తొలిసారి కొందరు.. అదృష్టం వరించి మరికొందరు..
డీఐజీగా వీఆర్‌ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చినవారు ఒకరు.. ఉప సర్పంచిగా ప్రజా జీవితం ఆరంభించింది మరొకరు.. గతంలో ఎమ్మెల్యేలుగా గెలుపొందినవారు ఇద్దరు.. ఇప్పటికే ఎమ్మెల్సీలుగా పనిచేసిన మరో ఇద్దరు.. ఇలా ఆరుగురు తాజాగా పెద్దల సభలో అడుగుపెట్టనున్నారు.
వైకాపా ఎమ్మెల్సీల రాజకీయ ప్రస్థానమిది
ఈనాడు, అమరావతి: డీఐజీగా వీఆర్‌ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చినవారు ఒకరు.. ఉప సర్పంచిగా ప్రజా జీవితం ఆరంభించింది మరొకరు.. గతంలో ఎమ్మెల్యేలుగా గెలుపొందినవారు ఇద్దరు.. ఇప్పటికే ఎమ్మెల్సీలుగా పనిచేసిన మరో ఇద్దరు.. ఇలా ఆరుగురు తాజాగా పెద్దల సభలో అడుగుపెట్టనున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా తరపున గెలిచిన ఆరుగురి రాజకీయ ప్రస్థానమిదీ..
నాడు స్వతంత్ర ఎమ్మెల్యేగా.. నేడు వైకాపా ఎమ్మెల్సీగా
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలేనికి చెందిన మర్రి రాజశేఖర్ ఎట్టకేలకు శాసనమండలిలో అడుగుపెట్టనున్నారు. ఓసారి ఎమ్మెల్యేగా గెలుపొందినా, తర్వాత వరుసగా ఓటమిపాలయ్యారు. తాజాగా ఎమ్మెల్సీగా గెలుపొందారు. మర్రి రాజశేఖర్ మేనమామ సోమేపల్లి సాంబయ్య చిలకలూరిపేట నుంచి కాంగ్రెస్ తరఫున మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. చిలకలూరిపేటలో న్యాయవాద వృత్తిలో ఉన్న మర్రి రాజశేఖర్.. సాంబయ్య మరణానంతరం ఆయన వారసుడిగా కాంగ్రెస్‌లో కొనసాగారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్ఠానం మల్లాది శివన్నారాయణకు చిలకలూరిపేట సీటు కేటాయించడంతో, స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. అప్పటి పీసీసీ అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో స్వతంత్ర అభ్యర్థి రాజశేఖర్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆ ఎన్నికల్లో రాజశేఖర్ గెలుపొందారు. 2008లో తితిదే, వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయాల పాలకమండలి సభ్యుడిగా పనిచేశారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున చిలకలూరిపేట నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2011లో వైకాపాలో చేరారు. 2014లో వైకాపా తరపున చిలకలూరిపేట నుంచి పోటీ చేసి మళ్లీ ఓటమిపాలయ్యారు. 2019లో టికెట్ ఆశించినా దక్కలేదు. దీంతో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఆయన 2011 నుంచి 2019 వరకు గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్షుడిగా పని చేశారు.
పార్టీ మారారు.. ఎమ్మెల్సీగా గెలిచారు
రెండున్నర దశాబ్దాలకు పైగా తెదేపాలో కొనసాగిన జయమంగళ వెంకటరమణ అనూహ్యంగా పార్టీని వీడి, వైకాపా తీర్థం పుచ్చుకొని ఎమ్మెల్సీగా గెలుపొందారు. కైకలూరు మండలం కొట్టాడకు చెందిన ఆయన గ్రామ సర్పంచిగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2001లో తెదేపా నుంచి జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2006 నుంచి 2009 వరకు తెదేపా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 2009లో కైకలూరు తెదేపా కీలక నేతలు కమ్మిలి విఠల్‌రావు, కామినేని శ్రీనివాస్ పార్టీని వీడటంతో అనూహ్యంగా కైకలూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా భాజపా అభ్యర్థి కామినేనికి ఈ సీటు కేటాయించడంతో భంగపడ్డారు. 2019లో తెదేపా తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామనే హామీతో ఇటీవల వైకాపాలో చేరిన ఆయన టికెట్ తెచ్చుకుని ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
ఉప సర్పంచి నుంచి.. ఎమ్మెల్సీగా ఇజ్రాయేల్
ఉప సర్పంచిగా ప్రజా జీవితాన్ని ఆరంభించిన బొమ్మి ఇజ్రాయేల్ ఎమ్మెల్సీగా శాసన మండలిలోకి అడుగుపెట్టనున్నారు. డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గోడి గ్రామానికి చెందిన ఆయన 2008 నుంచి 2013 వరకు ఉప సర్పంచిగా పని చేశారు. వైకాపా ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. గతేడాది డిసెంబరులో అమలాపురంలో మాదిగ ఉపకులాలతో బహిరంగ సభ నిర్వహించి, తమ సామాజికవర్గానికి రాజకీయంగా ప్రాధాన్యం ఇవ్వాలనే డిమాండ్‌ను తెరపైకి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా టికెట్ దక్కగా తాజా ఎన్నికల్లో గెలుపొందారు.
వరుసగా మూడోసారి ఎమ్మెల్సీగా పోతుల సునీత
పోతుల సునీత వరుసగా మూడోసారి ఎమ్మెల్సీగా గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్‌లో తెదేపా తరపున జడ్పీటీసీ సభ్యురాలిగా గెలిచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2009లో అలంపూర్ నుంచి, 2014లో చీరాల నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2017లో తెదేపా తరఫున ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనమండలిలో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారు. అనంతరం తెదేపాకు రాజీనామా చేసి, అధికార పార్టీలో చేరారు. సునీత రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో సీఎం జగన్ ఆమెకే మళ్లీ అవకాశం ఇచ్చారు. పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుండటంతో మరోసారి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశమిచ్చారు. దీంతో సునీత వైకాపా అభ్యర్థిగా బరిలో నిలిచి, గెలిచారు.
ఎమ్మెల్యేగా ఓడి.. ఎమ్మెల్సీగా గెలిచిన మాజీ డీఐజీ
డీఐజీగా పనిచేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చిన చంద్రగిరి ఏసురత్నం నాలుగేళ్ల కిందట అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోగా, ఇపుడు ఎమ్మెల్సీగా గెలుపొందారు. పల్నాడు జిల్లా గురజాలకు చెందిన ఆయన 1982లో ఎస్సైగా ఎంపికయ్యారు. తర్వాత మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, జనార్ధన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి వద్ద భద్రతాధికారిగా పని చేశారు. వృత్తిలో అంచెలంచెలుగా ఎదిగి డీఐజీ స్థాయికి చేరుకున్నారు. 2018లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి, వైకాపాలో చేరారు. 2019లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అనంతరం గుంటూరు మిర్చి యార్డు ఛైర్మన్‌గా వరుసగా రెండుసార్లు నామినేటెడ్ పదవి పొందారు. ఇటీవల ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడంతో మిర్చి యార్డు ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు.
పెద్దల సభకు రెండోసారి.. దంత వైద్యుడు సూర్యనారాయణరాజు
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం మొయిద విజయరాంపురానికి చెందిన దంత వైద్యుడు డాక్టర్ పెనుమత్స వరాహ వెంకట సూర్యనారాయణరాజు రెండోసారి ఎమ్మెల్సీ అయ్యారు. దివంగత మాజీ మంత్రి, సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు కుమారుడైన సూర్యనారాయణ తొలుత ఎంపీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. వైకాపా ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే ఉన్నారు. 2014లో నెల్లిమర్ల అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కకపోయినప్పటికీ, ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని పార్టీ అధినేత జగన్ హామీ ఇచ్చారు. 2020లో ఆయన తండ్రి సాంబశివరాజు మృతి చెందగా, అదే ఏడాది ఆగస్టులో సూర్యనారాయణరాజుకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా కూడా అవకాశమిచ్చారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి రెండోసారి ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Harish Rao: అందుకే మన ‘మిషన్ కాకతీయ’ దేశానికే ఆదర్శం: హరీశ్‌రావు
-
India News
Wrestlers Protest: బ్రిజ్‌భూషణ్‌పై పోక్సో కేసులో ఆమె మైనర్ కాదా..? ఆమె తండ్రి ఏం చెప్పారంటే..?
-
Movies News
Shiva Balaji: జాతకాలు కుదరలేదని బ్రేకప్ చెప్పేసుకున్నాం..: శివ బాలాజీ
-
Crime News
Hyderabad: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. క్షుద్రపూజల వల్లేనంటున్న తల్లిదండ్రులు
-
India News
Air India: ఎట్టకేలకు 39 గంటల తర్వాత.. రష్యా నుంచి అమెరికాకు ఎయిరిండియా విమానం
-
India News
Odisha Train Accident: మృతుల్ని గుర్తించేందుకు కృత్రిమ మేధ