ఎన్నికల ఏడాదిలో రైతులపై ఎనలేని ప్రేమ

ఎనిమిదేళ్లుగా పంటలు నష్టపోయిన రైతులను పలకరించని ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఎన్నికల ఏడాది మాత్రం రైతులపై ఎనలేని ప్రేమ చూపిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు.

Published : 24 Mar 2023 03:36 IST

కేంద్రానికి నివేదిక పంపకుండానే బద్‌నాం చేస్తున్నారు
సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్‌ ధ్వజం
ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం సరిపోదని వ్యాఖ్య

ఈనాడు, హైదరాబాద్‌: ఎనిమిదేళ్లుగా పంటలు నష్టపోయిన రైతులను పలకరించని ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఎన్నికల ఏడాది మాత్రం రైతులపై ఎనలేని ప్రేమ చూపిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. ఎనిమిదేళ్లుగా నష్టపోయిన పంటలకు ఎలాంటి పరిహారం ఇవ్వని రాష్ట్రంలో ఫసల్‌ బీమా పథకాన్ని వర్తింపజేయకుండా రైతులకు తీవ్ర నష్టం చేసిన నేతలు కేంద్రాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందని ఆయన గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం కంటితుడుపు సాయం అందించి చేతులు దులిపేసుకోవాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం ఏమాత్రం సరిపోదని.. దాన్ని పెంచాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా కాగా.. సీఎం మాత్రం 2.28 లక్షల ఎకరాల్లోనే నష్టం జరిగిందని చెబుతున్నారన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని నమోదు చేయడం లేదన్నారు. పంట నష్టంపై కనీసం నివేదిక పంపకుండా.. కేంద్రాన్ని అడగడమే దండగంటూ బద్‌నాం చేయడం ఏం న్యాయమని ప్రశ్నించారు. కేంద్రాన్ని విమర్శించడం మానుకుని రాష్ట్ర రైతాంగాన్ని పూర్తిగా ఆదుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఫసల్‌ బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తే రైతులకు పరిహారం అందే అవకాశం ఉన్నప్పటికీ.. భాజపాకు పేరొస్తుందని ఏళ్లతరబడిగా అమలు చేయకుండా రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. రైతుల దీర్ఘకాల ప్రయోజనాలే లక్ష్యంగా రాష్ట్రంలో సమగ్ర పంటల బీమా విధానాన్ని ప్రవేశపెట్టాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

రాష్ట్రం ఇచ్చే నష్టపరిహారంలో 75 శాతం కేంద్రానిదే..

పంట నష్టపరిహారం సొమ్ములో 75 శాతం వాటా కేంద్రానిదేనని సంజయ్‌ తెలిపారు. నష్టపరిహారం కింద రైతులకు కేంద్రం పైసా సాయం చేయలేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పడం అవాస్తవమన్నారు. కేంద్రం ఇస్తున్న ఎస్డీఆర్‌ఎఫ్‌ నిధుల నుంచే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపరిహారం చెల్లిస్తోందని ఆయన పేర్కొన్నారు.


ప్రతిపక్షాలను అణచివేసే కుట్రలో భాగంగానే కేటీఆర్‌ నోటీసులు

సంజయ్‌

మంత్రి కేటీఆర్‌ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పష్టం చేశారు. నోటీసులను న్యాయపరంగా, రాజకీయపరంగా ఎదుర్కొంటానని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాసమస్యలు, ప్రభుత్వ తప్పిదాలపై మాట్లాడకుండా ప్రతిపక్షాలను అణచివేసే కుట్రలో భాగమే నోటీసులని విమర్శించారు. కేటీఆర్‌ను బర్తరఫ్‌ చేసేదాకా వదిలిపెట్టబోమన్నారు. టీఎస్‌పీఎస్‌సీతో సంబంధం లేకుంటే లీకేజీల అంశంపై కేటీఆర్‌ ఎందుకు మాట్లాడుతున్నారని, సీఎం సమీక్షలో ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. ఇద్దరు వ్యక్తులదే తప్పని.. టీఎస్‌పీఎస్సీ తప్పిదం లేదని ఎలా చెబుతారన్నారు. వైఫల్యాలను, తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే నోటీసులిస్తున్నారని.. నోటీసులు, అరెస్టులు ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారాయని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని