ఇది రాజకీయ ప్రేరేపిత చర్య.. కవితతో సీఎం కేసీఆర్‌

ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించడం పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైన చర్య అని.. ఉద్దేశపూర్వకంగానే వేధిస్తున్నారని సీఎం కేసీఆర్‌ అన్నట్లు తెలిసింది. దీటుగా ఎదుర్కొందామని.. ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టంచేసినట్లు సమాచారం.

Updated : 23 Mar 2023 06:45 IST

ఆందోళన అక్కర్లేదు.. దీటుగా ఎదుర్కొందాం

ఈనాడు, హైదరాబాద్‌: ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించడం పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైన చర్య అని.. ఉద్దేశపూర్వకంగానే వేధిస్తున్నారని సీఎం కేసీఆర్‌ అన్నట్లు తెలిసింది. దీటుగా ఎదుర్కొందామని.. ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టంచేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భారాస ఎమ్మెల్సీ కవిత బుధవారం భేటీ అయ్యారు. దిల్లీలో మంగళవారం రాత్రి ఈడీ విచారణ అనంతరం బుధవారం ఉదయం భర్త అనిల్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులతో కలిసి ఆమె హైదరాబాద్‌ చేరుకున్నారు. అందరూ నేరుగా ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. గత మూడు రోజులుగా దిల్లీలో జరిగిన పరిణామాలను ఈ సందర్భంగా సీఎంకు వారు వివరించినట్లు సమాచారం. ఇకపై ఈడీ విచారణ తీరు ఎలా ఉండబోతోంది? దర్యాప్తు సంస్థలను న్యాయపరంగా ఎలా ఎదుర్కోవాలి? కవిత సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై ఈ నెల 24న విచారణ.. తదితర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. వాస్తవానికి దిల్లీలో జరుగుతున్న పరిణామాలను మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలియజేసినా.. విచారణలో ఈడీ ఎలాంటి ప్రశ్నలు సంధించింది? కవిత ఏం సమాధానాలు చెప్పారు? తదితర అంశాలను బుధవారం సీఎంకు నేరుగా వివరించినట్లు సమాచారం. సమావేశం అనంతరం కవిత తన నివాసానికి చేరుకున్నారు. ‘‘తెలుగింటి నూతన సంవత్సరాది ఉగాది సందర్భంగా.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ శోభకృత్‌ నామ సంవత్సర శుభాకాంక్షలు’’ అంటూ కవిత ట్వీట్‌ చేశారు. ఉగాది సందర్భంగా తన నివాసంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని