నిరుద్యోగులను దగా చేసిన ప్రభుత్వం

శాసన మండలి సభ్యులు పలువురు సోమవారం మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడారు. వివరాలు ఇలా..

Published : 21 Mar 2023 05:33 IST

ఈనాడు, అమరావతి: శాసన మండలి సభ్యులు పలువురు సోమవారం మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడారు. వివరాలు ఇలా..

‘రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు డీఎస్సీ, మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించి..చివరకు నిరుద్యోగులను నిలువునా ముంచింది. రాష్ట్రంలో 771 ఉపాధ్యాయ ఖాళీలే ఉన్నాయని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు కాదు..పెట్రోల్‌ జల్లారు.’

బాలసుబ్రహ్మణ్యం, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ


తప్పుడు సమాచారమిచ్చిన విద్యాశాఖ మంత్రి

‘రాష్ట్రంలో 771 ఉపాధ్యాయ ఖాళీలే ఉన్నాయని విద్యాశాఖ మంత్రి మండలిలో ప్రకటించడం ద్వారా తప్పుడు సమాచారాన్ని సభ్యులకు అందించారు. ఏపీలో 53 వేల ఖాళీలున్నాయని కేంద్రం వెల్లడించాక ..ఖాళీల సంఖ్యను తగ్గించి చూపడం ఏమిటి?’

ఐ.వెంకటేశ్వరరావు, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ


విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు

‘రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ పట్ల వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపణీయం. ఈ కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించలేని పరిస్థితి ఉత్పన్నమవుతోంది. విద్యాహక్కు చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఉపాధ్యాయుల రేషనలైజేషన్‌తో విద్యా రంగాన్ని దెబ్బ తీస్తోంది’

షేక్‌ షాబ్జీ, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ


పిల్లల సంరక్షణ సెలవులపై వెసులుబాటు..

‘ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయినులు తమ పిల్లల వయసు 18 ఏళ్లు వచ్చేలోపు ఎప్పుడైనా ‘పిల్లల సంరక్షణ’ సెలవులు వినియోగించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఇందుకు సంబంధించిన నిబంధనలు సవరించేందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అంగీకరించారు. అదే విధంగా ప్రైవేట్‌ విద్యా సంస్థల గుర్తింపు ఎనిమిదేళ్లకోసారి పొందేలా కూడా ప్రభుత్వం జీవో జారీ చేస్తోంది.’

కల్పలతారెడ్డి, ఎమ్మెల్సీ


కేంద్రం, ప్రధాని దృష్టి సారించాలి 

‘‘జీవో 1పై ప్రతిపక్షాలు చేస్తున్న పోరాటం, డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీల ‘చలో విజయవాడ’ల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే తెదేపా ఎమ్మెల్యేలపై దాడికి దిగారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్రం, ప్రధాని దృష్టి సారించాలి’’

 కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి 


వివేకాహత్య కేసును దారి మళ్లించడానికే

‘‘జీవో 1పై నిరసన వ్యక్తం చేస్తున్న తెదేపా ఎమ్మెల్యేలపై అసెంబ్లీ సాక్షిగా భౌతికదాడులకు పాల్పడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా ఓటమిని, వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్‌రెడ్డి అరెస్ట్‌ అంశం నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే తెదేపా ఎమ్మెల్యేలపై దాడి చేయించారు’’

 ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, మాజీమంత్రి


గొడవలు సృష్టించి లబ్ధిపొందాలని చూస్తున్నారు

‘బీసీ, ఎస్సీల మధ్య గొడవలు సృష్టించి లబ్ధి పొందాలని చంద్రబాబు చూస్తున్నారు. ప్రభుత్వంపై ద్వేషంతో ఆయన ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి అయిన నన్ను పట్టుకొని దూషించిన తెదేపా సభ్యులపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేయాలి. దళిత ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామిని పావుగా వాడుకుంటున్న చంద్రబాబుకి ప్రజలే బుద్ధి చెబుతారు. 

నారాయణస్వామి, ఉప ముఖ్యమంత్రి


మీరు దాడి చేసి మాపై విమర్శలా?

‘గత వారం రోజులుగా తెదేపా ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి.. సభాపతి సీతారాం, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిని దుర్భాషలాడుతున్నారు. వెల్‌లోకి వెళ్లడమే చట్ట విరుద్ధం కాగా...ఆపై సభాపతిపై దాడి చేశారు. వాస్తవ పరిస్థితులిలా ఉంటే...తెదేపా సభ్యులపై తాము దాడి చేశామని విమర్శలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంపై సీఎం జగన్‌ మాట్లాడతారని ముందుగా తెలిసి...సభను తప్పుదోవ పట్టించడానికే చంద్రబాబు తన ఎమ్మెల్యేలతో స్పీకర్‌పై దాడి చేయించారు’

సీహెచ్‌ వేణుగోపాలకృష్ణ, సమాచారశాఖ మంత్రి


సభాపతిపై దాడి చేయడం దుర్మార్గం

‘సభాపతిపై తెదేపా సభ్యులు దాడి చేసి...ఇదేమిటని ప్రశ్నించినందుకు మాపై నిందలు వేస్తున్నారు. తెదేపా సభ్యులు వ్యవహరించిన తీరు దుర్మార్గం. వైకాపాపై బురదజల్లేందుకు చంద్రబాబు ఎంతకైనా  దిగజారుతారు. సీమెన్స్‌పై చర్చ జరగకుండా చూసేందుకు తెదేపా సభ్యులు పథకం ప్రకారం సభలోకి వచ్చి సభాపతిపై దాడి చేశారు’

గడికోట శ్రీకాంత్‌రెడ్డి, శాసనసభా వ్యవహారాల సమన్వయకర్త


తీవ్రమైన చర్యలు తీసుకుంటామని స్పీకర్‌ రూలింగ్‌ ఇవ్వాలి

‘సభలో సోమవారం జరిగిన ఘటనలు పునరావృతమైతే చర్యలు తీవ్రంగా ఉంటాయని స్పీకర్‌ రూలింగ్‌ ఇవ్వాలి. ఉమ్మడి రాష్ట్రంలో మోత్కుపల్లి నర్సింహులుకు పట్టిన గతే...బాలవీరాంజనేయస్వామికి పడుతుంది. నర్సింహులును కూడా గతంలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలను తిట్టించడానికి చంద్రబాబు ఉపయోగించుకొని చివరకు అతడిని మోసం చేశారు’

కాపు రామచంద్రారెడ్డి, ప్రభుత్వ విప్‌


ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు

‘సభలో తెదేపా సభ్యులు వ్యవహరించిన తీరు బాగాలేదు. ఇలాంటివి పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలి. సభాపతి పట్ల తెదేపా సభ్యుడు బాల వీరాంజనేయస్వామి ప్రవర్తించిన తీరు బాధాకరం’

కంబాల జోగులు, వైకాపా ఎమ్మెల్యే 


ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితంపై రీకౌంటింగ్‌ జరపాల్సిందే

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి రీకౌంటింగ్‌ జరపాల్సిందే. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను రిటర్నింగ్‌ అధికారి గౌరవించలేదు. ఎనిమిదో రౌండ్‌లో 19వ టేబుల్‌ వద్ద ఒక బండిల్‌లో తేడాను గుర్తించాం. మా ఏజెంట్లు సంతకం చేయకుండానే అన్నీ కలిపి బండిళ్లు కట్టారు. ఆర్వో తప్పిదం వల్లే కౌంటింగ్‌లో తేడా జరిగినట్లు తేలింది. ఆర్వో ఎనిమిదిసార్లు చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడారు. ఎన్నికల ఫలితాలపై హైకోర్టులో సవాల్‌ చేస్తాం’

కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, వైకాపా ఎమ్మెల్యే


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని