నరసరావుపేటలో ఉద్రిక్తత

పల్నాడు జిల్లా నరసరావుపేట తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబును పోలీసులు బుధవారం ఉదయం అదుపులోకి తీసుకొని సాయంత్రం విడుదల చేశారు.

Published : 23 Mar 2023 04:10 IST

పోలీసుల అదుపులో తెదేపా  నియోజకవర్గబాధ్యుడు  అరవిందబాబు.. సాయంత్రం విడుదల
ఎమ్మెల్యే గోపిరెడ్డి అవినీతిపై  సవాళ్ల నేపథ్యం

నరసరావుపేట అర్బన్‌, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా నరసరావుపేట తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబును పోలీసులు బుధవారం ఉదయం అదుపులోకి తీసుకొని సాయంత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా నరసరావుపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గత కొద్దిరోజులుగా అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అవినీతిని నిరూపిస్తానని... కోటప్పకొండకు రావాలని అరవిందబాబు సవాల్‌ చేశారు. దీనిపై ఆధారాలు చూపాలంటూ గోపిరెడ్డి ప్రతి సవాల్‌ చేశారు. ఉగాది రోజు కోటప్పకొండలో ప్రమాణం చేయాలని అరవిందబాబు పిలిచారు. దానికి గోపిరెడ్డి పండగ తర్వాత తేదీ నిర్ణయిస్తే వస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం పార్టీ కార్యాలయం నుంచి కోటప్పకొండకు వెళ్లేందుకు సన్నద్ధమైన అరవిందబాబును సీఐలు అశోక్‌కుమార్‌, రవీంద్రబాబు అడ్డుకున్నారు. నోటీసులు ఇచ్చామని, వెళ్లడానికి అనుమతి లేదన్నారు. అనంతరం పోలీసు వాహనంలోకి ఆయనను బలవంతంగా ఎక్కించారు. ఈ సందర్భంగా తెదేపా పట్టణ కార్యాలయం ఉన్న వైద్యశాల గేట్లను తెదేపా కార్యకర్తలు మూసి తమ ద్విచక్ర వాహనాలను దానికి అడ్డంగా పెట్టారు. అక్కడే బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని లాగేసి అరవిందబాబును తీసుకెళ్లిపోయారు. సాయంత్రం 4 గంటలకు వైద్యశాల వద్ద దింపేసి వెళ్లిపోయారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ అరవిందబాబును ఎక్కడికి తీసుకెళ్లారన్న వివరాలు వెల్లడికాలేదు. మరో పక్క పార్టీ మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ, పార్టీ లీగల్‌సెల్‌ ప్రతినిధులు కోటప్పకొండ వద్దకు వెళ్లారు. కొండ మీద మేధా దక్షిణా మూర్తి విగ్రహం వద్ద ఆధారాలు ఉంచి వచ్చామని,  తాను అవినీతికి పాల్పడలేదని ఎమ్మెల్యే ప్రమాణం చేయాలని డిమాండ్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు