కర్మ సిద్ధాంతం నిజమైతే మా పార్టీకి దక్కేది 5 స్థానాలే

తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ పార్టీకి చెందిన 23 మంది శాసనసభ్యులను తెదేపా చేర్చుకున్నందున ఆ పార్టీకి శాసనసభ ఎన్నికల్లో 23 స్థానాలనే ప్రజలు కట్టాబెట్టారని ముఖ్యమంత్రి జగన్‌ చెప్పిన కర్మ సిద్ధాంతమే నిజమైతే రానున్న ఎన్నికల్లో తమ పార్టీకి 5 స్థానాలే దక్కుతాయని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.

Updated : 24 Mar 2023 10:30 IST

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

ఈనాడు, దిల్లీ: తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ పార్టీకి చెందిన 23 మంది శాసనసభ్యులను తెదేపా చేర్చుకున్నందున ఆ పార్టీకి శాసనసభ ఎన్నికల్లో 23 స్థానాలనే ప్రజలు కట్టాబెట్టారని ముఖ్యమంత్రి జగన్‌ చెప్పిన కర్మ సిద్ధాంతమే నిజమైతే రానున్న ఎన్నికల్లో తమ పార్టీకి 5 స్థానాలే దక్కుతాయని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. రానున్న ఎన్నికల్లో వైకాపా గెలిచే 5 స్థానాల్లో పులివెందుల ఉంటుందా? గెలిచే ఎమ్మెల్యేల్లో జగన్‌ ఉంటారా? అన్నది అనుమానమేనని అన్నారు. దిల్లీలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఫలితాల అనంతరం తెదేపా నాయకులు వైనాట్‌ పులివెందుల అని నినదిస్తున్నారని తెలిపారు. తెదేపా తరఫున గెలిచిన నలుగురిని, జనసేన తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యేను జగన్‌మోహన్‌రెడ్డి అధికార పార్టీలో చేర్చుకున్నారని గుర్తు చేశారు. ఐదుగురు ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్నట్లు సిగ్గు లేకుండా సాక్షి దినపత్రికలో రాసుకున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో  25కు 25 ఎంపీ స్థానాలు ప్రతిపక్షాలకు దక్కే అవకాశాలు ఉన్నాయన్నారు. శాసనసభలో బలం లేకపోయినా తెదేపా అభ్యర్థిని బరిలోకి దించిందని    ‘సాక్షి’లో కథనం రాయడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. తెదేపా తరఫున 23 మంది ఎమ్మెల్యేలు ఎన్నికల్లో విజయం సాధించారని, ఎమ్మెల్సీగా గెలవడానికి ఆ పార్టీకి 22 మంది ఎమ్మెల్యేల మద్దతు చాలని వివరించారు. తాను పుట్టాకే విలువలు పుట్టాయన్నట్లు మాట్లాడే జగన్‌.. తెదేపా నుంచి వైకాపాలో చేరిన నలుగురిపై అనర్హత చర్యలకు ఎందుకు సిఫార్సు చేయలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా 22 మంది ఎమ్మెల్యేలకు ఒక క్యాంపు చొప్పున ఎమ్మెల్యేలందరికీ     తమ సింహం క్యాంపులు నిర్వహించాల్సి రావడం అత్యంత దురదృష్టకరమని ముఖ్యమంత్రిని ఉద్దేశించి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కనుసైగతో పార్టీ   శాసనసభ్యులను శాసిస్తారనుకునే ముఖ్యమంత్రికి ఎంత కష్టం వచ్చిందంటూ ఎద్దేవా చేశారు. క్యాంపు బాధ్యతలను మంత్రులకు అప్పగించాక కూడా ఎమ్మెల్యేలను కాచుకోవలసిన దుస్థితి నెలకొందంటే ప్రజల్లో పార్టీ పరిస్థితేమిటో అర్థం చేసుకోవాలన్నారు. వైనాట్‌ 175 అన్న తమ పార్టీ నినాదాన్ని ప్రజలు నమ్మడం లేదని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు