భాజపా.. ప్రజాస్వామ్య సొంతదారు కాదు

పాలక భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య సౌధంలో అద్దెకు ఉంటోందే తప్ప, అది ఆ సౌధానికి యజమాని కాదని కాంగ్రెస్‌ ప్రతినిధి పవన్‌ ఖేడా మంగళవారం ఉద్ఘాటించారు.

Updated : 22 Mar 2023 06:03 IST

దిల్లీ: పాలక భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య సౌధంలో అద్దెకు ఉంటోందే తప్ప, అది ఆ సౌధానికి యజమాని కాదని కాంగ్రెస్‌ ప్రతినిధి పవన్‌ ఖేడా మంగళవారం ఉద్ఘాటించారు. అదానీ సమస్య నుంచి జాతి దృష్టి మరల్చడానికి భాజపా నాటకాలు ఆడుతోందన్నారు. రాహుల్‌ గాంధీని మీర్‌ జాఫర్‌గా వర్ణించిన భారతీయ జనతా పార్టీ నాయకులే జయచంద్రులుగా చరిత్రలో నిలచిపోతారని ఎద్దేవా చేశారు. రాహుల్‌ ఎన్నటికీ క్షమాపణ చెప్పరని అమిత్‌ షా, షెహెన్షా (మోదీ) తెలుసుకోవాలని ఖేడా అన్నారు. బ్రిటిష్‌ వలస పాలకులకు క్షమాపణలు చెప్పినవారు, లండన్‌కు విధేయులుగా ఉన్నవారు, బ్రిటిష్‌ వైస్రాయ్‌ నుంచి పింఛన్‌ తీసుకున్న వారు ఇవాళ దేశభక్తి గురించి కాంగ్రెస్‌కు పాఠాలు చెప్పడం విడ్డూరమని ఖేడా అన్నారు. ప్రభుత్వ చర్యలు, విధానాలను విమర్శించడం, దేశాన్ని విమర్శించడం ఒక్కటి కాదని భాజపా తెలుసుకోవాలన్నారు. ప్రజాస్వామ్య స్థితిగతుల గురించి చర్చలు జరిపినప్పుడే ఆ వ్యవస్థ పటిష్టమవుతుందనీ, లేకుంటే బలహీనపడుతుందనీ ఖేడా హితవు చెప్పారు. అదానీ సమస్యపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ దర్యాప్తునకు భాజపా ఎందుకు ముందుకురావడం లేదని నిలదీశారు. అసలు కాంగ్రెస్‌ నాయకులు అదానీ గురించి చేసిన ప్రస్తావనలను పార్లమెంటు రికార్డుల నుంచి ఎందుకు తొలగించారని ప్రశ్నించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు