సభలోనే లేని భవాని.. స్పీకర్‌పై ఎలా దాడి చేస్తారు?

‘‘తెదేపా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ఈ నెల 20న అసలు శాసనసభకే రాలేదు. కానీ ఆమె కూడా స్పీకర్‌ తమ్మినేని సీతారాంపై దాడి చేసినట్లు ఈ నెల 21న ‘సాక్షి’ పత్రికలో ఫొటో ప్రచురించారు.

Updated : 23 Mar 2023 07:14 IST

ఈ నెల 21న సాక్షి పత్రికలో  ఆమె ఫొటో ఎలా ప్రచురించారు?
18వ తేదీ ఘటన ఫొటోను 21న  పత్రికలో వేయటం ప్రజల్ని మోసం చేయటం కాదా?
దీనికి బాధ్యులెవరు.. జగన్‌మోహన్‌రెడ్డా? భారతిరెడ్డా?
ఎవర్ని మోకాళ్లపై కూర్చోబెట్టాలో మంత్రులు సమాధానం చెప్పాలి
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

ఈనాడు, అమరావతి: ‘‘తెదేపా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ఈ నెల 20న అసలు శాసనసభకే రాలేదు. కానీ ఆమె కూడా స్పీకర్‌ తమ్మినేని సీతారాంపై దాడి చేసినట్లు ఈ నెల 21న ‘సాక్షి’ పత్రికలో ఫొటో ప్రచురించారు. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఉంటుందా?’’ అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ‘‘దీనికి బాధ్యులెవరు? జగన్‌మోహన్‌రెడ్డా? భారతిరెడ్డా?’’ అని ప్రశ్నించారు. ఎవర్ని మోకాళ్లపై కూర్చోబెట్టాలో మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. శాసనసభలో లేని వ్యక్తులు ఉన్నట్లుగా, జరగని ఘటనలు జరిగినట్లుగా అసత్యాలు ప్రచురిస్తూ సాక్షి పత్రిక చట్టసభల ప్రతిష్ఠ మంటగలుపుతోందని విమర్శించారు. శాసనసభలోని ఘటనలపై సాక్షి పత్రిక పాత ఫొటోలతో తప్పుడు కథనాలు ప్రచురిస్తుంటే స్పీకర్‌ ఎందుకు స్పందించట్లేదని, భారతిరెడ్డిపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు. చట్టసభలను అగౌరవపరిచేవారిని వెనకేసుకొస్తారా? అని నిలదీశారు. బుధవారం ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. దాంతోపాటు ఈ నెల 19, 21వ తేదీల్లో సాక్షిలో ప్రచురించిన ఫొటోల క్లిప్పింగ్‌లను విడుదల చేశారు. అందులోని వివరాలివి.

ఇది ప్రజల్ని మభ్యపెట్టటం కాదా?

* ఈ నెల 21న సాక్షి ప్రధాన సంచికలో ‘స్పీకర్‌పై వికృత చేష్టలు..దాడి.. అసెంబ్లీకి బ్లాక్‌ డే’ శీర్షికతో వార్త రాసి ‘శాసనసభలో స్పీకర్‌ తమ్మినేని సీతారాంపై పేపర్లు విసురుతూ దాడిచేస్తున్న తెదేపా సభ్యులు’ అనే వ్యాఖ్యతో ఫొటో ప్రచురించారు. ఆ చిత్రంలో తెదేపాకు చెందిన మిగతా ఎమ్మెల్యేలతో పాటు ఆదిరెడ్డి భవాని కూడా పోడియం వద్ద ఉన్నట్లు ఉంది. ఈ నెల 20న తెదేపా ఎమ్మెల్యే భవాని సభకు రానేలేదు. సభలోనే లేని ఆమె స్పీకర్‌పై ఎలా దాడి చేస్తారు? దాడిచేసినట్లు ఆ ఫొటో ఎలా ప్రచురించారు?

* ఈ నెల 19న సాక్షి ప్రధాన సంచికలోనే ‘గొడవ పడటం.. ఆపై సస్పెండ్‌ అవడం’ శీర్షికతో వార్త రాసి ‘స్పీకర్‌పై కాగితాలు విసురుతున్న తెదేపా సభ్యులు’ అనే వ్యాఖ్యతో ఫొటో ప్రచురించారు. మళ్లీ ఆ ఘటన ఫొటోనే 21న సాక్షిలో ప్రచురించారు. ‘స్పీకర్‌పై దాడిచేస్తున్న తెదేపా సభ్యులు’ అంటూ ప్రజల్ని మభ్యపెట్టేలా రాశారు. ఇంతకంటే దిగజారుడుతనం ఏముంటుంది?

* 18న అసెంబ్లీలో జరిగిన ఘటనలకు సంబంధించిన వీడియో ఫుటేజీలో నుంచి ఫొటోలు కట్‌చేసి.. ఆ ఘటనలు 20వ తేదీన జరిగినట్లు.. తెదేపా సభ్యులు సభాపతిపై దాడి చేసినట్లు 21వ తేదీ పత్రికలో ప్రచురిస్తారా? ఇది ప్రజల్ని మోసం చేయటం కాదా?

‘సాక్షి’ వెదజల్లే కాలుష్యమే ఎక్కువ ప్రమాదకరం

కర్మాగారాల నుంచి వెలువడే కాలుష్యం కంటే సాక్షి వెదజల్లే కాలుష్యమే ఎక్కువ ప్రమాదకరం. వైకాపా స్థాపనతో రాజకీయాల్లో నైతిక విలువలు, సాక్షి స్థాపనతో పత్రికా విలువలు మంటగలిశాయి. దళిత ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామిపై వైకాపా ఎమ్మెల్యేలు దాడి చేసి.. అసెంబ్లీ ప్రతిష్ఠ మంటగలిపారు. సాక్షి పత్రిక వార్తల కంటే అబద్ధాల్నే ఎక్కువగా ప్రచురిస్తోంది. జగన్‌.. వ్యక్తుల వ్యక్తిత్వాన్ని దిగజారుస్తున్నారు. ఈ ధోరణిని అరికట్టకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థకే పెనుముప్పు. ప్రత్యర్థి పార్టీల మీద దుమ్మెత్తిపోయటానికి, అసత్యాలు, అర్ధసత్యాలు ప్రచారం చేయటానికి.. మీడియాను జగన్‌ ఒక ముసుగుగా వాడుకుంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు