Sajjala: ఆ ఇద్దరు ఎమ్మెల్యేలూ ఎవరో గుర్తించాం : సజ్జల

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా నుంచి తెదేపాకు మద్దతుగా ఓటు వేసిన ఎమ్మెల్యేలను గుర్తించామని, వారి పేర్లు బయటపెట్టాల్సిన అవసరం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

Updated : 24 Mar 2023 09:14 IST

వారిపై సరైన సమయంలో సరైన చర్యలు
చంద్రబాబు ప్రలోభపెట్టారు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా నుంచి తెదేపాకు మద్దతుగా ఓటు వేసిన ఎమ్మెల్యేలను గుర్తించామని, వారి పేర్లు బయటపెట్టాల్సిన అవసరం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఇది పార్టీ అంతర్గత వ్యవహారమని, వారిపై సరైన సమయంలో సరైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తమది రాజకీయపార్టీ అని, పీకేయడానికి వారు ఉద్యోగులు కాదని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలకు విప్‌ చెల్లదని, అది ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ఆవరణంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. ‘మేం నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యేను, వెంకటగిరి ఎమ్మెల్యేను పరిగణనలోకి తీసుకోకుండానే తెదేపా, జనసేన నుంచి బయటికి వచ్చిన 5 గురు ఎమ్మెల్యేలతో కలిపి.. ఈ ఎన్నికల్లో 7 స్థానాలూ గెలిచేంత సంఖ్యా బలం మాకు ఉంది. కానీ గెలవలేదు. చంద్రబాబు మా ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారు. డబ్బులు తప్ప వారికి ఇవ్వడానికి ఇక ఏముంటుంది? ఎవరినో కొనుగోలు చేసినట్లున్నారు. లేకపోతే ఏ ప్రాతిపదికన వారికి 23 ఓట్లు వచ్చాయి. నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే తెదేపా నుంచి బయటికి వచ్చారు. వారు జగన్‌తో ఉన్నామని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. అలాంటప్పుడు 19 మందితో 23 ఓట్లు ఎలా తెచ్చుకున్నారు? కచ్చితంగా ప్రలోభపెట్టారు. చంద్రబాబుకు తెలిసిన రాజకీయమే అది. ఎమ్మెల్యేల కొనుగోలులో చంద్రబాబు ప్రపంచ ఛాంపియన్‌ అన్నా మాకేమీ అభ్యంతరం లేదు. జగన్‌, వైకాపా అందులో పోటీ పడలేరు’ అని పేర్కొన్నారు.  

ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని ముందు తెలియదు...

‘ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని మాకు ముందు తెలియదు. మీడియాలో కొందరి పేర్లు వచ్చిన తరవాత అడిగించాం. అలా అడిగినప్పుడు అంతా బాగానే కనిపించింది. ఎవరికైనా చిన్నపాటి అసంతృప్తి ఉంటే దాన్ని కూడా తొలగించాం. వారు కూడా తెలుసుకున్నారని అనుకున్నాం. కానీ ఓటమి చూస్తే బలమైన కారణమేదో ఉందనిపిస్తోంది. అంత బలమైన కారణం ఏముంటుంది? చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసి 175 స్థానాల్లో గెలవగలరనే ధీమా ఏమైనా వచ్చిందా? ఏ నమ్మకంతో వారు ఇటు నుంచి అటు వెళ్లి ఉంటారు? డబ్బులు తప్ప మాకు వేరే కనిపించట్లేదు. దానికి మేం సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు. చంద్రబాబే సమాధానం చెప్పాలి. పార్టీలో ఉన్నవారికి గౌరవం ఉంటుంది. కుటుంబ సభ్యుల్లా చూస్తాం. ఎవరైనా ప్రలోభాలకు గురైతే అదీ కూడా మంచిదే. ఇక్కడ సంతృప్తి, అసంతృప్తి అనేది సమస్య కాదు.  జగన్‌ విధానాలు నచ్చిన వారు ఆయన వెంట ఉంటారు. లేదా ఏదో ఆశించి అది అందని వారు పక్క చూపులు చూస్తూ ఉండవచ్చు. అన్ని వర్గాల ప్రజలకూ చేసిన సేవ, వారికి అందించిన ఫలాలు చూసి వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుస్తామని మేం చాలా నమ్మకంగా ఉన్నాం’ అని సజ్జల అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని