మరి.. ఇవి ఎవరి ఓట్లు?

శాసనమండలి పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనప్పుడు.. ‘పట్టభద్ర ఓటర్లు వ్యవస్థీకృతమైనవాళ్లు. ప్రభుత్వ పథకాలతో సంబంధం లేని వర్గం.

Updated : 24 Mar 2023 08:00 IST

వైకాపా నాయకత్వంపై సొంత పార్టీలోనే విసుర్లు
వ్యూహం లేకే బోర్లాపడ్డామని వ్యాఖ్యలు

ఈనాడు, అమరావతి: శాసనమండలి పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనప్పుడు.. ‘పట్టభద్ర ఓటర్లు వ్యవస్థీకృతమైనవాళ్లు. ప్రభుత్వ పథకాలతో సంబంధం లేని వర్గం. సంక్షేమ పథకాల్ని అందుకున్న ఓటర్లు చాలా తక్కువ. ఈ ఫలితాలను మొత్తానికి వర్తింపజేయటం సరికాదు’ అంటూ పరోక్షంగా వాళ్లు మా ఓటర్లు కాదన్న ధోరణిలో వైకాపా అగ్రనేతలు మాట్లాడారు. అదే సమయంలో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపాకు బలం లేకపోయినా పోటీ చేస్తోందని, వారికి అవసరమైన సంఖ్యే లేదంటూ ఆక్షేపించారు. గురువారం ఫలితాలు రాగానే వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచే అగ్రనేతలపై ఘాటైన విమర్శల విసుర్లు వినిపించాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు అసలు రాజకీయం ఎలా ఉంటుందో మాకు చూపిస్తుంటే.. మేమేమో వాళ్లు మా ఓటర్లు కాదంటూ, తాజా ఎన్నికల్లో ప్రత్యర్థులకు సంఖ్యా బలమే లేదంటూ మరింత పలుచనయ్యామని పేర్కొంటున్నారు. పట్టభద్రుల్లో అన్ని సామాజికవర్గాలవారు ఉంటారు. వారిలో సంక్షేమ పథకాలు అందుకున్నవారూ ఉంటారు. అయినా ఓటమిని జీర్ణించుకోలేక అసలు వాళ్లు మా ఓటర్లే కాదని చెప్పటం ఎంత రాజకీయ అపరిపక్వతో అర్థమవుతోందని ప్రస్తావిస్తున్నారు.

ప్రత్యర్థి వ్యూహాల్ని పసిగట్టలేకే..

ఎమ్మెల్యేల కోటా ఎన్నికల్లో ప్రతిపక్షానికి సంఖ్యా బలమే లేదని కొట్టిపారేసిన పార్టీ నాయకత్వం.. ప్రత్యర్థి వ్యూహాల్ని పసిగట్టి ప్రతివ్యూహం రూపొందించుకోలేకపోవడం వల్లే ఓటమి పాలయ్యామని వైకాపా నాయకులే విశ్లేషిస్తున్నారు. తెదేపాకు కనీసం ముగ్గురు నుంచి నలుగురి వరకు అదనంగా వస్తేనే గెలుపు సాధ్యమవుతుందని అందరికీ అవగాహన ఉంది. అలాంటప్పుడు మాకున్న సంఖ్యా బలం నుంచి ఒక్క ఓటు కూడా చెదరకుండా చూసుకోవాలి. కానీ దీనికి కొన్ని వారాల ముందే నెల్లూరు జిల్లాలో ఇద్దరు శాసనసభ్యుల్ని పార్టీ నుంచి సాంకేతికంగా కాకపోయినా.. దాదాపుగా బహిష్కరించేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వారిని మాట వరసకు కూడా సంప్రదించలేదు. అదే జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యేకు వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వటం లేదని కొద్ది రోజుల కిందట నేరుగానే చెప్పేశారు. బుధవారం ఆయనతో ఏకంగా ముఖ్యనేతే భేటీ అయినా ఫలితం లేకపోయింది. ప్రత్యర్థికి సహకరిస్తారేమోనన్న సందేహంతో ఓ ఎమ్మెల్యేకి వివిధ రూపాల్లో భారీ సాయం చేశారు. అయినా అనుమానం తీరక ఆఖరి నిమిషంలోనూ సంప్రదింపులు జరిపారు. 2019లో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ముఖ్యమంత్రి జగన్‌తో సరైన భేటీలు జరగక... పనులు కాక తీవ్ర అసంతృప్తితో ఉన్న శాసనసభ్యుల్ని పదుల సంఖ్యలోనే గుర్తించి బుధవారం ఫోన్లో మాట్లాడించారు. అప్పటికప్పుడు కొన్ని పెండింగ్‌ పనులకు పచ్చజెండా కూడా ఊపారు. అయినా మరో ఎమ్మెల్యే చేజారిపోయారు. పార్టీని, ప్రభుత్వాన్ని నడపటంలో.. రాజకీయం చేయటంలో ఈ వ్యూహాత్మక తప్పిదాలే తమ కొంపముంచాయని అధికార పక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలు అగ్రనేత వైపే వేలెత్తి చూపుతున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఇలాగే ఉంటుందని, ఇప్పటి వరకు సొంత పార్టీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యుల్నే పట్టించుకోని తీరుతో ఇలాంటి ఫలితాలే ఉంటాయని అంటున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి.. ‘ఆ ఓటర్లు మా వాళ్లు కాదన్న రీతిలో మాట్లాడిన నాయకులు, ఇప్పుడు ఓటర్లయిన ఎమ్మెల్యేలు కూడా మా వాళ్లు కాదని అంటారా’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల వైఫల్యాలకు తోడు రాబోయే రోజుల్లో.. వైఎస్‌ వివేకా హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న పార్టీ ఎంపీ అవినాష్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తే తమ పని పెనంపై నుంచి పొయ్యిలో పడినట్లవుతుందని ఆందోళన చెందుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు