మాట్లాడేందుకు రాహుల్‌ను అనుమతించాలి

పార్లమెంటు సమావేశాలను సజావుగా నిర్వహించే విషయమై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచిస్తుంటే, తొలుత రాహుల్‌ను లోక్‌సభలో మాట్లాడటానికి అనుమతించాలని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ సూచించారు.

Published : 23 Mar 2023 05:34 IST

అప్పుడే సభలో చర్చలు సజావుగా సాగుతాయి
జేపీసీ డిమాండుపై వెనక్కు తగ్గబోం: జైరాం రమేశ్‌

దిల్లీ: పార్లమెంటు సమావేశాలను సజావుగా నిర్వహించే విషయమై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచిస్తుంటే, తొలుత రాహుల్‌ను లోక్‌సభలో మాట్లాడటానికి అనుమతించాలని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ సూచించారు. ఆయనపై మోపిన నిరాధార ఆరోపణలను తిరస్కరించేందుకు అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు.  సభలో మాట్లాడటానికి తనకు నిబంధన 357 కింద అనుమతినివ్వాలంటూ రాహుల్‌ లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారని, దీనిపై స్పీకర్‌ ఏం నిర్ణయం తీసుకుంటారో కాలమే చెబుతుందని వ్యాఖ్యానించారు. అదానీ సంస్థల అవకతవకల వ్యవహారంపై ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఆధ్వర్యంలో విచారణ జరపాలన్న తమ డిమాండును వెనక్కు తీసుకొనేలా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. అలా అయితేనే రాహుల్‌ లండన్‌లో చేసిన వ్యాఖ్యలపై క్షమాపణకు పట్టుబట్టబోమని ప్రభుత్వం చెబుతోందని పేర్కొన్నారు. జైరాం రమేశ్‌ ఈ మేరకు బుధవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ‘‘ప్రభుత్వం, ప్రతిపక్షం మధ్య రాజీ సూత్రాన్ని కనుగొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు అనధికార వర్గాల ద్వారా తెలిసింది. అయితే జేపీసీ డిమాండుకు, రాహుల్‌ వ్యాఖ్యలపై గందరగోళానికి ముడిపెట్టడాన్ని మేం అంగీకరించం. అదానీ వ్యవహారం వాస్తవం. రాహుల్‌ వ్యాఖ్యలపై చేస్తున్న ఆరోపణలు నిరాధారం. కాబట్టి ఈ రెండింటి మధ్య బేరానికి కాంగ్రెస్‌ సిద్ధంగా లేదు’’ అని జైరాం రమేశ్‌ పేర్కొన్నారు.

అది ‘క్లీన్‌చిట్‌’ ప్యానెల్‌

అదానీ వ్యవహారంపై సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీపై కాంగ్రెస్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. అదానీ వ్యవహారానికి సంబంధించిన అన్ని అంశాలనూ విచారించే అధికారం దానికి లేదని పేర్కొంది. ప్రభుత్వానికి అది క్లీన్‌చిట్‌ ప్యానెల్‌గా మాత్రమే పనిచేస్తుందని ఎద్దేవా చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు