలో అడిగిన ప్రశ్న.. మీరు చెప్పిన సమాధానం.. రెండింటినీ ఫొటో తీసి ఉపాధ్యాయుల వాట్సప్‌ గ్రూప్‌లో పెడతా. విద్యా శాఖ ఇలాంటి సమాధానం చెప్పిందా అని ఆశ్చర్యపోతారు. రేపటి నుంచి ఉపాధ్యాయులు కూడా ఇదే పద్ధతిలో విద్యార్థులకు పాఠాలు చెప్పాలనుకుంటారు. సభలో వేసిన ప్రశ్నలకు కచ్చితమైన సమాధానం రాదు.. వచ్చినా సరైన సమాచారం ఉండదన్న అభిప్రాయం కలిగించొద్దు’ అని విఠపు సూచించారు. దీంతో ప్రశ్నను సరిగా అర్థం చేసుకోలేక పోవడం వల్లనే సమస్య వచ్చిందని  ఇబ్బంది పడుతూ మంత్రి బొత్స సమాధానం సమాధానం చెప్పాల్సి వచ్చింది.

ప్రభుత్వ చర్యలతో.. ప్రాథమిక విద్య కుప్పకూలింది

‘ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణల వల్ల ప్రాథమిక విద్యా వ్యవస్థ కుప్పకూలింది. హేతుబద్ధీకరణ, సబ్జెక్ట్‌ టీచర్‌ విధానం, 3, 4 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం వంటి చర్యలతో ఈ పరిస్థితి వచ్చింది. 771 పోస్టులు భర్తీ చేస్తే సరిపోతుందా? ఉపాధ్యాయల బదిలీలు చేయడానికి ముందు పాఠశాలల్లో సుమారు 30 వేల పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుందని డీఈవోలు నివేదికలు ఇచ్చింది వాస్తవం కాదా? దశల వారీగా తెలుగు మీడియం తొలగించేశారు. 1.87 లక్షల శాంక్షన్‌ పోస్టులు ఉంటే.. వాటిని 1.60 లక్షలకు తగ్గించడం వాస్తవం కాదా? ఇలా పోస్టుల్లో కోత పెట్టి ఖాళీలు లేవని చెప్పడం భావ్యం కాదు’ అని ఎమ్మెల్సీ విఠపు అన్నారు. ఈ చర్చలో పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ సాబ్జి మాట్లాడుతూ ‘మూడు దశాబ్దాలుగా ఉపాధ్యాయ ఖాళీల భర్తీ చేయడం లేదు. గత ప్రభుత్వం 2018లో ఒక డీఎస్‌సీ వేసింది. 2019 మే డీఎస్‌సీ తరవాత.. వైకాపా హయాంలో ఒక్క డీఎస్‌సీ కూడా వేయలేదు. బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన అభ్యర్థుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది’ అని అన్నారు.  సమావేశాలు ముగిసిన తర్వాత కమిటీ ఏర్పాటు చేసి ఖాళీలపై నిర్ణయం తీసుకుందామని మంత్రి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని