సంక్షిప్త వార్తలు(11)

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించడంతో సంబరాలు జరుపుకొంటున్న తెదేపా శ్రేణులపై వైకాపా నాయకులు దాడులకు పాల్పడిన ఘటన అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం పుల్లంపేటలో చోటు చేసుకుంది.

Updated : 24 Mar 2023 06:19 IST

తెదేపా శ్రేణులపై వైకాపా నాయకుల దాడులు
తీవ్రంగా గాయపడిన తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు

ఈనాడు డిజిటల్‌, కడప: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించడంతో సంబరాలు జరుపుకొంటున్న తెదేపా శ్రేణులపై వైకాపా నాయకులు దాడులకు పాల్పడిన ఘటన అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం పుల్లంపేటలో చోటు చేసుకుంది. గురువారం రాత్రి తెదేపా శ్రేణులు బాణసంచా కాల్చుతూ సంబరాలు చేసుకోవడంతో తట్టుకోలేకపోయిన వైకాపా నాయకులు కర్రలతో వారిపై దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లునాయుడు తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తరువాత సైతం వైకాపా శ్రేణులు అధిక సంఖ్యలో పుల్లంపేటకు చేరుకుని తెదేపా నాయకులను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తూ వీరంగం సృష్టించారు. ఈ క్రమంలో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. దీంతో పుల్లంపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


వైకాపా ఎమ్మెల్యేల్లోనూ అసంతృప్తి
భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌రాజు

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: ఎమ్మెల్సీగా గెలిచిన తెదేపా అభ్యర్థి అనురాధకు భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు అభినందనలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు తమ తీర్పుతో తెలిపారు. పట్టభద్రుల ఎన్నికల్లో ఉత్తరాంధ్ర వైకాపా అభ్యర్థి 10 వేల మంది ఓటర్లకు వెండి బిస్కెట్లు, రూ.2,000 వరకు నగదు పంపిణీ చేశారు. అయినా ఓటర్లు ప్రలోభాలకు గురి కాలేదు. వైకాపా ఎమ్మెల్యేల్లోనూ అసంతృప్తి తేటతెల్లమైంది. అందుకే అవినీతి, నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడిన తెదేపా అభ్యర్థి అనురాధను గెలిపించారు. 2024 ఎన్నికల్లో వైకాపాకు ప్రతిపక్ష హోదా కూడా రాదని నా నమ్మకం’ అని విష్ణుకుమార్‌రాజు అన్నారు.


సీఎం తగు చర్యలు తీసుకుంటారు
మంత్రి కొట్టు సత్యనారాయణ

ఈనాడు, అమరావతి: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఓటమిపై విశ్లేషించి... బాధ్యులైన వారిపై సీఎం తగు చర్యలు తీసుకుంటారని దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. గురువారం ఆయన సచివాలయంలోని మీడియా పాయింట్‌లో మాట్లాడారు. ‘పోలింగ్‌లో ఎందుకు తేడా జరిగిందనే దానిపై చర్చిస్తాం. ఎక్కడ లోపం ఉందనేది శుక్రవారం తెలుస్తుంది. ఎన్నికలకు సంబంధించి బాధ్యత వహించిన వారు సరిగా వ్యవహరించారా? లేదా? అనే విషయాన్నీ పార్టీ పరిశీలిస్తుంది’ అని మంత్రి చెప్పారు.


నియంతృత్వ ధోరణికి గొడ్డలి పెట్టు: సీపీఐ

ఈనాడు, అమరావతి: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన తెదేపా నాయకురాలు పంచుమర్తి అనురాధకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభినందనలు తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి నియంతృత్వ ధోరణికి ఇది గొడ్డలిపెట్టని, ఆయన తీసుకున్న గోతిలో ఆయనే పడ్డారని విమర్శించారు. ఎమ్మెల్యేలు విజ్ఞత ప్రదర్శించారని పేర్కొన్నారు.


సీఎం జగన్‌ పాలన కక్షపూరితం
సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ

విజయవాడ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో సీఎం జగన్‌ పాలన కక్షపూరితంగా ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. గురువారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు సాధ్యం కాని పని అన్నారు. మూడు రాజధానులు అనేది తప్పుడు నిర్ణయమని వ్యాఖ్యానించారు. తన నిర్ణయాలను సమర్థించుకోవడానికి జగన్‌ అనేక తప్పులు, అప్పులు కూడా చేస్తున్నారని ఆరోపించారు.


9 ఏళ్లలో ఇచ్చిన ఉద్యోగాలు 65 వేలే: షర్మిల

ఈనాడు, హైదరాబాద్‌: బంగారు తెలంగాణలో తొమ్మిదేళ్లలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య 65 వేలు దాటలేదని వైతెపా అధ్యక్షురాలు షర్మిల గురువారం ఓ ప్రకటనలో ఆరోపించారు. ‘‘2015లో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని 65 వేలతో సరిపెట్టారు. 2018 అనంతరం 80 వేల ఉద్యోగాలు అంటూ ఊదరగొట్టారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో 26 వేల పోస్టులకే నోటిఫికేషన్లు ఇచ్చారు. ఇప్పుడు ప్రశ్నపత్రాలు లీక్‌ అయ్యాయి. మళ్లీ పరీక్షలు అంటున్నారు.  2018 నుంచి 2023 వరకు అయిదేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వనట్లే.  పేపర్‌ లీకేజీపై వెంటనే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలి’’ అని షర్మిల కోరారు.


ప్రతిపక్షాలన్నీ కలిసి  భాజపాపై పోరాడాలి

మెహబూబా ముఫ్తీ స్పష్టీకరణ

శ్రీనగర్‌: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ కలిసి పోరాడితేనే భాజపాను ఎదుర్కోగలమని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ స్పష్టం చేశారు. అయితే అటువంటి కూటమి ఏర్పడటంపై ఆమె సందేహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌తో కూడిన మహా కూటమి అవసరమని, కానీ ప్రతిపక్షాలు కలవకుండా భాజపా ఎత్తులు వేస్తోందని గురువారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పేర్కొన్నారు. సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్‌, బీఎస్సీ అధ్యక్షురాలు మాయావతి మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. మమతా బెనర్జీ, కేసీఆర్‌, కేజ్రీవాల్‌ ఒకదారిలో వెళ్తున్నారని, కాంగ్రెస్‌ మహా కూటమికి నాయకత్వం వహించకుండా భాజపా అడ్డుపడుతోందని ఆరోపించారు.


అమిత్‌ షా వ్యాఖ్యలపై దర్యాప్తు జరపండి

సీబీఐ డైరెక్టర్‌కు జైరాం రమేశ్‌ లేఖ

దిల్లీ: మేఘాలయలోని కన్రాడ్‌ సంగ్మా గత ప్రభుత్వం అవినీతిమయమంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఇదివరలో చేసిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరపాలని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీబీఐ డైరెక్టర్‌ సుబోధ్‌ జైశ్వాల్‌కు లేఖ రాశారు. ఫిబ్రవరి 17న అమిత్‌ షా ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ...సంగ్మా ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతికరమైనదని విమర్శించారని రమేశ్‌ తెలిపారు. ఈ వ్యాఖ్యలకు గాను అమిత్‌ షాకు కూడా సమన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మహిళలు ఇప్పటికీ లైంగిక వేధింపులకు గురవుతున్నారని భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌ గాంధీ ఒక సభలో ఆరోపించినందుకు గాను గత వారం దిల్లీ పోలీసులు ఆయన నివాసానికి వెళ్లారు. ఈ వివాదం నేపథ్యంలోనే జైరాం రమేశ్‌ సీబీఐకి లేఖ రాశారు.


నాలుగు రాష్ట్రాలకు భాజపా కొత్త అధ్యక్షులు  

దిల్లీ: భారతీయ జనతా పార్టీ నాలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. లోక్‌సభ ఎంపీ సి.పి.జోషీకి రాజస్థాన్‌ పార్టీ బాధ్యతలు అప్పగించింది. బిహార్‌కు ఓబీసీ నేత సామ్రాట్‌ చౌధరి, ఒడిశాకు మన్మోహన్‌ సమాల్‌, దిల్లీకి వీరేంద్ర సచ్‌దేవాను రాష్ట్ర భాజపా అధ్యక్షులుగా ప్రకటించింది.


రాహుల్‌ పోస్టర్‌ను చెప్పులతో కొట్టడంపై వివాదం

ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ పోస్టర్‌ను చెప్పులతో కొట్టడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. సావర్కర్‌పై విమర్శలు చేయడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇలా నిరసన తెలిపారు. దీనిపై గురువారం శాసనసభలో మహా వికాస్‌ అఘాడీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతల తీరుపై స్పీకరు నర్వేకర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. విచారణకు ఆదేశిస్తానని హామీ ఇచ్చారు.


ప్రజా వ్యతిరేకతను గమనించే సీఎం పరామర్శలు: మర్రి శశిధర్‌రెడ్డి

ఈనాడు, దిల్లీ: ప్రజల్లో తనపై, తన ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని గ్రహించే ముఖ్యమంత్రి కేసీఆర్‌.. పంట నష్టం పరిశీలన పేరుతో రైతులను పరామర్శించేందుకు వెళ్లారని భాజపా నేత మర్రి శశిధర్‌రెడ్డి విమర్శించారు. దిల్లీ తెలంగాణ భవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తొమ్మిదేళ్లలో ఒక్కసారీ రైతులను ముఖ్యమంత్రి పరామర్శించలేదని ఆరోపించారు. ఇప్పుడు కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేందుకే జిల్లాల పర్యటనకు బయలుదేరారని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు