ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానంపై తెదేపా గురి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, మొత్తం మూడు స్థానాలనూ గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ... అదే ఉత్సాహంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలపైనా దృష్టి పెట్టింది.

Published : 23 Mar 2023 04:10 IST

గెలిచేందుకు ఉన్న అవకాశాలపై విస్తృత కసరత్తు

ఈనాడు, అమరావతి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, మొత్తం మూడు స్థానాలనూ గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ... అదే ఉత్సాహంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలపైనా దృష్టి పెట్టింది. తెదేపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పంచుమర్తి అనురాధ ఎన్నికల బరిలో ఉన్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో పాటు, తెదేపా టికెట్‌పై గెలిచి, ఆ తర్వాత వైకాపాలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలకు కూడా పార్టీ విప్‌ జారీ చేసింది. ఓటు వేయడంలో ఎక్కడా పొరపాటు జరగకుండా ఇప్పటికే రెండు, మూడు దఫాలు నమూనా పోలింగ్‌ నిర్వహించింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ ఎమ్మెల్యేలతో తెదేపా అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగానూ నమూనా పోలింగ్‌ జరిగింది. గురువారం ఉదయం 9 గంటలకు పార్టీ ఎమ్మెల్యేలంతా చంద్రబాబు నివాసానికి చేరుకుంటారు. అక్కడ మరోసారి నమూనా పోలింగ్‌ నిర్వహించిన అనంతరం, ఉదయం 10 గంటలకు చంద్రబాబు సహా ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి వెళ్లి ఓటు వేయనున్నారు. రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ అనారోగ్య కారణాలతో కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్‌కి హాజరవలేరేమోనని అనుకున్నారు. కానీ ఆయన కూడా బుధవారం విజయవాడకు వచ్చారు. పార్టీ కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకల్లోను, అనంతరం చంద్రబాబు నివాసంలో జరిగిన సమావేశంలోనూ పాల్గొన్నారు. ఎమ్మెల్యే కోటాలో మొత్తం ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరుగుతోంది. శాసనసభలో తనకున్న బలాన్నిబట్టి తెదేపా ఒక అభ్యర్థిని పోటీకి నిలిపింది. తెదేపా అభ్యర్థి గెలవాలంటే 22 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాలి. తెదేపా బిఫారంపై గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో... కరణం బలరామకృష్ణమూర్తి, మద్దాళి గిరిధర్‌, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్‌కుమార్‌ వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తుండటంతో ప్రస్తుతం శాసనసభలో తెదేపా బలం 19కి తగ్గింది. ఆ నలుగురూ సాంకేతికంగా తెదేపా సభ్యుల కిందే లెక్క. కాబట్టి వారికి కూడా తెదేపా విప్‌ జారీ చేసింది. ఆ నలుగురు ఎమ్మెల్యేల నుంచి గానీ, వైకాపా అసంతృప్త ఎమ్మెల్యేల నుంచిగానీ.. ముగ్గురు తెదేపా అభ్యర్థికి ఓటు వేస్తే అనురాధ ఎమ్మెల్సీగా గెలిచే అవకాశముంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు