పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా?

‘నాలుగేళ్లలో పోలవరం పనులు ఏమేరకు చేశారో.. నిర్వాసితులకు ఎంత సొమ్ము ఇచ్చారో...పూర్తి వివరాలు, వాస్తవాలతో శ్వేతపత్రాన్ని విడుదల చేసే దమ్ము సీఎం జగన్‌కు ఉందా’ అని తెదేపా మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సవాలు విసిరారు.

Published : 24 Mar 2023 04:24 IST

అసెంబ్లీ సాక్షిగా కట్టుకథలు చెబుతారా?
తెదేపా నేత దేవినేని ఉమా ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘నాలుగేళ్లలో పోలవరం పనులు ఏమేరకు చేశారో.. నిర్వాసితులకు ఎంత సొమ్ము ఇచ్చారో...పూర్తి వివరాలు, వాస్తవాలతో శ్వేతపత్రాన్ని విడుదల చేసే దమ్ము సీఎం జగన్‌కు ఉందా’ అని తెదేపా మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సవాలు విసిరారు. తెదేపా హయాంలో ప్రాజెక్టును చంద్రబాబు 72 శాతం పూర్తి చేస్తే....మిగతాది పూర్తి చేయకుండా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 46 నెలలుగా డీపీఆర్‌-2 అంచనా వ్యయం రూ.55,548 కోట్లను కేంద్ర ప్రభుత్వంతో ఆమోదింప చేయించుకోలేని సీఎం... కొన్ని నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. ‘పాదయాత్ర సమయంలో నిర్వాసితులకు రూ.19 లక్షలు ఇస్తానని చెప్పి అధికారంలోకి రాగానే రూ.10లక్షలని మాట మార్చారు. తరవాత ఆ సొమ్ము కూడా ఇవ్వకుండా నిర్వాసితుల నోట్లో మట్టి కొట్టారు. రూ.500 కోట్లకు ఇచ్చిన జీవో ఏమైంది? ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియకుండానే నిర్వాసితుల సొమ్మును తినేశారా?’ అని ఉమా ప్రశ్నించారు.

జగన్‌ ప్రభుత్వ అసమర్థతే దెబ్బతీసింది...

‘గోదావరి వరదను అంచనా వేయలేకపోవడం జగన్‌ ప్రభుత్వ అసమర్థత. అదే కాఫర్‌డ్యామ్‌ను దెబ్బతీసింది. స్పిల్‌ వే నిర్మాణం ఎలా చేశారో? ఎంత ఎత్తు నుంచి చేశారో..జగన్‌కు అతని మంత్రులకు తెలుసా? పోలవరం ప్రాజెక్టు అథారిటీ, డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌...లోయర్‌ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం జరగలేదని, 22 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులు చేయాలని అప్పట్లోనే చెప్పినా జగన్‌ ప్రభుత్వం నిద్రపోయింది. దాని వల్ల గోదావరికి వచ్చిన వరద లోయర్‌ కాఫర్‌ డ్యామ్‌ను ముంచి అప్పర్‌ కాఫర్‌ డ్యామ్‌ను దెబ్బతీసింది. దీంతో డయాఫ్రం వాల్‌ దెబ్బతింది. దాని నిర్మాణాన్ని గాలికొదిలి గుంతలు పూడ్చటానికి రూ.2 వేల కోట్లు అవుతాయంటూ ఆ డబ్బు కొట్టేసేపనిలో జగన్‌ ఉన్నారు’ అని ఆరోపించారు.

డ్యామ్‌గా మార్చే హక్కు ఎవరిచ్చారు?

‘కేంద్ర విజిలెన్స్‌ మార్గదర్శకాలను పక్కన పెట్టి మరీ జగన్‌ రివర్స్‌ టెండరింగ్‌ నాటకాలు ఆడారు.  పోలవరం ప్రాజెక్టును పోలవరం డ్యామ్‌గా మార్చే హక్కు జగన్‌కు ఎవరిచ్చారు? 46 నెలల్లో పూర్తి చేయలేని వ్యక్తి...కొన్ని నెలల్లో పూర్తి చేస్తామని కట్టుకథలు చెబుతున్నారు. రూ.2,600 కోట్ల కేంద్ర నిధులు రాబట్టుకోలేక అసమర్థ సీఎం కొన్ని నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తారా? కాంట్రాక్టర్‌ని మార్చవద్దని పోలవరం ప్రాజెక్టు అథారిటీ చెప్పినా వినలేదు. పీటర్‌ కమిటీ పేరుతో పిచ్చి పనులు చేశారు. ఎత్తుని 41.15 మీటర్లకు ఎందుకు పరిమితం చేస్తున్నారు?’ అని మండిపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని