చంద్రబాబు శ్రమ ఫలిస్తుంది

శోభకృత్‌ నామ సంవత్సరంలో తెదేపా అధినేత చంద్రబాబు శ్రమ ఫలిస్తుందని.. ఆయనకు మంచికాలం నడుస్తుందని బ్రహ్మశ్రీ వెంకట ఫణికుమార్‌శర్మ వెల్లడించారు.

Published : 23 Mar 2023 04:10 IST

‘పంచాంగ శ్రవణం’లో బ్రహ్మశ్రీ వెంకట ఫణికుమార్‌శర్మ

శోభకృత్‌ నామ సంవత్సరంలో తెదేపా అధినేత చంద్రబాబు శ్రమ ఫలిస్తుందని.. ఆయనకు మంచికాలం నడుస్తుందని బ్రహ్మశ్రీ వెంకట ఫణికుమార్‌శర్మ వెల్లడించారు. పార్టీని ప్రజలు అక్కున చేర్చుకుంటారన్నారు. ‘రాష్ట్రంలో జరిగే పార్టీ ఫిరాయింపులు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ప్రధాన ప్రతిపక్షానికి ప్రజల్లో మరింత ఆదరణ లభించనుంది. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి...’ అని పేర్కొన్నారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పి.వెంకట ఫణికుమార్‌శర్మ పంచాంగ విశేషాలు తెలిపారు. ‘‘శ్రమ ఎక్కువగా ఉన్నా... లక్ష్యసాధనకు చంద్రబాబు కృషి చేస్తారు. ఇది సత్ఫలితాలను ఇస్తుంది. తొందరపాటు లేకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పనుల్లో వేగం పెరుగుతుంది. యాత్రల్లో ప్రజాదరణ పెరుగుతుంది. కుటుంబ సభ్యులు, పార్టీ నేతల సంపూర్ణ సహకారం లభిస్తుంది. జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందుతారు. విజయానికి చేరువయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి...’’ అని తెలిపారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవాలని చంద్రబాబుకు సూచించారు. నారా లోకేశ్‌ పరిపూర్ణ నాయకత్వ లక్షణాలు పొందుతారని, పార్టీకి ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తారని వెల్లడించారు. సీనియర్లు, మహిళలు, కొత్త వారికి తెదేపాలో ఆదరణ లభించనుందని ఫణికుమార్‌శర్మ తెలిపారు.

ప్రభుత్వానికి సవాలుగా అవినీతి ఆరోపణలు

‘‘ఈ ఏడాది ఎన్నికల హోరు, జోరు ఎక్కువగా ఉంటుంది. అక్టోబరు 30 తర్వాత రాజకీయ పరిస్థితులు వేగంగా మారతాయి. అవినీతి ఆరోపణలు ప్రభుత్వానికి సవాలుగా నిలుస్తాయి. కోర్టు కేసులు, పాలనలో న్యాయవ్యవస్థ జోక్యం మరింత పెరుగుతుంది. అడుగడుగునా ఆంక్షలు, అనవసర కేసులు ఇబ్బందికి గురి చేసినా ప్రధాన ప్రతిపక్షం సమర్థంగా, దీటుగా ఎదుర్కొని పోరాడుతుంది. అన్ని పార్టీలు క్షేత్ర స్థాయిలో బలపడటానికి తీవ్రంగా ప్రయత్నిస్తాయి. ప్రభుత్వాధికారులు, రాజకీయ నాయకుల కుంభకోణాలు, అవినీతి ఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తాయి. కేంద్ర, రాష్ట్రాల మధ్య దూరం పెరుగుతుంది. రాష్ట్ర, దేశ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న వారు మరింత బలపడటానికి ప్రయత్నిస్తారు. ఆర్థిక నేరాలు, రుణ ఎగవేతలు ఎక్కువగా ఉంటాయి...’’ అని ఫణికుమార్‌శర్మ వివరించారు. ‘‘ధరల నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యం అడుగడుగునా కనబడుతుంది. విద్య, వైద్య రంగాల్లో అవినీతి బయటపడుతుంది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాల్లో అక్కడక్కడా భూకంపాలు వస్తాయి...’’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని