ఏడో రోజూ వాయిదాలే

అధికార, విపక్ష సభ్యుల ఆందోళనలతో గత ఆరు రోజులుగా వరుసగా వాయిదా పడుతూ వస్తున్న పార్లమెంటు ఉభయ సభల్లో ఏడో రోజైన మంగళవారమూ అదే పరిస్థితి కనిపించింది.

Published : 22 Mar 2023 04:22 IST

పార్లమెంటులో అదానీపై జేపీసీకి విపక్షాల డిమాండ్‌
రాహుల్‌ క్షమాపణకు భాజపా పట్టు

దిల్లీ: అధికార, విపక్ష సభ్యుల ఆందోళనలతో గత ఆరు రోజులుగా వరుసగా వాయిదా పడుతూ వస్తున్న పార్లమెంటు ఉభయ సభల్లో ఏడో రోజైన మంగళవారమూ అదే పరిస్థితి కనిపించింది. దీంతో రెండు సభలూ ఎటువంటి కార్యకలాపాలను చేపట్టకుండానే గురువారానికి వాయిదా పడ్డాయి. ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు జేపీసీ డిమాండుతో సభా కార్యకలాపాలకు అంతరాయం కల్పించారు. వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలతో హోరెత్తించారు. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత అందరికీ మాట్లాడే అవకాశం ఇస్తానని స్పీకరు ఓం బిర్లా ఎంత విజ్ఞప్తి చేసినా సభ్యులెవరూ వినలేదు. ‘అన్ని పార్టీల నేతలకు వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేస్తున్నా. సభను జరగనివ్వండి. బడ్జెట్‌ ఆమోదం ఎంతో ముఖ్యం. ప్రశ్నోత్తరాల తర్వాత అవకాశం ఇవ్వకపోతే అప్పుడు వెల్‌లోకి రండి’ అని స్పీకరు చెప్పినా వినలేదు. మరోవైపు రాహుల్‌ గాంధీ బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ భాజపా సభ్యులూ ఆందోళనకు దిగారు. దీంతో మధ్యాహ్నానికి స్పీకరు వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమయ్యాకా అదే తీరు కొనసాగింది. ఈ గందరగోళం మధ్యే జమ్మూ కశ్మీర్‌ బడ్జెట్‌ను ఆమోదిస్తున్నట్లు సభాధ్యక్ష స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్‌ ప్రకటించారు. ఆ తర్వాత సభను గురువారానికి వాయిదా వేశారు.  

రాహుల్‌ క్షమాపణలు చెప్పాల్సిందే

రాజ్యసభలోనూ మంగళవారం గందగోళం నెలకొనడంతో గురువారానికి వాయిదా పడింది. లండన్‌లో చేసిన వ్యాఖ్యలపై రాహుల్‌ గాంధీ క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ సభ ప్రారంభం కాగానే అధికార పక్ష సభ్యులు పట్టుబట్టారు. ప్రశ్నోత్తరాలను ఆపేసి అదానీ అంశంపై చర్చించాలని కోరుతూ రూల్‌ 267 కింద ఇచ్చిన 11 నోటీసులను ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ తిరస్కరించడంతో విపక్ష సభ్యులూ నినాదాలతో హోరెత్తించారు. సభ మళ్లీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యాకా అదే పరిస్థితి కొనసాగింది. దీంతో కాంగ్రెస్‌ పక్ష నేత మల్లికార్జున ఖర్గేను మాట్లాడాల్సిందిగా ధన్‌ఖడ్‌ సూచించారు. రాహుల్‌ ఈ సభలో సభ్యుడు కాదని, ఆయన క్షమాపణలు చెప్పే ప్రశ్నే లేదని ఖర్గే స్పష్టం చేశారు. అధికార పక్ష సభ్యులు క్షమాపణలు చెప్పాల్సిందేనని మరోసారి నినాదాలతో హోరెత్తించారు.

ప్రతిపక్ష నేతల ఆందోళన

పార్లమెంటు కారిడార్‌లో మంగళవారం ప్రతిపక్ష నేతలు ఆందోళన నిర్వహించారు. అదానీ అంశంపై జేపీసీ వేయాలని నినాదాలు చేశారు. జేపీసీ కావాలంటూ పార్లమెంటు మొదటి అంతస్తు నుంచి బ్యానర్‌ను ప్రదర్శించారు. తృణమూల్‌ ఎంపీలు వేరుగా ఆందోళన చేశారు. అంతకుముందు ప్రతిపక్ష నేతలు పార్లమెంటు ఆవరణలో సమావేశమై జేపీసీ వేసేవరకూ ఆందోళన కొనసాగించాలని నిర్ణయించారు. సమావేశానికి కాంగ్రెస్‌, డీఎంకే, ఆర్జేడీ, సీపీఎం, సీపీఐ, ఎన్సీపీ, శివసేన (ఉద్ధవ్‌), జేడీయూ, జేఎంఎం, ఐయూఎంఎల్‌, ఆప్‌, ఎండీఎంకే నేతలు హాజరయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు