వైకాపాకు తెదేపా షాక్‌

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైకాపాకు షాక్‌ తగిలింది. ఆ పార్టీకి కొందరు సొంత ఎమ్మెల్యేలే మొండి చేయి చూపారు. తెదేపా అభ్యర్థిగా బరిలో నిలిచిన పంచుమర్తి అనురాధకు ఓటేసి ఘన విజయం కట్టబెట్టారు.

Updated : 24 Mar 2023 06:57 IST

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనురాధ సంచలన విజయం
అధికార పక్షానికి చేయిచ్చిన సొంత పార్టీ ఎమ్మెల్యేలు
ఆరు సీట్లకే పరిమితమైన అధికార పార్టీ
వైకాపా అభ్యర్థులకు 22 చొప్పున ఓట్లు  
అనురాధకు 23 ఓట్లు
ఈనాడు - అమరావతి

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైకాపాకు షాక్‌ తగిలింది. ఆ పార్టీకి కొందరు సొంత ఎమ్మెల్యేలే మొండి చేయి చూపారు. తెదేపా అభ్యర్థిగా బరిలో నిలిచిన పంచుమర్తి అనురాధకు ఓటేసి ఘన విజయం కట్టబెట్టారు. ఏడు స్థానాలూ గెలుస్తామని ధీమాతో బరిలోకి దిగిన వైకాపా చివరకు ఆరు స్థానాలకే పరిమితమైంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం సాయంత్రం 5 గంటలకు మొదలైంది. మొత్తం ఏడు స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా వైకాపా నుంచి అయిదుగురు, తెదేపా నుంచి ఒకరు తొలి ప్రాధాన్యతా ఓట్లతోనే విజయం సాధించారు. వైకాపా నుంచి పోటీ చేసిన మర్రి రాజశేఖర్‌, చంద్రగిరి ఏసురత్నం, బొమ్మి ఇజ్రాయేలు, పెన్మత్స వివి సూర్యనారాయణరాజు, పోతుల సునీతకు ఒక్కొక్కరికీ 22 ఓట్లు చొప్పున లభించాయి. తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధకు 23 ఓట్లు వచ్చాయి. తొలి ప్రాధాన్యతా ఓట్లతోనే వీరంతా గెలుపొందారు. వైకాపా నుంచి బరిలో నిలిచిన కోలా గురువులు, జయమంగళ వెంకటరమణకు 21 ఓట్ల చొప్పున రావడంతో రెండో ప్రాధాన్యతా ఓట్లు లెక్కించారు. తెదేపా నుంచి రెండో ప్రాధాన్యత ఒకటి పడటంతో  వెంకటరమణ గెలిచారు. విజేతలకు రిటర్నింగ్‌ అధికారి సుబ్బారెడ్డి ధ్రువపత్రాలు అందజేశారు.

విజయానికి 23 ఓట్లు: 2019 ఎన్నికల్లో తెదేపా నుంచి 23 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. వీరిలో నలుగురిని వైకాపా అనధికారికంగా తమ పార్టీలోకి లాక్కుంది. దీంతో తెదేపాకు 19 మంది శాసనసభ్యులే మిగిలారు. ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా వీరిలోనూ కొందరికి అధికార పార్టీ వల విసిరింది. సాధ్యమైనంత వరకు ఓటింగ్‌ లేకుండా చూడాలని శత విధాలా ప్రయత్నించి.. విఫలమైంది. ప్రజలు తెదేపాకు ఎంతమందిని గెలిపించారో.. అవే 23 ఓట్లతో పంచుమర్తి అనురాధ గెలుపొందడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని