లీకేజీ కేసులో పెద్ద తలకాయలు

‘టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి ప్రధాన నిందితుడు. అందులోని సభ్యులు సహ నిందితులు’ అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు.

Published : 23 Mar 2023 03:42 IST

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి ప్రధాన నిందితుడు
సీబీఐతో విచారణ చేపట్టాలి: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

నాగర్‌కర్నూల్‌, న్యూస్‌టుడే: ‘టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి ప్రధాన నిందితుడు. అందులోని సభ్యులు సహ నిందితులు’ అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. బుధవారం నాగర్‌కర్నూల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘టీఎస్‌పీఎస్సీలో పనిచేసే ప్రవీణ్‌కు 103 మార్కులు వచ్చాయని చెబుతున్నారు. కానీ, అందులో పనిచేసే ఉద్యోగులు దామర్ల రమేశ్‌కు 120, వెంకటేశ్‌కు 120, షమీమ్‌కు 133 మార్కులు వచ్చాయి. మూడేళ్లు కష్టపడినా 150 మార్కులకు 80 మార్కులు కూడా రావు. అలాంటిది కంప్యూటర్‌ ఆపరేటర్‌కు 120 మార్కులు ఎలా వస్తాయి?బోర్డు సభ్యుల ద్వారా పేపర్లు అమ్ముకునే అవకాశం ఉంది. లీకేజీల విషయం ఛైర్మన్‌తో పాటు సభ్యులకు ఆరు నెలల ముందే తెలుసు’ అని ఆరోపించారు. ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది వంద మంది వరకు టీఎస్‌పీఎస్సీలో పని చేస్తున్నారన్నారు. ఛైర్మన్‌, బోర్డు సభ్యులను విచారించాలని డిమాండు చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణాన్ని వంద హత్యల కంటే పెద్ద నేరంగా పరిగణించాలన్నారు. పాలకులు 30 లక్షల నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడి నిండా ముంచారని విమర్శించారు. ఇందులో ఉన్న సాక్షులకు ప్రాణభయం ఉందని చెప్పారు. ఈ కేసుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని, సుప్రీంకోర్టులో కేసు వేయాలనే ఆలోచన ఉందని పేర్కొన్నారు. బోర్డు సభ్యుడిగా ఉన్న బండి లింగారెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండే రాజశేఖర్‌రెడ్డికి బావ అవుతారని తెలిపారు. మార్చి 11 నుంచి 17 వరకు స్వాధీనం చేసుకున్న కంప్యూటర్లలో ఉన్న ఆధారాలు చెరిపేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. జనార్దన్‌రెడ్డి, సభ్యుల కనుసన్నల్లోనే లీకేజీ వ్యవహారం జరిగిందని ఆరోపించారు. ఆయనను ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. దీని వెనక పెద్ద తలకాయలు ఉన్నాయని ఆరోపించారు. ఇది హ్యాకింగ్‌ కాదని, తెలంగాణ ప్రజలను దృష్టి మళ్లించటానికి నాటకమాడుతున్నారని దుయ్యబట్టారు. పెద్ద తలకాయలను కాపాడేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగులు కోచింగ్‌ సెంటర్లలో రూ.లక్షలు చెల్లించి చదివారని, రోజుకు 18 గంటలు కష్టపడి చదివిన వాళ్లు ఉన్నారన్నారు. సిట్‌కు బదులు సీబీఐతో విచారిస్తే నిజాలు బయటికి వస్తాయని చెప్పారు. ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు