ఈవీఎంలపై సందేహాలెన్నో?.. ఈసీని కలవాలని ప్రతిపక్షాల భేటీలో నిర్ణయం

ఎన్నికల్లో ఈవీఎంల వినియోగంపై నెలకొన్న ఆందోళనల గురించి ఎన్నికల కమిషన్‌ను (ఈసీ) కలిసి గట్టిగా వాదనను వినిపించాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి.

Published : 24 Mar 2023 04:08 IST

శరద్‌ పవార్‌ నేతృత్వంలో చర్చలు

దిల్లీ: ఎన్నికల్లో ఈవీఎంల వినియోగంపై నెలకొన్న ఆందోళనల గురించి ఎన్నికల కమిషన్‌ను (ఈసీ) కలిసి గట్టిగా వాదనను వినిపించాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. వలస ఓటర్ల కోసం రిమోట్‌ ఓటింగ్‌ను ప్రవేశపెట్టాలనుకున్న అంశంపైనా అభ్యంతరాలను వ్యక్తం చేయాలని తీర్మానించాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నేతలతో గురువారం ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఈ అంశంపై సమావేశమయ్యారు. దీనికి కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌, స్వతంత్ర సభ్యుడు కపిల్‌ సిబల్‌, సమాజ్‌వాదీ నేత రాంగోపాల్‌ యాదవ్‌, శివసేన (ఉద్ధవ్‌ గ్రూపు) నేత అనిల్‌ దేశాయ్‌, భారాస నేత కె.కేశవరావు హాజరయ్యారు. తృణమూల్‌ నుంచి ఎవరూ హాజరు కాలేదు. సమావేశానంతరం దిగ్విజయ్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడారు. ‘వలస ఓటర్ల కోసం రిమోట్‌ ఓటింగ్‌ ఏర్పాట్లు చేయాలన్న ఎన్నికల కమిషన్‌ ప్రతిపాదనను ఏకగ్రీవంగా వ్యతిరేకించాం. ఈ విషయంలో ఈసీ డెమో ఇవ్వడాన్ని కూడా అంగీకరించేది లేదు. ఈవీఎంలపై ఓటర్లకూ ఎన్నో అనుమానాలున్నాయి. గతంలో ఈవీఎం అంటే ఆ ఒక్క యంత్రమే ఉండేది. ఇప్పుడు అభ్యర్థుల పేర్లను ఇంటర్నెట్‌ ద్వారా చేర్చవచ్చని అంటున్నారు. ఈవీఎంలపై ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తూ ఈసీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ బి లోకుర్‌ నేతృత్వంలోని సిటిజెన్స్‌ కమిషన్‌ ఆఫ్‌ ఎలక్షన్స్‌ ఫిర్యాదు చేసింది. కానీ ఈసీ స్పందించలేదు’ అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఈవీఎంలను వాడటం లేదని, మన దగ్గరే ఎందుకు వాడుతున్నారని కపిల్‌ సిబల్‌ ప్రశ్నించారు.  

ఓటములను కప్పిపుచ్చుకునేందుకే: భాజపా

వచ్చే ఎన్నికల్లో ఓటములను కప్పిపుచ్చుకునేందుకే విపక్ష నేతలు ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని భాజపా ఆరోపించింది. ఓటములకు ఓటింగ్‌ యంత్రాలను కారణంగా పేర్కొని తప్పించుకోవడమే వారి లక్ష్యమని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి అనిల్‌ బలూనీ విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని