YSRCP: ‘పట్టా’ తప్పించిందెవరు?

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోరపరాభవం ఎదురవడంతో అధికార వైకాపాలో ముఖ్యనేతల తీరు చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ ఎన్నికల్లో పోటీచేయాలన్న సలహా ఇచ్చిందెవరన్న ప్రశ్నతో మొదలై.. నేతల వ్యవహారశైలిపైనా చర్చలు జరుగుతున్నాయి.

Updated : 22 Mar 2023 09:39 IST

ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎలా ఎంపిక చేశారు?
వేళ్లన్నీ ఒక కీలకనేత వైపు
ఎన్నికల్లో కలగజేసుకోని మరో ముఖ్య నేత
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయంతో వైకాపాలో బయటపడుతున్న లుకలుకలు

ఈనాడు, అమరావతి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోరపరాభవం ఎదురవడంతో అధికార వైకాపాలో ముఖ్యనేతల తీరు చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ ఎన్నికల్లో పోటీచేయాలన్న సలహా ఇచ్చిందెవరన్న ప్రశ్నతో మొదలై.. నేతల వ్యవహారశైలిపైనా చర్చలు జరుగుతున్నాయి. ‘గతంలోలాగే స్వతంత్ర అభ్యర్థులకు మద్దతునిచ్చి గెలిపించుకుందాం అని ప్రాథమికంగా చర్చ జరిగినప్పుడు.. అబ్బే ఎందుకు, 2019 తర్వాత అన్ని ఎన్నికల్లోనూ గెలిచాం, స్వింగ్‌లో ఉన్నాం. ఇదే ఊపులో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పోటీచేయాలి’ అని ఓ ముఖ్యనేత సలహా ఇచ్చారంటూ పార్టీలో ఎక్కువమంది ఆయననే తప్పుపడుతున్నారు. మరో కీలక నేత ఈ పరాజయంతో తనకేం సంబంధం లేనట్లు దూరంగా ఉంటున్నారు. వీరిద్దరూ కాకుండా ఈ ఎన్నికల్లో భాగస్వామి అయిన మరో ముఖ్యనేత ఫలితాల తర్వాత కనిపించడం లేదన్న చర్చా వైకాపా వర్గాల్లో జరుగుతోంది. అభ్యర్థుల్లో ఒకరిని సీఎం వద్దకు తీసుకెళ్లి, టికెట్‌ ఖరారు చేయించిన ఒక కీలక నేత.. ఎన్నికలప్పుడు పట్టించుకోకపోవడంతో పాటు, ఓటమి తర్వాత కనిపించడం లేదంటున్నారు. ఇలా ఓటమి కారణంగా ఆ పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి. ఈ ఫలితాలతో ‘మళ్లీ మేమే.. అంతా మా వైపే ఉందన్న భ్రమలు వీడాయి’ అని కొందరు ఎమ్మెల్యేలు అంటున్నారు.

సలహాలు దారి తప్పించాయా..?

‘పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీచేశారు.. పోనీ అభ్యర్థులనైనా సరిగా ఎంపికచేశారా అంటే అదీ లేదు. అందుకే ఎంత ప్రయత్నించినా ఓటమి తప్పలేదు. సలహాలే కొంపముంచాయి’ అంటూ పార్టీనేతలే అనధికారిక చర్చల్లో వ్యాఖ్యానిస్తున్నారు. ‘అభ్యర్థుల ఎంపికపై క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందని సీనియర్లతో గానీ, స్థానిక ఎమ్మెల్యేతో గానీ చర్చించారా? నేతల సలహాలే చాలనుకుంటున్నారేమో’ అంటూ కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ‘అసలు పార్టీపరంగా పోటీచేసి ఉండకూడదు’ అని ఒక సీనియర్‌ మంత్రి తనను కలిసిన అందరితో చెబుతున్నారు.

ఎందరుంటే మాత్రం..

ఈ మూడు పట్టభద్రుల నియోజకవర్గాల పరిధిలో 9 జిల్లాలు, వాటిలో 108 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిలో 2019 ఎన్నికల్లో 95 స్థానాల్లో వైకాపా, 13 చోట్ల తెదేపా గెలిచాయి. వీరిలో ఇద్దరు తర్వాత వైకాపాకు మద్దతు ప్రకటించారు. దీంతో వైకాపా చేతిలో 97 నియోజకవర్గాలు ఉన్నట్లుయింది. వీటి పరిధిలో 81 వేలకు పైగా సచివాలయ ఉద్యోగులు, 1.40 లక్షలకు పైగా వాలంటీర్లు ఉన్నారు. పైపెచ్చు, పట్టభద్రుల పేరుతో ఎవరిని పడితే వారిని ఓటర్లుగా నమోదు చేయించారు. ఇంత చేసినా మొత్తం ముగ్గురు వైకాపా అభ్యర్థులకూ కలిపి వచ్చిన ఓట్లు 2,36,972 మాత్రమే!

సమీక్ష లేకపోగా...

పట్టభద్రుల ఎమ్మెల్సీ పలితాలపై సమీక్షించుకోకపోగా.. ‘ఈ ఎన్నికలు అన్ని వర్గాలకూ ప్రాతినిధ్యం వహించేవి కావు.. ఒక చిన్న విభాగానివే. ఇందులోని ఓటర్లంతా పథకాలు అందుతున్నవారు కారు కాబట్టి ఇది ప్రభుత్వ వ్యతిరేకత కాదు’ అంటూ ఓటమిపై డొంకతిరుగుడు వాదన వినిపిస్తున్నారు. ‘అధికారులు మా మాట వినలేదు, పశ్చిమ రాయలసీమ నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో తప్పులు దొర్లాయి’ అంటూ ఒక కీలకనేత చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వంలోని డొల్లతనాన్ని బయటపెట్టినట్లు ఉన్నాయని అధికారపార్టీ ఎమ్మెల్యేనే ఒకరు వ్యాఖ్యానించారు.

భ్రమలు వీడాయి.. ప్రమాద ఘంటికలు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా పరాజయంపై ఆ పార్టీ ఎమ్మెల్యేల స్పందన భిన్నంగా ఉంది. అసెంబ్లీలో లాబీల్లో దీనిపై ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారు. ‘భ్రమలు వీడాయి.. ఇదో పెద్ద వార్నింగ్‌. మాకు ప్రమాద ఘంటికలివి. ఎన్ని చెప్పినా ఫలితాల్లో బొక్కబోర్లా పడ్డాం. దీన్నుంచి బయటపడకపోతే వైనాట్‌ 175 పరిస్థితేంటో’ అంటూ నిర్వేదాన్నీ వ్యక్తం చేస్తున్నారు.

మేముంటేనా..!

గతేడాది మంత్రిపదవులు కోల్పోయిన వారిలో కొందరి వాదన మరోలా ఉంది. ‘కొత్త మంత్రులు సమర్థంగా పనిచేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈ 2.0(కేబినెట్‌)లో మొదటి ఎన్నికలే ఘోరంగా పోయాయి. మా హయాంలో అన్ని ఎన్నికల్లోనూ పార్టీ విజయఢంకా మోగించింది’ అంటున్నారు. కొందరు ఎమ్మెల్యేలు ‘ముఖ్యమంత్రి సొంత జిల్లా ఉన్న పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీనే గెలవలేదు. ఇతర నియోజకవర్గాల గురించి ఏ మాట్లాడతాం’ అంటూ వ్యాఖ్యానించడం పార్టీలో సంబంధాల పరిస్థితిని స్పష్టం చేస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు