రాహుల్‌పై అనర్హత వేటు పడుతుందా?

ప్రధాని నరేంద్రమోదీ ఇంటిపేరును కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకు గానూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి జైలుశిక్ష పడిన దరిమిలా ఎంపీగా ఆయనపై అనర్హత వేటు పడుతుందా, లేదా అనేది చర్చకు తావిచ్చింది.

Published : 24 Mar 2023 05:34 IST

దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ఇంటిపేరును కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకు గానూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి జైలుశిక్ష పడిన దరిమిలా ఎంపీగా ఆయనపై అనర్హత వేటు పడుతుందా, లేదా అనేది చర్చకు తావిచ్చింది.ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం- రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలుశిక్ష పడిన వ్యక్తి.. తీర్పు వెలువడిన తేదీ నుంచి రాజ్యాంగ పదవుల్లో ఉండటానికి, ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా ఆరేళ్లపాటు అనర్హులుగా ప్రకటిస్తారు. ఈ ప్రకారం తాజా కేసులో లోక్‌సభ సచివాలయం నుంచి అధికారిక ఉత్తర్వులు వస్తే కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ స్థానం ఖాళీ కానుంది. గతంలో దోషిగా తేలిన ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు వేసే ముందు మూడు నెలల సమయం ఇచ్చేవారు. ఆలోపు పై కోర్టులలో అప్పీలు చేసుకోవచ్చు. న్యాయపరమైన అవకాశాలన్నీ వినియోగించుకునే వరకు వారిపై వేటు పడేది కాదు. లిలీ థామస్‌ అనే న్యాయవాది ఈ నిబంధనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పోరాడారు. ఆ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని ఆమె పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. 2013లో ఆ నిబంధనను కొట్టివేసింది. ప్రజాప్రతినిధులు దోషులుగా తేలిన వెంటనే అనర్హులుగా పరిగణించాలని స్పష్టం చేసింది. ఆ ప్రకారమైతే రాహుల్‌ గాంధీపై అనర్హత కత్తి వేలాడుతున్నట్లే.  ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం.. జైలు శిక్షకాలంతో పాటు మరో ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు అవుతారు. దీంతో ఆయన ఎనిమిదేళ్లపాటు ప్రజాప్రతినిధి జీవితానికి దూరం కావాల్సి ఉంటుంది. తీర్పుపై అప్పీలును పైకోర్టు అనుమతిస్తే అనర్హత వేటు నుంచి ఆయనకు తాత్కాలికంగా ఊరట లభిస్తుంది. ఐపీసీ సెక్షన్‌ 499 ప్రకారం రాహుల్‌ గాంధీ దోషిగా తేలారు. ఈ సెక్షన్‌ కింద రెండేళ్ల శిక్ష పడటం చాలా అరుదు అని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

ప్రతిపక్షాల మండిపాటు

రాహుల్‌కి శిక్ష పడటంపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. న్యాయవ్యవస్థను గౌరవిస్తున్నామంటూ కేంద్రం తీరును తప్పుపట్టాయి. ప్రతిపక్షాలను అంతం చేసే కుట్ర జరుగుతోందంటూ ఆప్‌ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ‘కాంగ్రెస్‌తో మాకు విభేదాలు ఉన్నాయి. అయితే ఈ కేసులో రాహుల్‌ను ఇలా ఇరికించడం సరికాదు. న్యాయస్థానాన్ని గౌరవిస్తా.. కానీ, తీర్పుతో ఏకీభవించను’ అని ఆయన ట్వీట్‌ చేశారు. మీడియాను అణచివేసి, న్యాయవ్యవస్థను ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ ఆరోపించారు. ‘న్యాయవ్యవస్థ, ఈడీ వంటి వ్యవస్థలు దుర్వినియోగం అవుతున్నాయి. మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. రాహుల్‌ వ్యాఖ్యలు సాధారణమే. ఆయనొక్కరే ఎన్డీఏ ప్రభుత్వంతో పోటీపడగలరు’ అని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ వ్యాఖ్యానించారు. రాహుల్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ మద్దతు ప్రకటించారు. భాజపాయేతర నాయకుల్ని కుట్రలతో బాధితుల్ని చేస్తున్నారని ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌సోరెన్‌ అన్నారు.

నిందించడానికి రాహుల్‌కు పూర్తిస్వేచ్ఛ కావాలా?: భాజపా

విపక్షాల వ్యాఖ్యల్ని భాజపా మాత్రం తోసిపుచ్చింది. ఇతరుల్ని నిందించడానికి రాహుల్‌కు పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలా అని కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ ప్రశ్నించారు. కించపరిచే మాటల్ని మానుకోకపోతే మరిన్ని ఇబ్బందులు ఆయనకు తప్పవన్నారు. ఇతరుల్ని కించపరిచేలా వరసగా చేస్తున్న వ్యాఖ్యలకు గానూ రాహుల్‌ క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ డిమాండ్‌ చేశారు. న్యాయవ్యవస్థపైనా కాంగ్రెస్‌కు నమ్మకం లేదన్నారు. కోర్టు తీర్పును శివసేన (ఏక్‌నాథ్‌ శిందే వర్గం) ఆహ్వానించింది. జాతీయస్థాయి నేతల్ని కించపరిచే ప్రయత్నాలపై కూడా ఆయనకు శిక్ష పడాల్సిందేనని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని