మండలి ఎన్నికలపై ఉత్కంఠ
శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో అనూహ్య పరాభవాన్ని చవిచూసిన అధికార వైకాపాకు ఈ ఎన్నికలు కత్తిమీద సాములా పరిణమించాయి.
నేడే ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
శాసనసభ్యులతో వైకాపా ప్రత్యేక క్యాంపులు
ఏ ఒక్కరినీ చేజారిపోనివ్వద్దంటూ మంత్రులకు బాధ్యతలు
అభ్యర్థుల వారీగా 22 మంది ఎమ్మెల్యేల చొప్పున ఏడు బృందాలు
వాటిపై నిఘా.. 8 మంది ఎమ్మెల్యేలపై మరింత గట్టిగా
ఈనాడు, అమరావతి: శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో అనూహ్య పరాభవాన్ని చవిచూసిన అధికార వైకాపాకు ఈ ఎన్నికలు కత్తిమీద సాములా పరిణమించాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలతోపాటు, తమకు మద్దతుగా వచ్చిన ఇతర పార్టీలకు చెందిన అయిదుగురు ఎమ్మెల్యేల్లో ఎవర్నీ చేజారిపోనివ్వకుండా చూసుకునేందుకు ఆ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. పట్టభద్రుల నియోజకవర్గాల్లో వచ్చిన ప్రతికూల ఫలితాలు మళ్లీ ఎదురవకుండా ఉండాలని అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. గురువారం పోలింగ్ ఉన్నందున బుధవారం రాత్రి నుంచే ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేసుకుంది. ఈ ఎమ్మెల్యేలంతా గురువారం పోలింగ్‌కు వచ్చి సరిగా ఓటేసేలా చూసే బాధ్యతలను ముఖ్యమంత్రి జగన్ మంత్రులపై పెట్టారు.
ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికలు జరుగుతున్న ఏడు స్థానాలనూ ఎలాగైనా కైవసం చేసుకోవాలని వైకాపా అభ్యర్థులను బరిలోకి దించింది. ఇవన్నీ దక్కించుకోవాలంటే సొంత పార్టీ ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరూ చేజారకూడదు. అదే సమయంలో అందరూ చెల్లుబాటయ్యేలా ఓటేయాలి. పార్టీలో ఇద్దరు ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓటేస్తారన్న అంచనాల నేపథ్యంలో ఇప్పుడు వైకాపా ఏడు స్థానాలనూ గెలవాలంటే తెదేపా, జనసేన నుంచి ఆ పార్టీకి మద్దతు ప్రకటించిన అయిదుగురు ఎమ్మెల్యేలు అత్యంత కీలకంగా మారారు. తెదేపా విప్ జారీ చేసిన నేపథ్యంలో ఆ పార్టీ నుంచి తమకు మద్దతుగా వచ్చిన నలుగురు ఎమ్మెల్యేల ఓట్లను ఎలా పొందాలా అని వైకాపా కసరత్తు చేస్తోంది. మరోవైపు పార్టీలో అసంతృప్తి, వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందో లేదో అన్న అనుమానం తదితర కారణాలతో కొంచెం దూరంగా ఉంటున్న ఎమ్మెల్యేలపై ఇప్పటికే ఇంటెలిజెన్స్ నిఘా పెట్టారు. ఇలాంటివారు 8 నుంచి 10 మంది ఉన్నారని వైకాపా వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. వీరిపై నిఘాను మరింత పెంచినట్లు తెలిసింది.
ఇదీ లెక్క
* ఒక్కో ఎమ్మెల్సీ ఎన్నికవ్వాలంటే 22 మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాలి. ఆ లెక్కన వైకాపాకు 154 మంది ఎమ్మెల్యేలు అవసరం.
* వైకాపా గెలిచింది 151 ఎమ్మెల్యే స్థానాలు. వీరిలో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డిలు ఎటువైపు ఓటేస్తారోనన్న అనుమానంతో వారిద్దరి ఓట్లను పరిగణనలోకి తీసుకోని పక్షంలో వైకాపా సంఖ్యాబలం 149.
* ఈ పరిస్థితుల్లో తెదేపా నుంచి వచ్చిన నలుగురు, జనసేన ఎమ్మెల్యేను కలిపితే వైకాపా బలం 154కి చేరుతుంది.
* 22 మంది ఎమ్మెల్యేల చొప్పున వీరిని ఏడుగురు అభ్యర్థులకు కేటాయించారు.
ఏడు బృందాలు
ఒక్కో అభ్యర్థికి 22 మంది ఎమ్మెల్యేల చొప్పున మొత్తం ఏడు బృందాలను వైకాపా ఏర్పాటు చేసింది. ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, కురసాల కన్నబాబు, అసెంబ్లీ వ్యవహారాల సమన్వయకర్త గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఈ బృందాలను సమన్వయం చేస్తున్నారు. వీరికి తోడు ఆ బృందాల్లో ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులున్నారు. బృందంలోని ఎమ్మెల్యేలంతా పోలింగ్‌కు వచ్చి సరిగా ఓటేసేలా చూడటం ఈ మంత్రుల బాధ్యతే. అభ్యర్థులు కూడా ఈ బృందాలతోనే ఉంటున్నారు.
మళ్లీ మాక్ పోలింగ్
బుధవారం రాత్రి ఏడు బృందాల్లోని ఎమ్మెల్యేలతో క్యాంపు నిర్వహించారు. విజయవాడలోని హోటళ్లు, మంత్రుల నివాసాల్లో ఈ క్యాంపులు పెట్టినట్లు తెలిసింది. వీటిలో ఎమ్మెల్యేలకు ఓటింగ్‌పై శిక్షణనివ్వడంతోపాటు మరోసారి మాక్ పోలింగ్ నిర్వహించారు.
గ్యాలరీల్లోకి మీడియాకు అనుమతి లేదు
అసెంబ్లీ భవనంలో గురువారం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉన్నందున శాసనసభ, మండలి గ్యాలరీల్లోకి మీడియాకు అనుమతి లేదని ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, శాసనమండలి సంయుక్త కార్యదర్శి పీవీ సుబ్బారెడ్డి తెలిపారు. శాసనసభ, మండలి సమావేశాల కవరేజీ నిమిత్తం మీడియా ప్రతినిధులు అసెంబ్లీ భవనం వద్దకు రావద్దని సూచించారు. సచివాలయం నాలుగో బ్లాకులోని పబ్లిసిటీ సెల్ నుంచి శాసనసభ, మండలి సమావేశాల లైవ్ కవరేజ్ అందించనున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కవరేజీ నిమిత్తం ఎన్నికల సంఘం జారీ చేసిన పాస్‌లున్న మీడియా ప్రతినిధులను అసెంబ్లీ ప్రాంగణంలోని నిర్దేశిత ప్రదేశం వరకు అనుమతిస్తామన్నారు. అధికారుల గ్యాలరీల్లోకి సైతం ఎవరికీ అనుమతి లేదని వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyderabad: ‘గ్యాంగ్’ ‘స్పెషల్ 26’ సినిమాలు చూసి.. సికింద్రాబాద్‌లో భారీ చోరి
-
World News
Moscow: మాస్కోపై డ్రోన్ల దాడి..!
-
Politics News
Chandrababu: వైకాపా ప్రభుత్వ నాలుగేళ్ల పాలనపై చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు
-
India News
ఫోన్ కోసం రిజర్వాయర్‌నే తోడేసిన ఘటన.. పర్మిషన్ ఇచ్చిన అధికారికి జరిమానా!
-
Sports News
CSK vs GT: సీఎస్కేను భయపెట్టిన చెన్నై కుర్రాడు.. గుజరాత్ జట్టులో ‘ఇంపాక్ట్’ అతడు!
-
General News
Vijayawada: చట్టబద్ధంగా రావాల్సిన వాటి కోసం అడగడం తప్పా?: బొప్పరాజు