సభలో దాడిపై మండిపడ్డ విపక్షాలు

రాష్ట్ర శాసనసభలో సోమవారం విపక్ష సభ్యులపై జరిగిన దాడిని పలు రాజకీయ పార్టీలు, నాయకులు తీవ్రంగా ఖండించారు.

Updated : 21 Mar 2023 05:42 IST

ఈనాడు-అమరావతి: రాష్ట్ర శాసనసభలో సోమవారం విపక్ష సభ్యులపై జరిగిన దాడిని పలు రాజకీయ పార్టీలు, నాయకులు తీవ్రంగా ఖండించారు. అధికారపక్షం వైఖరిని తప్పుపట్టారు. ఈ దాడిపై పలువురి నేతల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.

ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై శాసనసభలో దాడి రాష్ట్ర చరిత్రలో చీకటి రోజు. ఓ దళిత ఎమ్మెల్యే, మరో వృద్ధ ఎమ్మెల్యేపై వైకాపా ఎమ్మెల్యేలు దాడికి పాల్పడ్డారు. శాసనసభలో దాడి జరుగుతుంటే స్పీకర్‌, మార్షల్స్‌ ఏం చేస్తున్నారు. చట్టసభలోనే శాసనసభ్యులకు రక్షణ లేకపోతే మరెక్కడ దొరుకుతుంది? శాసనసభలో ఘటనలపై కేంద్రం జోక్యం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం తక్షణమే రద్దు చేయాలి.

కొనకళ్ల నారాయణరావు, తెదేపా మాజీ ఎంపీ


దొంగే..దొంగ అన్నట్లుంది

‘‘దొంగే..దొంగ అన్నట్లుగా వైకాపా వాళ్ల వ్యవహారశైలి ఉంది. తెదేపా ఎమ్మెల్యేలపై దాడి చేసి తమపై ప్రతిపక్షాలు దాడి చేసినట్లుగా ప్రచారం చేసుకోవడం హేయం. అసెంబ్లీలో భౌతికదాడులకు దిగడం అప్రజాస్వామికం. ప్రతిపక్ష పార్టీ శాంతియుతంగా, ప్రజాస్వామికంగా నిరసనలు తెలుపుతుంటే వైకాపా ఎమ్మెల్యేలు దాడికి తెగబడ్డారు’’

ఎంఏ షరీఫ్‌, శాసనమండలి మాజీ ఛైర్మన్‌


అహంకారపూరిత చర్య 

‘‘తెదేపా ఎమ్మెల్యేలపై దాడి వైకాపా వాళ్ల అహంకారపూరిత, అసమర్థ చర్య. రాక్షసపాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసున్న వైకాపా ఇప్పుడు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసింది’’

కన్నా లక్ష్మీనారాయణ, తెదేపా నేత


ఫ్యాక్షనిస్టు సీఎం అయితే ఇలాగే ఉంటుంది

‘‘ఫ్యాక్షనిస్టు సీఎం అయితే పరిస్థితి ఎలా ఉంటుందో చట్టసభలో తెదేపా ఎమ్మెల్యేలపై జరిగిన దాడే నిదర్శనం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా విజయాన్ని జీర్ణించుకోలేక మా ఎమ్మెల్యేలపై దాడికి దిగారు. జగన్‌ దౌర్జన్యాలకు భయపడేది లేదు’’

 కేఎస్‌ జవహర్‌, మాజీ మంత్రి


చట్టసభల్లో ప్రతిపక్షాలకు రక్షణ లేదు

‘‘రాష్ట్రంలో ప్రజలకు, చట్టసభల్లో ప్రతిపక్షాలకు రక్షణ లేకుండాపోయింది. సభలో జరిగిన దాడి జగన్‌రెడ్డి మనస్తత్వానికి నిదర్శనం’’

ఎంఎస్‌ రాజు, తెదేపా ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు


గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం

‘‘తెదేపా ఎమ్మెల్యేలపై దాడి చేసిన వెలంపల్లి శ్రీనివాస్‌, సుధాకర్‌బాబు తదితర ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోతే స్పీకర్‌ తమ్మినేని సీతారాంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం’’

బుద్ధా వెంకన్న, ఉత్తరాంధ్ర తెదేపా ఇన్‌ఛార్జి


వైకాపా మూల్యం చెల్లించుకోక తప్పదు

‘‘అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై వైకాపా ఎమ్మెల్యేలు దాడి చేయడాన్ని ఖండిస్తున్నా. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా ఘన విజయాన్ని వైకాపా జీర్ణించుకోలేకపోతోంది. వైకాపా ఎమ్మెల్యేలు వారి అక్కసును నిండు సభలో దాడుల రూపంలో బయటపెట్టారు. ఈ పరిణామాలన్నింటికీ వైకాపా మూల్యం చెల్లించుకోక తప్పదు’’

సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, తెదేపా నేత


నాడు తిట్టించారు.. నేడు దాడి చేయించారు 

‘‘గతంలో అసెంబ్లీ సాక్షిగా బాలవీరాంజనేయస్వామిపై మంత్రి మేరుగు నాగార్జునతో అనుచితంగా తిట్టించారు. నేడు సుధాకర్‌బాబుతో ఏకంగా దాడి చేయించారు. ఈ తరహా దాడులకు పాల్పడ్డవారు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’’

నక్కా ఆనంద్‌బాబు, మాజీ మంత్రి 


దాడి అప్రజాస్వామికం 

అసెంబ్లీ సాక్షిగా తెదేపా దళిత శాసనసభ్యునిపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు దాడి చేయడం అప్రజాస్వామికం. జీవో నం1పై గళం వినిపిస్తున్న అజాత శత్రువైన ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామిపై వైకాపా ఎమ్మెల్యేల దాడిని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి. రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఇది మాయని మచ్చగా నిలిచిపోతుంది. నాలుగేళ్లుగా వైకాపా ఎమ్మెల్యేలు ఎస్సీలపై చేస్తున్న దౌర్జన్యాలకు ఇది పరాకాష్ఠ.

మండలి బుద్ధప్రసాద్‌, మాజీ ఉపసభాపతి


మద్దతు తెలిపిన వారికి కృతజ్ఞతలు 

‘‘అసెంబ్లీలో నాపై జరిగిన దాడిని ఖండిస్తూ... నాకు మద్దతుగా నిలిచిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, సీపీఐ నారాయణ, రామకృష్ణ, వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఇతర పార్టీ నేతలకు పేరుపేరునా కృతజ్ఞతలు. వైకాపా వాళ్ల అరాచకాలకు అడ్డుకట్ట వేయకపోతే ప్రజాస్వామ్యం బతికే పరిస్థితి లేదు. నాపై దాడి చేసిన వైకాపా ఎమ్మెల్యేలపై స్పీకర్‌ తక్షణం చర్యలు తీసుకోవాలి...’’ అని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

తెదేపా ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని