YSRCP: వైకాపాకు దెబ్బమీద దెబ్బ

గత సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఓటమి చూడలేదంటూ విర్రవీగిన అధికార పార్టీ పెద్దలకు మొన్న పట్టభద్రులు, ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలు దిమ్మతిరిగే షాకిచ్చారు. మాకు తిరుగే లేదన్నట్లుగా ‘కుప్పం స్థానిక సంస్థల్లోనూ స్వీప్‌ చేశాం.

Updated : 24 Mar 2023 07:16 IST

ఫ్యాన్‌కు ఇక ఎదురుగాలేనా?

ఈనాడు, అమరావతి: గత సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఓటమి చూడలేదంటూ విర్రవీగిన అధికార పార్టీ పెద్దలకు మొన్న పట్టభద్రులు, ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలు దిమ్మతిరిగే షాకిచ్చారు. మాకు తిరుగే లేదన్నట్లుగా ‘కుప్పం స్థానిక సంస్థల్లోనూ స్వీప్‌ చేశాం.. ఇక వచ్చే సాధారణ ఎన్నికల్లో వై నాట్‌ 175’ అంటూ వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు కూడా. అయితే పట్టభద్రులు, ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో దెబ్బమీద దెబ్బ తగటంతో అధినాయకత్వానికి తత్వం బోధపడిందనే చర్చ వైకాపాలోనే మొదలైంది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిపై అంచనా ఉండే ‘వై నాట్‌ 175’ అంటూ తమ అధినాయకత్వం డాంబికాలు పోతున్నట్లుందని వైకాపా నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన సంఖ్యాబలం లేకపోయినా ఏడో స్థానం కోసం పోటీపడి పరాభవాన్ని మూటగట్టుకోవడం వైకాపాకు దెబ్బ మీద దెబ్బే. సొంత పార్టీ ఎమ్మెల్యేల విశ్వాసాన్నీ కాపాడుకోలేకపోయింది. తెదేపా, జనసేనల నుంచి వచ్చిన అయిదుగురు ఎమ్మెల్యేలను చూసుకుని సొంత బలం లేకపోయినా ఏడో స్థానం కోసం అర్రులు చాచిన వైకాపా అధిష్ఠానం ప్రధాన ప్రతిపక్షం తెదేపా వ్యూహంతో కంగు తింది. బయట నుంచి ఓట్లు రావడం అటుంచి.. సొంత పార్టీ ఎమ్మెల్యేలే గోడ దూకారు. మొన్న పట్టభద్రులు ఫ్యాన్‌ రెక్కలు విరిస్తే.. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలే పసుపు జెండా ఎగరేశారు. అధికార పార్టీ ఆధిపత్యం ఇకపై చెల్లదు అనేందుకు పట్టభద్రులు, ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు స్పష్టమైన సంకేతాలుగా నిలిచాయి.

అణచివేతపై తిరుగుబాటు

పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వ్యవహార శైలిపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సహా.. అధిక శాతం నేతలు తీవ్ర అసహనంతో ఉన్నారు. తమకు ఎంత మాత్రం గౌరవం లేదని, పట్టించుకునే పరిస్థితి లేదనే అభిప్రాయాలు వారిలో వ్యక్తమవుతున్నాయి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి కలిసిన సందర్భాలు తక్కువే. సీఎం అపాయింట్‌మెంట్‌ కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా సిఫార్సులతో వెళ్లాల్సిన పరిస్థితి. అసంతృప్తితో రగులుతున్నా ఇన్నాళ్లూ పట్టించుకోలేదు కానీ, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా ఓటు అవసరమయ్యేసరికి పిలిచి మాట్లాడుతున్నారంటూ కొందరు అసంతృప్త ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించడం గమనార్హం. మరోవైపు అసంతృప్తులు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. గురువారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా ఎమ్మెల్యేల మద్దతుతోనే తెదేపా అభ్యర్థి విజయం సాధించడంతో పార్టీలో ఏ స్థాయిలో అసంతృప్తి ఉందనేది వైకాపా అధినాయకత్వానికి అవగతమైనట్లుంది. ఇప్పటికే నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. మరో సీనియర్‌ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి కూడా ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ముఖ్యమంత్రిపైనే వ్యతిరేకతను ప్రకటించి.. సీఎం విధాన నిర్ణయాల లోపాలను ఎండగడుతున్నారు. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలతో మరికొందరు ఎమ్మెల్యేలు కూడా వైకాపా అధినాయకత్వంపై తిరుగుబాటు దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నారన్న చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లూ అధికారంలో ఉన్నాం.. బయటకు వెళితే ఇబ్బంది పెడతారేమో అని ఆగారు, ఇకపై అలా ఉండదని అంటున్నారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం సోదరుడు, ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టయితే.. పార్టీలో పరిణామాలు మరింత వేగంగా మారతాయని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. భయంతోనో, భక్తితోనో తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పటి వరకు వంగి వంగి దండాలు పెడుతున్నవారే.. రాబోయే రోజుల్లో తామేమిటో అధినేతకు తెలియజేస్తారని అంటున్నారు.

అప్పుడు అరాచకం.. ఇప్పుడు తెల్లమొహం

స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు ఎదురే లేదన్నట్లు వైకాపా వ్యవహరించింది. ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్‌ కూడా దాఖలు చేయనీయకుండా అడ్డుపడింది. ఒకరిద్దరు నామినేషన్లు దాఖలు చేసినా బలవంతంగా ఉపసంహరింపజేసిన దాఖలాలూ ఉన్నాయి. ఇందుకు అవసరమైనచోట్ల పోలీసులనూ వినియోగించింది. ఇవన్నీ దాటుకుని ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు బరిలో నిలిచినా పోలింగ్‌ కేంద్రాల లోపలికి వారి ఏజెంట్లను రానివ్వకుండా అధికార జులుం ప్రదర్శించింది.

తెదేపా తీరుతో ఆత్మరక్షణలోకి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి పోటీలో నిలవడంతోనే వైకాపా ఆత్మరక్షణలో పడింది. అప్పటి వరకు తమకు తిరుగే లేదన్నట్లు వ్యవహరించిన అధినేత కూడా ఆత్మరక్షణలో పడ్డారు. 151 మంది ఎమ్మెల్యేల బలం ఉందని డాంబికాలు పలికిన పార్టీయే చివరకు తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవాల్సిన పరిస్థితికి చేరింది. కొందరు ఎమ్మెల్యేల్లో అసంతృప్తిని ముందే అంచనా వేసి ఎమ్మెల్యేలను శిబిరాలకు తరలించింది. మంత్రుల కనుసన్నల్లో బృందాలను ఏర్పాటు చేసింది. వారి ఆధ్వర్యంలోనే పోలింగ్‌ కేంద్రానికి తీసుకొచ్చి ఓటు వేయించింది. చివరకు ముఖ్యమంత్రి జగనే పలువురు ఎమ్మెల్యేలతో స్వయంగా మాట్లాడి దిశానిర్దేశం చేశారు. ఇంత చేసినా ఏడో స్థానంలో తెదేపా విజయాన్ని అడ్డుకోలేకపోయారు.

పార్టీ నియమావళికీ దిక్కు లేదు

పార్టీ నియమావళిని పాటించే పరిస్థితి వైకాపాలో లేదు. ఏ విధాన, ప్రధాన నిర్ణయమైనా పార్టీలో ప్రజాస్వామ్యబద్ధంగా చర్చించి తీసుకోవాలనేది నియమావళి. ఇందుకోసం ప్రత్యేకంగా రాజకీయ వ్యవహారాల కమిటీ లేదా మరో పేరుతోనో ఉన్నతస్థాయి కమిటీ ఉంటుంది. కానీ వైకాపాలో ఇలాంటి కమిటీలు కానీ, పార్టీలో అందరితో లేదా కనీసం కొందరు ప్రధాన నేతలతోనో చర్చించి నిర్ణయం తీసుకునే విధానం కూడా లేదు.

నెల్లూరు నుంచే పతనం మొదలయిందా?

గత ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైకాపా స్వీప్‌ చేసింది. ఇప్పుడు అదే నెల్లూరులో ఆ పార్టీ నగుబాటు పాలైంది. ఇప్పటికే నెల్లూరు గ్రామీణ, వెంకటగిరి ఎమ్మెల్యేలు పార్టీపై తిరుగుబాటు ప్రకటించేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేనే చేయిచ్చారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్‌ సొంత జిల్లా కడప తర్వాత ఆ స్థాయిలో సొంతమనుకున్న నెల్లూరు జిల్లా నుంచి తమ పతనం మొదలైందని వైకాపా నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

ఆ అత్యాశే కొంప ముంచిందా?

శాసనసభలో పూర్తిస్థాయి బలం ఉంది.. అలాగే శాసనమండలి కూడా పూర్తిగా తమ నియంత్రణలోనే ఉండాలి, అన్ని ఎమ్మెల్సీ స్థానాలనూ సొంతం చేసుకోవాలనే ప్రభుత్వ పెద్దల అత్యాశే ఈ పరాభవాలకు నాంది పలికిందా అంటే అవుననే అంటున్నాయి వైకాపా వర్గాలు. ‘ఈ నియంతృత్వ పోకడతోనే గతంలో ఎప్పుడూ పోటీచేయని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేరుగా బరిలోకి దిగి బొక్కబోర్లా పడ్డాం’ అని వైకాపా ఎమ్మెల్యేలే వ్యాఖ్యానిస్తున్నారు. ఆ పరాభవంతోనైనా గుణపాఠం నేర్చుకోకుండా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు కూడా అన్నీ మాకే కావాలనే ధోరణితో తగిన సంఖ్యా బలం లేకపోయినా, ప్రత్యర్థి పార్టీ నుంచి వచ్చిన సభ్యులను నమ్ముకుని పోటీ చేశారు. బయట నుంచి మద్దతిచ్చిన వారిని చూసుకుని బరిలోకి దిగితే.. సొంత పార్టీవారే వాత పెట్టారన్న చర్చ జరుగుతోంది. ఈ రెండు ఎన్నికల విషయంలో పోటీపై గానీ, అభ్యర్థుల ఎంపికలో, ఎన్నికలకు సిద్ధమవడంలో గానీ ఎక్కడా సీనియర్లు, అవగాహన ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలనూ విశ్వాసంలోకి తీసుకోకపోవడం పరాభవాలకు దారి తీసింది. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీల ఎన్నికల్లో ఓట్లు ఎలా వేయాలి? ఓట్ల లెక్కింపు ఎలా ఉంటుంది? ప్రాధాన్యత ఓట్లను ఎలా సాధించుకోవాలి వంటి విషయాలపై ఎమ్మెల్యేలతో చర్చించి ఒక ప్రణాళికను సిద్ధం చేసిన పరిస్థితి లేదంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు