Kola Guruvulu: కోలా గురువులుకు మళ్లీ నిరాశే

విశాఖ దక్షిణ నియోజకవర్గ వైకాపా నేత, మత్స్యకార అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా పని చేసిన కోలా గురువులుకు మరోసారి నిరాశే ఎదురైంది.

Updated : 24 Mar 2023 11:33 IST

విశాఖపట్నం (వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: విశాఖ దక్షిణ నియోజకవర్గ వైకాపా నేత, మత్స్యకార అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా పని చేసిన కోలా గురువులుకు మరోసారి నిరాశే ఎదురైంది. చట్టసభల్లో అడుగుపెట్టాలనే ఆయన చిరకాల వాంఛ ఈసారీ తీరలేదు. తరచూ అవాంతరాలు ఎదురవుతున్నా, ఇతర పార్టీల నుంచి ఆహ్వానాలు వస్తున్నా ఆయన వైకాపాలోనే కొనసాగుతున్నారు. మరపడవల నిర్వహణ, హేచరీ వ్యాపారం చేస్తున్న గురువులు ఫిషింగ్‌ హార్బర్‌లో అందరికీ సుపరిచితులు. మత్స్యకార వర్గం తరఫున పలు కార్యక్రమాలు చేపడుతూ.. 2009లో సినీనటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ప్రరాపా తరఫున విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి ద్రోణంరాజు శ్రీనివాసరావు చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రరాపా కాంగ్రెస్‌లో విలీనమయ్యాక గురువులు వైకాపాలో చేరారు. 2014 ఎన్నికల్లో వైకాపా తరఫున ఎన్నికల బరిలోకి దిగి తెదేపా అభ్యర్థి వాసుపల్లి గణేష్‌కుమార్‌ చేతిలో పరాజయం పాలయ్యారు. 2019 ఎన్నికలకు పది రోజుల ముందు వైకాపాలో చేరిన ద్రోణంరాజు శ్రీనివాసరావుకు పార్టీ టికెట్‌ కేటాయించడంతో గురువులుకు పోటీ చేసే అవకాశం దక్కలేదు. తర్వాత సీఎం జగన్‌ ఇచ్చిన హామీ మేరకు మత్స్యకార అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి కట్టబెట్టారు. తాజాగా ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీ టికెట్‌ కేటాయించడంతో గెలుపు ఖాయమని అంతా భావించారు. ఈ ఎన్నికలో తెదేపా అభ్యర్థి బరిలోకి దిగడంతో గురువులుకు మరోమారు ఓటమే మిగిలింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని