విచారణ పేరిట కవితకు వేధింపులు

దిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితను విచారణ పేరిట వేధిస్తున్నారని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

Published : 22 Mar 2023 04:22 IST

కేంద్రంపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి విమర్శలు
లీకేజీపై తన మాటలను వక్రీకరిస్తున్నారని వివరణ

నిర్మల్‌, న్యూస్‌టుడే; ఈనాడు, హైదరాబాద్‌: దిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితను విచారణ పేరిట వేధిస్తున్నారని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన నిర్మల్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర సంస్థలను భాజపా ప్రభుత్వం దుర్వినియోగం చేస్తూ.. ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురిచేస్తోందని మండిపడ్డారు. ప్రశ్నపత్రాలు సాధారణంగా అప్పుడప్పుడు లీకవుతుంటాయని, ఇంటర్మీడియట్‌, పదో తరగతిలో ఎన్నో రకాలుగా జరుగుతాయని ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. దీనికి కేటీఆర్‌ను దోషి అనడం, సీఎంకు నోటీసు ఇవ్వాలని విపక్షాలు కోరడం సరికాదని పేర్కొన్నారు.  అనంతరం ఈ వ్యాఖ్యలపై మంత్రి ఓ ప్రకటనలో వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వాల హయాంలో పేపర్‌ లీకేజీలు సర్వసాధారణమయ్యాయనే ఉద్దేశంతోనే అలా మాట్లాడినట్లు తెలిపారు. తన మాటలను వక్రీకరిస్తున్నారని చెప్పారు. పేపర్‌ లీకేజీ దురదృష్టకరమని, ఈ వ్యవహారంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, సిట్‌ దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు. నిందితులు ఎంతటి వారైనా వదిలేది లేదని, విద్యార్థుల మనోభావాలు దెబ్బతీయొద్దని చెప్పారు.

నిరుద్యోగులకు ఇంద్రకరణ్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి: కాంగ్రెస్‌

పరీక్ష పత్రాల లీకేజీపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని, నిరుద్యోగులకు ఆయన క్షమాపణ చెప్పాలని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. నిర్మల్‌ మున్సిపాలిటీలో గతంలో 42 ఉద్యోగాలను మంత్రి అమ్ముకున్నారని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని