సంక్షిప్త వార్తలు(14)

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీపై గవర్నర్‌ తమిళిసైకి కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు చేయనుంది.

Updated : 22 Mar 2023 05:37 IST

ప్రశ్నపత్రం లీకేజీపై నేడు గవర్నర్‌కు కాంగ్రెస్‌ ఫిర్యాదు

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీపై గవర్నర్‌ తమిళిసైకి కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు చేయనుంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది పార్టీ ప్రతినిధుల బృందం బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు గవర్నర్‌ను కలవనున్నట్లు పీసీసీ వర్గాలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపాయి.


ఫీజు రీయంబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయండి: జగ్గారెడ్డి

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: ఫీజు రీయంబర్స్‌మెంట్‌ నిధులు రూ.5 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఒక ప్రకటనలో కోరారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు ఓసీల్లోని పేద విద్యార్థులు లక్షల మంది ఉన్నత చదువులు చదువుకున్నారన్నారు. భారాస ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ పథకాన్ని కొనసాగించడం సంతోషమే అయినా సరైన సమయానికి నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులతో పాటు కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు.


తెలంగాణలోనూ మద్యం సరఫరాపై విచారణ జరపాలి: మధుయాస్కీ గౌడ్‌

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: తెలంగాణలోనూ మద్యం సరఫరాపై ఈడీ, సీబీఐ విచారణ జరపాలని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌, మాజీ ఎంపీ మధుయాస్కీ గౌడ్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దిల్లీ లిక్కర్‌ స్కాంలో ఆ రాష్ట్ర అప్పటి ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోదియాను అరెస్ట్‌ చేశారు.. మరి కవితను ఎందుకు అరెస్టు చేయడం లేదన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ పరిపాలనను పక్కకు పెట్టి కవిత రక్షణ సమితి(కేఆర్‌ఎస్‌)గా మారిందని ఎద్దేవా చేస్తూ దిల్లీలో రాష్ట్ర మంత్రులు ఆమెకు వలయంగా మారారని విమర్శించారు.


దిక్కు తోచని స్థితిలోనే కేసీఆర్‌ ఆత్మీయ సందేశం

కుమార్తె కవిత దిల్లీ మద్యం కేసు, టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్‌లతో ఉక్కిరి బిక్కిరవుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. దిక్కుతోచని పరిస్థితిలో రాష్ట్ర ప్రజలకు ఆత్మీయ సందేశం విడుదల చేశారని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ విమర్శించారు. కేసీఆర్‌ ప్రజలను ఏనాడైనా ప్రగతి భవన్‌కు రానిచ్చారా? తన కుటుంబ సభ్యులుగా చూసుకున్నారా? అని ప్రశ్నించారు. ఎన్ని గిమ్మిక్కులు చేసినా తెలంగాణ ప్రజలు ఇక కేసీఆర్‌, ఆయన కుటుంబాన్ని నమ్మరని అన్నారు.


అంగన్‌వాడీ కార్మికుల అరెస్టులు దారుణం: చంద్రబాబు

ఈనాడు, అమరావతి: జీతాల పెంపుపై అంగన్‌వాడీ కార్మికులకు ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోగా...తమ హక్కుల కోసం గళమెత్తిన వారిని అరెస్టులు చేయడం అన్యాయమని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ట్విటర్‌లో మండిపడ్డారు. ‘అంగన్‌వాడీ కార్మికులను పోలీసులతో అణిచివేయించి అరెస్టులకు పాల్పడటం దారుణం. సమస్యలపై ప్రభుత్వం చర్చలు జరిపి పరిష్కరించాలి’ అని ఆయన సూచించారు.


షెల్‌ కంపెనీలకు ఆద్యుడే జగన్‌: తెదేపా నేత ధూళిపాళ్ల

షెల్‌ కంపెనీలకు రాష్ట్రంలో ఆద్యుడే వైఎస్‌ జగన్‌..20 ఏళ్ల క్రితమే షెల్‌ కంపెనీలు, క్విడ్‌ ప్రోకో చేసిన వ్యక్తి ..నేడు ఆ బురద వేరే వారికి అంటించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని ఏ ఒక్కరూ నమ్మరు’ అని తెదేపా నేత దూళిపాళ్ల నరేంద్ర మంగళవారం ట్వీట్‌ చేశారు. ‘కిల్‌ డెవలప్‌మెంట్‌ తెలిసిన జగన్‌...స్కిల్‌ డెవలప్‌మెంట్‌ను స్కాంగా ప్రచారం చేయడం వృథా ప్రయాసే’ అని ధూళిపాళ్ల పేర్కొన్నారు.


ఏపీ ఆదివాసీ కాంగ్రెస్‌ ఛైర్‌పర్సన్‌గా శాంతకుమారి
జాతీయ సమన్వయకర్తగా నేనావత్‌ కిషన్‌ నాయక్‌

ఈనాడు, దిల్లీ: ఆదివాసీ కాంగ్రెస్‌ ఆంధ్రప్రదేశ్‌ ఛైర్‌పర్సన్‌గా పాచిపెంట శాంతకుమారి నియమితులయ్యారు. ఆదివాసీ కాంగ్రెస్‌కు నలుగురు జాతీయ సమన్వయకర్తలు, నలుగురు సంయుక్త సమన్వయకర్తలతో పాటు ఆరు రాష్ట్రాల శాఖలకు ఛైర్‌పర్సన్లను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ఖర్గే మంగళవారం నియమించారు. జాతీయ సమన్వయకర్తల్లో తెలంగాణకు చెందిన నేనావత్‌ కిషన్‌ నాయక్‌ (దేవరకొండ), సంయుక్త సమన్వయకర్తల్లో డాక్టర్‌ రవి నాయక్‌ (దేవరకొండ), కొట్నాక తిరుపతి (మంచిర్యాల)కి చోటు దక్కింది.


రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పాతరేశారు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

విజయవాడ(అలంకార్‌కూడలి), న్యూస్‌టుడే: ప్రజాస్వామ్య సూత్రాలకు వైకాపా ప్రభుత్వం పాతరేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. మంగళవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళనకు దిగితే.. జగన్‌ ప్రభుత్వం పోలీసులతో దౌర్జన్యాలు, బెదిరింపులు, అక్రమ నిర్బంధాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. సమస్యల పరిష్కారం కోసం విజయవాడలో ధర్నాచౌక్‌కు తరలివచ్చిన అంగన్‌వాడీ కార్యకర్తలను అరెస్టులు చేయించి ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. జీవో-1పై చర్చకు పట్టుబట్టిన తెదేపా ఎమ్మెల్యేలపై వైకాపా ఎమ్మెల్యేలు దాడికి పాల్పడి ప్రజాస్వామ్యాన్ని మంటగలిపారని విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు జగన్‌ ప్రభుత్వ పతనానికి నాంది అని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి.ఓబులేసు, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ పాల్గొన్నారు.


సంఖ్యా బలముందని అసెంబ్లీలో దాడి చేస్తారా?

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ‘సభాపతిపై ప్రతిపక్షాలు దాడి చేయబోతే తాము కాపాడటానికి వెళ్లామని వైకాపా ఎమ్మెల్యేలు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అసెంబ్లీలో రక్షణను మార్షల్స్‌ చూసుకుంటారు. మరి వారికేం పని’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఒంగోలులో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమకు సంఖ్యా బలం ఉందనే అహంకారంతో ప్రతిపక్ష ఎస్సీ ఎమ్మెల్యే డోలా శ్రీబాల వీరాంజనేయస్వామిపై అధికార పక్షం సభ్యులు దాడి చేయడం సరికాదన్నారు. సీఎం జగన్‌ ఎన్నికల ప్రచార సభల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్లే అంగన్‌వాడీలు రోడ్డెక్కాల్సి వచ్చిందన్నారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు పునాటి ఆంజనేయులు, ప్రకాశం జిల్లా కార్యదర్శి సయ్యద్‌ హనీఫ్‌ పాల్గొన్నారు.


ప్రశ్నించే వారిపై పాలకుల కక్షసాధింపు  

సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు

కదిరి పట్టణం, న్యూస్‌టుడే: అధికారంలో ఉన్నవారు ప్రశ్నించే వారిపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించడం సరికాదని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. 2018లో సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు సందర్భంగా రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని కోరుతూ ఆయన నేతృత్వంలో ఎన్పీ కుంటలో జరిగిన ఆందోళన నేపథ్యంలో పోలీసు కేసు నమోదైంది. దీనిపై మంగళవారం కదిరి కోర్టుకు హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్‌ ప్రభుత్వం అవినీతిపరులకు అండగా నిలుస్తూ, ఉద్యోగులు, కార్మికులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. జీఓ1ని వెంటనే రద్దుచేయాలని డిమాండ్‌చేశారు. కేంద్ర ప్రభుత్వం విపక్ష నాయకులపై సీబీఐ, ఈడీ వంటి సంస్థలతో కేసులు నమోదు చేయిస్తూ వేధిస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. కదిరి మండలంలో పంటలు దెబ్బతిన్న గ్రామాల్లో ఆయన పర్యటించారు.


అసెంబ్లీలో వికృత చేష్టలు ఆపాలి

లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ  

సాలూరు, న్యూస్‌టుడే: ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీలో వికృత చేష్టలు ఆపాలని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ అన్నారు. మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయని, వాటిపై మాట్లాడకుండా సామాజికవర్గాల పేరుతో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ఇప్పటికైనా నేతలు బుద్ధి తెచ్చుకుని అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు.


వివిధ వృత్తుల వారితో పవన్‌ కల్యాణ్‌ భేటీ

ఈనాడు, అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన వివిధ వృత్తుల వారు, సామాన్యులు మంగళవారం హైదరాబాద్‌లో కలిశారు. ఉగాది పర్వదినం నేపథ్యంలో ఆయనను కలిసి తమ అభిప్రాయాలు పంచుకున్నారు. విజయవాడ, వెంకటగిరి, కల్వకుర్తి, గంగాధర నెల్లూరు ప్రాంతాలకు చెందిన చేతివృత్తుల వారు పవన్‌ను కలిసిన వారిలో ఉన్నారు. వారంతా తమ వృత్తుల్లోని సాదక బాధకాలను ఆయనకు వివరించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వడ్రంగి కూర్మారావు జనసేన పార్టీకి తన వంతు విరాళం అందించారు. తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు తదితర జిల్లాలకు చెందిన పార్టీ నాయకులూ పార్టీకి విరాళం అందజేశారు.


శాసనసభ కార్యదర్శి కార్యాలయానికి తెదేపా ఎమ్మెల్యేల ఫిర్యాదు

తుళ్లూరు, న్యూస్‌టుడే: అధికార వైకాపా ఎమ్మెల్యేలు తమపై దాడి చేశారని తెదేపా ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదును పరిశీలన నిమిత్తం శాసనసభ కార్యదర్శి కార్యాలయానికి పంపినట్లు తుళ్లూరు సీఐ ఎం.ఆనందరావు తెలిపారు. వైకాపా ఎమ్మెల్యేలు సోమవారం అసెంబ్లీలో తమపై దాడి చేసి, బెదిరించారని తెదేపా ఎమ్మెల్యేలు డోలా బాలవీరాంజనేయస్వామి సహచర శాసనసభ్యులతో కలిసి గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసుస్టేషన్‌లో అదే రోజు సాయంత్రం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన శాసనసభ లోపల చోటుచేసుకున్న నేపథ్యంలో ఫిర్యాదు పరిశీలన, ఆదేశాల కోసం మంగళవారం శాసనసభ కార్యదర్శి కార్యాలయానికి పంపినట్లు సీఐ తెలిపారు.


ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టమైంది: సోము వీర్రాజు

ఈనాడు, అమరావతి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు స్పష్టమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పదాధికారుల సమావేశంలో పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో పదో తరగతి వారితో ఓట్లు వేయించారని ఆరోపించారు. ‘రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన తరుణంలో పదాధికారుల సమావేశం జరుగుతోంది. వైకాపా పాలనలో ఎక్కడా చూసినా అవినీతి కనిపిస్తోంది. ఇంత ఘోరమైన పరిస్థితి ఏ రాష్ట్రంలో లేదు. అవినీతిని ఖండిస్తూ ఛార్జిషీట్ల దాఖలు కార్యక్రమాలు నిర్వహిద్దాం’ అని పేర్కొన్నారు. సమావేశంలో జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్‌జీ, జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, కార్యదర్శి సత్యకుమార్‌, జాతీయ కార్యదర్శి బూత్‌ స్వశక్తి కరణ్‌ అభియాన్‌ ఇన్‌ఛార్జి అరవింద్‌ మీనన్‌, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.


తెదేపాపై బురదచల్లేందుకే ‘స్కిల్‌’పై ఆరోపణలు
వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

ఈనాడు, దిల్లీ: స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఓ వైపు విచారణ సాగుతుంటే... మరోవైపు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అదే అంశంపై శాసనసభలో మాట్లాడడం విడ్డూరంగా ఉందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. దిల్లీలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా ఘన విజయం అనంతరం ఆ పార్టీపై, ప్రతిపక్షనేత చంద్రబాబుపై బురద చల్లేందుకే కుంభకోణం జరిగిందని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే సుధాకర్‌ బాబు మోచేతికి చిన్నగా గీసుకుపోతే పూర్తి కట్టు కట్టుకుని ముఖ్యమంత్రిని కలిసిన విధానం అద్భుతంగా ఉందన్నారు. న్యాయస్థానంలో ఉన్న ప్రతిబంధకం తొలగిపోయినా కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయడం లేదని రఘురామ ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని