జనసేనతో పొత్తు ఉన్నా... లేనట్లే!

జనసేనతో పొత్తు ఉన్నా... లేనట్లుగానే ఉందని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ ఎన్‌.మాధవ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన మాతో కలిసి రాలేదని, పొత్తు కాగితాలపై మాత్రమే కనిపిస్తోందని పేర్కొన్నారు.

Published : 22 Mar 2023 05:28 IST

క్షేత్రస్థాయిలో కలిసి పనిచేస్తేనే ఉపయోగం
కాగితాలపై ఉంటే ఏం లాభం!  
సీఎం దిల్లీ పర్యటనల ప్రభావమూ పార్టీపై ఉంది
భాజపా ఎమ్మెల్సీ మాధవ్‌ వ్యాఖ్యలు

ఈనాడు, అమరావతి: జనసేనతో పొత్తు ఉన్నా... లేనట్లుగానే ఉందని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ ఎన్‌.మాధవ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన మాతో కలిసి రాలేదని, పొత్తు కాగితాలపై మాత్రమే కనిపిస్తోందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో పవన్‌ మద్దతు తమకే ఉందని పీడీఎఫ్‌, కమ్యూనిస్టు పార్టీలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకున్నాయని తెలిపారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని జనసేన అధినేత పవన్‌, సీనియర్‌ నాయకుడు నాదెండ్ల మనోహర్‌కు పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం కనిపించలేదన్నారు. విజయవాడలోని భాజపా ప్రధాన కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవ్‌ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపై సమావేశంలో చర్చించాం. గతంతో పోల్చుకుంటే విశాఖలో ఓట్ల శాతం తగ్గినా... మిగిలినచోట్ల పెరిగింది. జనసేనతో పొత్తు ఉన్నా...లేనట్లుగానే ఉంది. రెండు పార్టీలు కలిసి ప్రజల్లోకి వెళ్తేనే పొత్తును ఆదరిస్తారు. భాజపాతోనే ఉన్నామని ఇటీవల పవన్‌ చెప్పారు. ఆ మేరకు కలిసి పనిచేసేందుకు ఆయన ముందుకు రావాలని కోరుతున్నా. రోడ్‌ మ్యాప్‌ అంటే ప్రజల పక్షాన అధికార పార్టీలోని లోపాలు ఎత్తిచూపడమే కదా!’ అని పేర్కొన్నారు.

ప్రజావ్యతిరేక పాలనపై మే 1 నుంచి కార్యక్రమాలు:రాష్ట్ర భాజపా వైకాపాతో ఉందన్న ప్రచారం వల్లనూ నష్టపోతున్నామని మాధవ్‌ పేర్కొన్నారు. ‘మేం ఇక్కడ వైకాపా పాలనలోని అక్రమాలు, లోపాలపై పోరాటం చేస్తున్నాం. సీఎం హోదాలో జగన్‌ దిల్లీలో పీఎం, ఇతర నేతలను కలుస్తున్నారు. కేంద్ర సహకారం ఉన్నట్లు వైకాపా వ్యవహరిస్తోంది. ఈ పరిణామాలు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీపై ప్రతికూలత చూపించాయి. వైకాపాతో ఉన్నామన్న అపవాదును పొగొట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. రాష్ట్రంలో సొంతంగా అభివృద్ధి చెందేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. పొత్తుల విషయాన్ని పార్టీ అధిష్ఠానం చూసుకుంటుంది. జాతీయ స్థాయిలో ఇచ్చిన పిలుపు మేరకు ఏప్రిల్‌ 1 నుంచి 14 వరకు బూత్‌ స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం. అధికార పార్టీ ప్రజావ్యతిరేక పాలనను ఖండిస్తూ మే 1 నుంచి మండల, నియోజకవర్గ, రాష్ట్ర స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం’ అని మాధవ్‌ వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు