MLC Elections: ఆ నలుగురు ఎవరంటే?

శాసనసభ్యుల కోటా శాసన మండలి ఎన్నికల్లో తెదేపాకు అదనంగా పోలైన నాలుగు ఓట్లు ఎవరు వేశారన్నది ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Updated : 24 Mar 2023 08:17 IST

అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటేసినవారెవరని ఆసక్తి
వారెవరో గుర్తించిన వైకాపా

ఈనాడు, అమరావతి: శాసనసభ్యుల కోటా శాసన మండలి ఎన్నికల్లో తెదేపాకు అదనంగా పోలైన నాలుగు ఓట్లు ఎవరు వేశారన్నది ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వీరిలో ఇద్దరి విషయంలో అందరికీ అవగాహన ఉన్నప్పటికీ మిగిలిన ఇద్దరు ఎవరన్నదానిపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. ఎవరు ఓట్లేయటం ద్వారా తమకు విజయం చేకూరిందన్న దానిపై సహజంగానే తెదేపాకు అవగాహన ఉంది. అయితే బాహాటంగా మాట్లాడటానికి ఆ పార్టీ నేతలు ఇష్టపడటం లేదు. రాజకీయ ఎత్తుగడల్లో లోపాలతో నష్టపోయామని భావిస్తున్న వైకాపా... ఫలితమొచ్చినప్పటి నుంచి ఆ ఇద్దరూ ఎవరో తెలుసుకునేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది. చివరికి నిబంధనలు అంగీకరించకపోయినా.. రివిజన్‌ పేరుతో తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధకు పోలైన బ్యాలట్‌ పత్రాలను సైతం నిశితంగా పరిశీలించింది. చివరికి ఒక అవగాహనకు వచ్చినట్లుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటనను బట్టి అర్థమవుతోంది.


వీరే ఆ నలుగురు!

1) నెల్లూరు రూరల్‌ వైకాపా రెబల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆత్మప్రబోధానుసారం ఓటేసినట్లు ప్రకటించారు. తెదేపా అభ్యర్థి  గెలుపొందిన వెంటనే శ్రీధర్‌రెడ్డి సోదరుడు గిరిధర్‌రెడ్డి నెల్లూరులో వారి కార్యాలయం వద్ద బాణసంచా కాల్చారు. ఈ పరిణామాలతో ఆయన తెదేపాకు ఓటేసి ఉంటారని భావిస్తున్నారు.

2) సీనియర్‌ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి (వెంకటగిరి) స్థానంలో వైకాపా బాధ్యుడిగా నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డిని ఇటీవల పార్టీ నియమించింది. ఆనంను అసలు పార్టీలోనే లేనట్లుగా వైకాపా పరిగణిస్తోంది. తాజా ఎన్నికల్లో ఓటు విషయమై ఆయన్ను వైకాపా నేతలు ఎవరూ కనీసం సంప్రదించలేదు. దీంతో ఆనం సైతం ఆత్మప్రబోధానుసారం ఓటేసి ఉంటారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

3) నెల్లూరు జిల్లాకు చెందిన మరో సీనియర్‌ ఎమ్మెల్యేకి వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వటం లేదని ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌ తేల్చిచెప్పినట్లు సమాచారం. ఆ ఎమ్మెల్యే అడిగిన కొన్ని పనులు కూడా చేయలేదని, చివరికి ఆయన కుటుంబసభ్యులు ఒకరికి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పదవి అడిగినా ఇవ్వలేదని పార్టీ వర్గాల కథనం. ఆయన తెదేపాకు ఓటేస్తారేమోనన్న సందేహంతో.. ఆ జిల్లా పార్టీ సమన్వయకర్తగా ఉన్న మాజీ మంత్రి ఒకరు బుధవారం ఆయన్ను ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లారు. అప్పుడు కూడా పోటీకి అవకాశం ఇవ్వలేనని, ఇంకేదైనా పనులుంటే చేస్తానని చెప్పినట్లు తెలిసింది. ఆ ఎమ్మెల్యేను వైకాపా అభ్యర్థి జయమంగళ వెంకటరమణకు కేటాయించారు. ఆయనకు తొలి ప్రాధాన్యం కింద మొత్తం 22 మంది ఎమ్మెల్యేలను కేటాయించగా.. ఒక ఓటు తగ్గింది. దీంతో ఆ ఎమ్మెల్యేపైనే వైకాపా అగ్రనేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

4) రాజకీయంగా చైతన్యవంతమైన కోస్తా జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు సైతం రానున్న ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వటం సాధ్యం కాదని అగ్రనేతలు కొద్దిరోజుల కిందట తేల్చిచెప్పారు. ఆ ఎమ్మెల్యే కుటుంబసభ్యులతో కలిసి సీఎం జగన్‌తో గురువారం భేటీ అయ్యారు. అప్పుడు కూడా టికెట్‌ ఇవ్వలేనని పునరుద్ఘాటించినట్లు సమాచారం. ఆ ఎమ్మెల్యేను కోలా గురువులుకు కేటాయించారు. తొలి ప్రాధాన్యం కింద గురువులకు 22 ఓట్లు రావాల్సి ఉండగా.. ఒకటి తగ్గింది. దీంతో ఆ ఎమ్మెల్యేనూ వైకాపా అగ్రనేతలు సందేహిస్తున్నారు.

సమయం వచ్చినప్పుడు చర్యలు: సజ్జల

ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓట్లేసిన ఇద్దరు ఎమ్మెల్యేలను గుర్తించామని ప్రకటించారు. వారి పేర్లు బయటపెట్టబోమని, సరైన సమయంలో చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నెల్లూరు గ్రామీణ, వెంకటగిరి ఎమ్మెల్యేలను అసలు పరిగణనలోకి తీసుకోలేదని కూడా సజ్జల చెప్పటం గమనార్హం.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని