ఉత్తరాంధ్ర రైతుల్ని బలిపెట్టి షిర్డీసాయికి నీటి కేటాయింపులా?

ఉత్తరాంధ్ర ప్రజలు సాగు, తాగు నీరు లేక అల్లాడుతుంటే ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అదానీ సంస్థకు, తన బినామీ కంపెనీ షిర్డీసాయికి నీటి కేటాయింపులు చేయడం దుర్మార్గమని తెదేపా మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు ధ్వజమెత్తారు.

Updated : 24 Mar 2023 06:09 IST

70 వేల ఎకరాలు బీడువారే ప్రమాదం
తెదేపా మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఉత్తరాంధ్ర ప్రజలు సాగు, తాగు నీరు లేక అల్లాడుతుంటే ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అదానీ సంస్థకు, తన బినామీ కంపెనీ షిర్డీసాయికి నీటి కేటాయింపులు చేయడం దుర్మార్గమని తెదేపా మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు ధ్వజమెత్తారు. ఒకవైపు డిస్కంలు 20 ఏళ్లకు సరిపడా మిగులు విద్యుత్తు ఉందని చెబుతున్నపుడు ఈ ప్రాజెక్టుల అవసరమేముందని గురువారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ‘జగన్‌రెడ్డి ప్రభుత్వం కమీషన్ల కోసం ఇప్పటికే అవసరం లేకున్నా బహిరంగ మార్కెట్‌లో రూ.12 వేల కోట్లకు విద్యుత్తు కొనుగోలు చేసింది. విద్యుత్తు ఛార్జీలు, అప్పులు కలిపి రాష్ట్ర ప్రజలపై రూ.57 వేల కోట్ల భారాన్ని మోపింది. అదీ చాలదన్నట్లు జగన్‌రెడ్డి ఇప్పుడు ఉత్తరాంధ్ర అన్నదాతలపై పగబట్టి వారి ఆయకట్టును బీడు చేసే కుట్ర చేస్తున్నారు. స్మార్ట్‌ మీటర్లతో రైతుల మెడకు ఉరితాళ్లు బిగిస్తున్నారు. పంప్డ్‌ స్టోరేజీ ప్లాంట్ల కోసం తాండవ, రైవాడ జలాశయాల నుంచి అదానీ గ్రీన్‌ ఎనర్జీకి 0.393 టీఎంసీలు, షిర్డీసాయికి 0.533 టీఎంసీల నీటిని కేటాయించడం దుర్మార్గం. దీని వల్ల రానున్న రోజుల్లో ఉత్తరాంధ్రలోని దాదాపు 70 వేల ఎకరాలు బీడుగా మారే ప్రమాదముంది. జగన్‌రెడ్డి ఆదేశాలను గుడ్డిగా అమలు చేస్తూ జలవనరుల శాఖ అధికారులు జీవో విడుదల చేయడం శోచనీయం. ఇప్పటికే ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులను పక్కనపెట్టి రైతాంగం పొట్టకొడుతున్న ఆయన ఇప్పుడు ఉన్న కొద్దిపాటి సాగునీటిని ఆయన అస్మదీయులకు దోచిపెట్టాలని చూస్తున్నారు. పేదలకు వైద్యం అందిస్తున్న మంగళగిరి ఎయిమ్స్‌కు నీరివ్వని ముఖ్యమంత్రి ఆ రెండు సంస్థలకు మాత్రం నీటి కేటాయింపులు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది’ అని దుయ్యబట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని