జగన్‌ విశాఖకు పారిపోతున్నారు

కేంద్రం అమరావతిని రాజధానిగా పరిగణించి అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయడంతో పాటు కొత్తగా ఫ్లైఓవర్లు, జాతీయ రహదారులను నిర్మిస్తోందని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు.

Updated : 23 Mar 2023 07:27 IST

ఇల్లు కట్టుకున్నానని చెప్పి వెళ్లడమేమిటి?
ఉగాది వేడుకల్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

ఈనాడు, అమరావతి, విజయవాడ(భవానీపురం), న్యూస్‌టుడే: కేంద్రం అమరావతిని రాజధానిగా పరిగణించి అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయడంతో పాటు కొత్తగా ఫ్లైఓవర్లు, జాతీయ రహదారులను నిర్మిస్తోందని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఉగాది వేడుకలు నిర్వహించారు. వేద పండితుడు శివయజ్ఞనారాయణ శర్మ పంచాంగ పఠనం చేశారు. వివిధ రంగాల్లో సేవలందించిన 15 మందిని సత్కరించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ ‘రాజధాని అభివృద్ధిలో భాగంగానే ఎయిమ్స్‌ లాంటి సంస్థలు ఇక్కడికి వచ్చాయి. ఇక్కడ ఇల్లు కట్టుకున్నానని సీఎం జగన్‌ చెప్పారు. కానీ ఇప్పుడు విశాఖకు పారిపోతున్నార’ని వ్యాఖ్యానించారు.

అపఖ్యాతి పాల్జేస్తున్నారని ఆవేదన

ఉగాది సంబరాల తరువాత సోము వీర్రాజు విలేకరులతో విడిగా మాట్లాడారు. భాజపా అధిష్ఠానంతో సంబంధాలు బాగున్నాయి? రాష్ట్ర శాఖ కలిసిరావడం లేదని జనసేన వ్యవస్థాపకుడు పవన్‌ మచిలీపట్నం సభలో చేసిన వ్యాఖ్యల గురించి విలేకరులు ప్రస్తావించగా.. ‘చాలామంది రకరకాల కామెంట్‌్్స చేస్తున్నారు. కేంద్రంలో మోదీ బాగుంటారని చెబుతున్నారు. రాష్ట్రంలో మాత్రం భాజపా ఎదగకూడదు. అపఖ్యాతి పాల్జేయాలని చూస్తున్నారు. నేను వ్యక్తిగతంగా ఎవరి గురించి చెప్పడం లేదు. రాజకీయ దృక్పథంతో ఈ అంశంపై సీరియల్‌గా వస్తున్న అంశాలివి. పవన్‌ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలన్న దానిపై స్పందించను’ అని వివరించారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో జనసేన కలిసి రాలేదని మాధవ్‌ చేసిన వ్యాఖ్యలను ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘నేను స్పందించను. సహకారం లభించిందో.. లేదో.. మీరే ఆలోచించుకోవాలి. ఇరుపార్టీల మధ్య పొత్తు ఉంటుందా? తెగిపోతుందా? అని మీడియా చూస్తోంది. మీ కోరిక నెరవేరకపోవచ్చు. సీఎం జగన్‌ పాలనపై రోజూ నేను విమర్శిస్తున్నా. రెండు పార్టీలూ కలిసి ఉన్నాయనేది అపోహ మాత్రమే. రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన నడుస్తోంది. త్వరలోనే మా పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనపై ఛార్జిషీట్‌ రూపంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని గ్రామస్థాయి నుంచి ప్రశ్నిస్తామ’ని వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు