ప్రభుత్వ పాలనా వైఫల్యంతోనే పేపర్‌ లీకేజీ

‘టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ ప్రభుత్వ పాలనా వైఫల్యం వల్లనే జరిగింది. ఇది 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలకు ముడిపడి ఉన్న అంశం. మెటీరియల్‌ ఇస్తాం.

Published : 22 Mar 2023 04:22 IST

సిట్‌కు బదులు సీబీఐతో విచారణ చేయించాలి
యువజన సమితి, విద్యార్థి జనసమితి రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు

ఈనాడు, హైదరాబాద్‌: ‘టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ ప్రభుత్వ పాలనా వైఫల్యం వల్లనే జరిగింది. ఇది 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలకు ముడిపడి ఉన్న అంశం. మెటీరియల్‌ ఇస్తాం. చదువుకోండి అంటే కుదరదు. పరిహారం ఇవ్వాలి. సిట్‌తో కాకుండా సీబీఐతో విచారణ చేయించాలి. కమిషన్‌ ఛైర్మన్‌, సభ్యులు రాజీనామా చేయాలి’ అని పలువురు వక్తలు పేర్కొన్నారు. యువజన సమితి, విద్యార్థి జనసమితి ఆధ్వర్యంలో మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ- ప్రభుత్వ వైఫల్యం- నిరుద్యోగుల గోస’ అనే అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. తెజస, బీఎస్పీ, కాంగ్రెస్‌ నాయకులు, ప్రజాసంఘాలు పాల్గొన్నాయి. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి మాట్లాడుతూ లీకేజీల నివారణకు చట్టం తేవాలని కోరారు. తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకుడు అంబటి నాగన్న, తెజస ఉపాధ్యక్షుడు ఆచార్య విశ్వేశ్వరరావు, తెజస నాయకుడు బైరి రమేశ్‌, సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకులు గోవర్ధన్‌, విద్యార్థి సంఘాల నుంచి మహేశ్‌, నాగేశ్వరరావు, రాజ్‌కుమార్‌, నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.


సీఎం బాధ్యత వహించాల్సిందే
- కోదండరాం, తెజస రాష్ట్రాధ్యక్షుడు

లీకేజీపై అనుమానాలు వ్యక్తం చేసిన నాయకులకు సిట్‌ నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తున్నాం. ఈ వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయిస్తే వివరాలు అందజేస్తాం. ఈసంఘటనకు సీఎం కేసీఆర్‌ బాధ్యత వహించాల్సిందే. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. నేరెళ్ల బాధితుల మాదిరే పేపర్‌ లీకేజీ విషయంలోనూ చేస్తున్నారు.


కవిత కోసం దిల్లీలో భారాస నాయకుల తిష్ఠ
-ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు

ప్రశ్నపత్రాల సమాచారం ఉన్న గదిలో ప్రవీణ్‌ డౌన్‌లోడ్‌ చేస్తుంటే ఛైర్మన్‌ ఏం చేస్తున్నారు. ప్రశ్నపత్రాలు లీకవుతుంటే విద్యార్థులు రోడ్లపై తిరుగుతున్నారు. మరోవైపు కవిత కోసం భారాస నాయకులంతా దిల్లీలో తిష్ఠ వేశారు. కేసును సీబీఐకి ఇవ్వాలి.


మౌఖిక పరీక్ష వద్దనడంతోనే నమ్మకం పోయింది
-ఆచార్య హరగోపాల్‌, పౌరహక్కుల సంఘం

గ్రూప్‌-1లో మౌఖిక పరీక్ష, లెక్కలు వద్దని ప్రభుత్వం చెప్పిన రోజే అందరిలో నమ్మకం పోయింది. పేపర్‌ లీకేజీ వైఫల్యానికి బాధ్యత తీసుకుని సీఎం రాజీనామా చేయాలి. ప్రైవేటు కళాశాలల వ్యవహారంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం ఎన్‌.జనార్దన్‌రెడ్డి రాజీనామా చేశారు. ఇది 30 లక్షల మందికి చెందిన అంశమైనప్పటికీ కేసీఆర్‌ మాట్లాడటం లేదు.


బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వ యత్నం
-మల్లు రవి, పీసీసీ ఉపాధ్యక్షుడు

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీని ఇద్దరు వ్యక్తులపైకి నెట్టి ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పించుకునే యత్నం చేస్తోంది. నోటిఫికేషన్ల పేరుతో నిరుద్యోగులను మోసం చేసింది. చట్టప్రకారం పరిపాలన సాగకుంటే ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని