ప్రశ్నపత్రాల అంశం ప్రవీణ్‌, రాజశేఖర్‌లకే పరిమితం కాదు

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారాన్ని ప్రవీణ్‌, రాజశేఖర్‌లకే పరిమితం చేయవద్దని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.

Updated : 22 Mar 2023 05:39 IST

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, కార్యదర్శి, శంకరలక్ష్మిలను బాధ్యులుగా చేర్చాలి: రేవంత్‌రెడ్డి

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారాన్ని ప్రవీణ్‌, రాజశేఖర్‌లకే పరిమితం చేయవద్దని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ కేసులో కమిషన్‌ ఛైర్మన్‌, కార్యదర్శితో పాటు కాన్ఫిడెన్షియల్‌ విభాగం ఇన్‌ఛార్జి శంకరలక్ష్మిలను బాధ్యులుగా చేర్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. కీలకమైన వ్యక్తులను వదిలేసి కిందిస్థాయి ఉద్యోగులను బాధ్యులు చేస్తూ కేసును మూసివేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో రేవంత్‌రెడ్డి విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. టీఎస్‌పీఎస్సీలో ఉన్న సిస్టమ్‌లకు బాధ్యులు ఐటీ శాఖ అని, ఐటీ చట్టం ప్రకారం ఆడిట్‌, స్క్రూటినీ చేయాల్సింది కూడా ఆ శాఖకు చెందినవారే అన్నారు. ‘టీఎస్‌పీఎస్సీ తాళాల గుత్తి ఆంధ్రోళ్ల చేతిలోనే పెట్టారు, సిట్‌ విచారణ అధికారి కూడా ఆంధ్రా అతనే..అలాంటప్పుడు రిపోర్ట్‌ ఎలా ఉంటుంది? తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లంతా ఎక్కడికి పోయారు’ అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిందే విద్యార్థి ఉద్యమం ద్వారా అని, 30 లక్షల నిరుద్యోగుల గోస పట్టదా? విచారణ సక్రమంగా జరగాలని కోరితే సిట్‌ అధికారులు తనకు నోటీసులు ఇచ్చారని రేవంత్‌రెడ్డి అన్నారు. హైకోర్టులో కేసు విచారణపై స్పందిస్తూ.. ఇప్పటి వరకు భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలను పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టాలని కోర్టును కోరినట్లు చెప్పారు. ఇప్పటి వరకు పేపర్‌ లీకేజీ అంశంలో సిట్‌ విచారించిన విషయాలను కూడా ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.

* తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్‌ శ్రేణులకు రేవంత్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని