త్వరలో నిరుద్యోగ మార్చ్‌

మిలియన్‌ మార్చ్‌ తరహాలో త్వరలో హైదరాబాద్‌లో నిరుద్యోగ మార్చ్‌ నిర్వహించనున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటించారు.

Published : 23 Mar 2023 03:42 IST

‘లీకేజీ’ దోషులను గుర్తించేదాకా వదలం
‘సిట్‌’ నోటీసులు అందలేదు..
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

ఈనాడు, హైదరాబాద్‌: మిలియన్‌ మార్చ్‌ తరహాలో త్వరలో హైదరాబాద్‌లో నిరుద్యోగ మార్చ్‌ నిర్వహించనున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటించారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో అసలు దోషులను గుర్తించేవరకు భాజపా పోరాడుతుందన్నారు. నిరుద్యోగ మార్చ్‌పై పార్టీ నేతలతో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రి కేటీఆర్‌ రాజీనామా చేసేవరకు వదిలిపెట్టేది లేదన్నారు. లీకేజీ వ్యవహారంపై ‘సిట్‌’ విచారణకు తాము వ్యతిరేకమని, సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. ‘‘సిట్‌లు అంటేనే సీఎం సిట్‌ అంటే సిట్‌.. స్టాండ్‌ అంటే స్టాండ్‌.. అనేలా ఉంటాయి’’ అని అన్నారు. నయీం డైరీ, మియాపూర్‌ భూములు, డ్రగ్స్‌, ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలు సహా పలు అంశాలపై సిట్‌ నివేదికలు ఏమయ్యాయని ప్రశ్నించారు. నోటీసుల పేరుతో బెదిరిస్తే భయపడే ప్రసక్తే లేదన్నారు. మంత్రి కేటీఆర్‌కు మొదట నోటీసులు ఇవ్వాలని, ఆయనకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సిట్‌ నోటీసులు తనకు అందలేదని, ఆ సంగతే తనకు తెలియదన్నారు. ప్రతిపక్షాలుగా ప్రజల నుంచి వచ్చే సమాచారం ఆధారంగా తాము మాట్లాడతామన్నారు. ‘‘30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను పణంగా పెట్టేలా లీకేజీలు జరిగితే.. ఒక మంత్రి పేపర్‌ లీకేజీలు సర్వసాధారణమని అంటున్నారు’’ అని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేకుండా పోయిందని, ప్రశ్నించే గొంతుకలను అణచి వేస్తున్నారని.. తెలంగాణ ఉద్యమకారులు ఆలోచించాలన్నారు. పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన మీడియా ప్రతినిధులకు భాజపా అండగా ఉంటుందన్నారు. ఈమేరకు పార్టీ నేతలు వివేక్‌, విజయశాంతి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ‘ఎమ్మెల్సీ కవిత అన్ని ఫోన్లు వాడుతున్నారా’ అని అన్నారు. ఫోన్ల ధ్వంసంపై ఈడీయే సమాధానం ఇవ్వాలని తమకేమీ సంబంధం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వ అదనపు అడ్వకేట్‌ జనరల్‌ దిల్లీకి వెళ్లి ఈడీని కలవడంపై బార్‌ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయపరంగా పోరాడతామన్నారు.


25న మహాధర్నా

‘మా నౌకరీలు మాగ్గావాలే’ నినాదంతో 25న ఇందిరాపార్క్‌ వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నిరుద్యోగ యువతతో కలిసి మహాధర్నాను నిర్వహించాలని భాజపా నిర్ణయించింది. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అందుబాటులో ఉన్న నేతలతో బుధవారం సంజయ్‌ సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. భాజపా నేతలు జి.వివేక్‌ వెంకటస్వామి, విజయశాంతి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రవీంద్రనాయక్‌, ఎన్‌.రామచంద్రరావు, జి.ప్రేమేందర్‌రెడ్డి, సంగప్ప తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగులకు అండగా సాగరహారం, మార్చ్‌ సహా వివిధ కార్యక్రమాలు చేపట్టడంపై సమీక్షించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు