కేటీఆర్‌ను విచారించేందుకు ఆదేశించండి

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మంత్రి కేటీఆర్‌తో పాటు టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్‌లను ప్రాసిక్యూట్‌ చేయడానికి ఆదేశం ఇవ్వాలని గవర్నర్‌ తమిళిసైని కోరినట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు.

Updated : 23 Mar 2023 06:20 IST

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, కార్యదర్శిని కూడా
గవర్నర్‌కు కాంగ్రెస్‌ నేతల వినతి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మంత్రి కేటీఆర్‌తో పాటు టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్‌లను ప్రాసిక్యూట్‌ చేయడానికి ఆదేశం ఇవ్వాలని గవర్నర్‌ తమిళిసైని కోరినట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. దీనిపై గవర్నర్‌ సానుకూలంగా స్పందించారని, న్యాయసలహా తీసుకుని నిర్ణయం తీసుకుంటానని చెప్పారని ఆయన పేర్కొన్నారు. కమిషన్‌ పాలక మండలిని పూర్తిగా రద్దు చేసి, విచారణ జరిపించాలని విన్నవించినట్లు చెప్పారు. కాంగ్రెస్‌ నేతలు వీహెచ్‌, పొన్నాల లక్ష్మయ్య, మధుయాస్కీ, షబ్బీర్‌ అలీ, మల్లు రవి, అంజన్‌కుమార్‌యాదవ్‌, సంపత్‌కుమార్‌, సుదర్శన్‌రెడ్డి తదితరులతో కలిసి రేవంత్‌రెడ్డి బుధవారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిసి ఈమేరకు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రశ్నపత్రాలను దొంగిలించి రూ.కోట్లకు అమ్ముకుని లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆయన ఆరోపించారు. ఆర్టికల్‌ 317 ప్రకారం గవర్నర్‌కున్న విశేష అధికారాలతో కమిషన్‌ బోర్డులో ఉన్న అందర్నీ సస్పెండ్‌ చేయవచ్చని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై తమకు నమ్మకం లేదని, పారదర్శక విచారణకు గవర్నర్‌ను అనుమతి కోరామని తెలిపారు. ప్రశ్నపత్రాల లీకేజీలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. గతంలో మధ్యప్రదేశ్‌లో జరిగిన వ్యాపం కుంభకోణంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గవర్నర్‌కు వివరించినట్లు తెలిపారు.

2016 గ్రూప్‌-1 ఎంపికలపైనా అనుమానాలు

2016 గ్రూప్‌-1 పరీక్ష ద్వారా ఉద్యోగాలకు ఎంపికైనవారి ఫలితాలు కూడా అసాధారణంగా ఉన్నాయని గవర్నర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపినట్లు రేవంత్‌ చెప్పారు. ‘‘అమెరికా నుంచి నేరుగా పరీక్షలకు వచ్చిన ఒక అభ్యర్థి 2016 ఎంపిక ప్రక్రియలో మొదటి ర్యాంక్‌ పొందారు. టీఎస్‌పీఎస్సీ ఉద్యోగి నాలుగో ర్యాంక్‌ పొందారు. అప్పట్లో గ్రూప్‌-2 పరీక్షను ఒక కేంద్రంలో రాసిన 25 మంది అభ్యర్థులు పోస్టులకు ఎంపికైనట్లు సమాచారం. గతంలో ఇంటర్‌ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో తప్పులకు కనీసం 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. గ్లోబరీనా అనే సాఫ్ట్‌వేర్‌ సంస్థ ప్రమోటర్లు ఉల్లంఘించినందుకు మూల్యాకనంలో తప్పులు దొర్లాయి. ఈ మొత్తం ఎపిసోడ్‌ను కప్పిపుచ్చేందుకు అప్పటి విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డిని ప్రభుత్వం రంగంలోకి దించింది. ఆయన సాఫ్ట్‌వేర్‌ సంస్థ తప్పులను కప్పిపుచ్చారు. అదే జనార్దన్‌రెడ్డికి టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ పోస్టింగ్‌తో కేటీఆర్‌ రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చారు’’ అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.


నిరుద్యోగ విద్యార్థి మహాదీక్షకు రేవంత్‌

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: ఓయూ ఆర్ట్స్‌ కాలేజీ ముందు ఈనెల 24, 25 తేదీల్లో నిర్వహిస్తున్న ‘నిరుద్యోగ విద్యార్థి మహాదీక్ష’కు ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాయి. బుధవారం సంఘాల ప్రతినిధులు రేవంత్‌ను కలిశారు. తప్పకుండా వస్తానని వారికి ఆయన హామీఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని