హత్యలు చేసినోళ్లను తప్పించి గోరు గీసుకుపోయినోళ్లపై కేసులు!

రూ.లక్షల కోట్లు దోచుకొని విదేశాలకు పారిపోయిన వాళ్లను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం.. ఉందో లేదో తెలియని రూ.వంద కోట్ల వ్యవహారాన్ని కుంభకోణంగా ప్రచారం చేస్తూ.. వేధిస్తోందని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మండిపడ్డారు.

Updated : 22 Mar 2023 05:31 IST

కవితపై ఆరోపణలకు కిషన్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

ఈనాడు, దిల్లీ: రూ.లక్షల కోట్లు దోచుకొని విదేశాలకు పారిపోయిన వాళ్లను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం.. ఉందో లేదో తెలియని రూ.వంద కోట్ల వ్యవహారాన్ని కుంభకోణంగా ప్రచారం చేస్తూ.. వేధిస్తోందని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మండిపడ్డారు. దిల్లీ తెలంగాణ భవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ, లలిత్‌ మోదీ, చోక్సీ వంటి వారు రూ.లక్షల కోట్లు కొల్లగొట్టి విదేశాల్లో జల్సాలు చేసుకుంటుంటే ఏం చేయలేకపోతున్నారని ఆయన విమర్శించారు. దిల్లీ మద్యం కేసులో రూ.వంద కోట్లు చేతులు మారాయంటున్నారని, అది ఉల్లిపొట్టులాంటిదని, అందులో కుంభకోణం ఉందో లేదో తెలియదన్నారు. ఈ కేసులో తెలంగాణ ఆడబిడ్డ కవితను అనవసరంగా హింసిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీరు.. వంద హత్యలు చేసినోళ్లను తప్పించి గోరు గీసుకుపోయిన వారిపై కేసు పెట్టినట్లుందని ఆయన ఎద్దేవా చేశారు. మద్యం విధానంలో కవిత పాత్ర ఉందనడం కల్పితమని, విచారణ అనంతరం ఆమె సింహంలా గర్జిస్తారని అన్నారు. రూ.కోట్ల విలువైన మొబైల్‌ ఫోన్లను కవిత ధ్వంసం చేశారంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపణలు చేశారని.. అందుకు సంబంధించిన వీడియోను ప్రదర్శించారు. మంగళవారం ఈడీ విచారణకు వెళ్తూ కవిత ఆ ఫోన్లను చూపినందున కిషన్‌రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. బెదిరింపులకు కేసీఆర్‌ లొంగరని, దేశ ప్రయోజనాల కోసం ఆయన పోరాటం కొనసాగుతుందన్నారు. సౌత్‌ గ్రూప్‌ అంటూ దక్షిణాది రాష్ట్రాలను అవమానించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. ఈ సమావేశంలో ఎంపీలు వెంకటేష్‌ నేత, బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని