ప్రతిపక్ష సభ్యులు దాడి చేశారనడం హాస్యాస్పదం

గతంలో ప్రశ్నించిన వారిపై దొంగ కేసులు పెట్టి వేధించి హింసించేవారని, ఇప్పుడు శాసనసభలో మాట్లాడిన ఎమ్మెల్యేలపైనా దాడులు చేస్తున్నారని వైకాపా ఎంపీ రఘురామకృష్ణ రాజు మండిపడ్డారు.

Published : 21 Mar 2023 05:33 IST

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

ఈనాడు, దిల్లీ: గతంలో ప్రశ్నించిన వారిపై దొంగ కేసులు పెట్టి వేధించి హింసించేవారని, ఇప్పుడు శాసనసభలో మాట్లాడిన ఎమ్మెల్యేలపైనా దాడులు చేస్తున్నారని వైకాపా ఎంపీ రఘురామకృష్ణ రాజు మండిపడ్డారు. దళిత ఎమ్మెల్యే బాల వీరాంజనేయులుపై దళిత శాసనసభ్యులతోనే దాడి చేయించి... స్పీకర్‌పైనే ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులు దాడి చేసినట్టుగా ప్రసారం చేయడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. దిల్లీలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్‌ 1కి వ్యతిరేకంగా శాంతియుత ఆందోళన చేస్తున్న వారిని భయంతో అరెస్టు చేయడాన్ని ఖండించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థుల పరాజయంతో కొంతమంది మంత్రులు ఉలిక్కిపడ్డారని, కడపలోనూ ఓటమి చెందడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారన్నారు. వామపక్ష పార్టీలతో పాటు భాజపా సానుభూతిపరులు తమ రెండో ప్రాధాన్యత ఓటును తెదేపాకే వేశారని ఆయన గుర్తు చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 23 స్థానాలున్న తెదేపా బీసీ మహిళా అభ్యర్థి అనురాధను బరిలోకి దించిందని, ఎమ్మెల్సీగా గెలవడానికి 22 మంది ఎమ్మెల్యేల ఓట్లు చాలని రఘురామ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని