భారత ప్రజాస్వామ్యానికి చీకటిరోజు

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేయడం రాజకీయంగా తీవ్ర దుమారానికి దారితీసింది. ప్రతిపక్ష నేతలపై కేంద్ర ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని పలువురు విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు.

Updated : 25 Mar 2023 05:57 IST

రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వం రద్దుపై కాంగ్రెస్‌
కేంద్రం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోంది
ప్రతిపక్ష నేతల విమర్శ

ఈనాడు, దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేయడం రాజకీయంగా తీవ్ర దుమారానికి దారితీసింది. ప్రతిపక్ష నేతలపై కేంద్ర ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని పలువురు విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు.

రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వం రద్దుపై కాంగ్రెస్‌ శుక్రవారం తీవ్రంగా మండిపడింది. ‘భారత ప్రజాస్వామ్యానికి చీకటిరోజు’ అని అభివర్ణించింది. ఈ అంశంపై న్యాయపరంగానూ, రాజకీయంగానూ పోరాడతామని ప్రకటించింది. రాహుల్‌పై చర్య ‘రాజకీయ ప్రతీకారం’ అని పేర్కొంది. ఈ అంశంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. రాహుల్‌ నిజాలు మాట్లాడుతూ.. రాజ్యాంగం.. ప్రజా హక్కుల కోసం పోరాడుతున్న నేపథ్యంలో ఆయన్ను అనర్హుడిగా చేయడానికి భాజపా అన్ని రకాల ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. ‘‘ఇది వెనుకబడిన తరగతులకు సంబంధించిన ప్రశ్న కాదు. లలిత్‌ మోదీ, నీరవ్‌ మోదీలు వెనుకబడిన తరగతుల వారు కాదు. బీసీలకు వ్యతిరేకంగా రాహుల్‌ మాట్లాడారనే భావనను తీసుకొచ్చేందుకు వారు(భాజపా) ప్రయత్నిస్తున్నారు. రాహుల్‌ సత్యాన్ని దేశం ముందు ఆవిష్కరిస్తుంటే అది వారికి కంటగింపుగా ఉంది. రాహుల్‌పై అనర్హత వేటు వేయించడంతో తమ సమస్య తీరిపోయిందని భాజపా భావిస్తుండొచ్చు. కానీ ‘అదానీ’ అంశంపై జేపీసీ డిమాండ్‌ కొనసాగుతుంది. ప్రజాస్వామ్యం కోసం మా పోరాటం సాగుతుంది..దీని కోసం జైలుకు వెళ్లాల్సి వస్తే దానికీ సిద్ధం. మా కార్యకర్తలు పోరుకు సంసిద్ధంగా ఉన్నారు’’ అని ఖర్గే పేర్కొన్నారు.


నియంతలకు తలవంచం

మోదీజీ...అమరుడైన ప్రధాని కుమారుడిని ద్రోహి అని మీ అనుయాయులు పిలిచారు. మీ సీఎం ఒకరు.. రాహుల్‌ గాంధీ తండ్రి ఎవరంటూ ప్రశ్నించారు! మేము నెహ్రూ పేరు ఎందుకు పెట్టుకోలేదంటూ మీరు పార్లమెంటులో ప్రశ్నించి కశ్మీరీ పండిట్ల సమాజాన్ని, కుటుంబాన్నీ అవమానించారు. అయినా ఏ న్యాయమూర్తీ మీకు రెండేళ్ల జైలు శిక్ష విధించలేదు. పార్లమెంటుకు మీరు అనర్హులని ప్రకటించలేదు. కశ్మీరీ పండిట్ల సంప్రదాయం, కుటుంబ ఆచారం ప్రకారం తన తండ్రి మరణానంతరం ఒక కుమారుడు తలపాగా ధరించారు. మా కుటుంబాన్ని రాజవంశమని మీరు నిందించారు. మా కుటుంబం తమ రక్తంతో భారత ప్రజాస్వామ్యాన్ని పాదుకొల్పిందనే విషయాన్ని గుర్తుంచుకోండి. మా నరాల్లో ప్రవహించే రక్తం నియంతలకు ఎన్నడూ తలవంచదు.

ప్రియాంకా గాంధీ


ఇదంతా కాకతాళీయమా?

అదానీపై ఫిబ్రవరి 7న రాహుల్‌ గాంధీ పార్లమెంటులో మాట్లాడిన అనంతరం ఆయనపై ఉన్న పరువునష్టం దావా కేసు ఊపందుకొంది. తన విజ్ఞప్తి మేరకు అంతకుముందు ఇచ్చిన స్టేను తొలగించాలని ఫిర్యాదుదారు ఫిబ్రవరి 16న హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు స్టేను తొలగించింది. ఫిబ్రవరి 27న మరోసారి వాదనలు ప్రారంభమయ్యాయి. మార్చి 17న తీర్పు రిజర్వు అయింది. ఇదంతా కాకతాళీయంగా జరిగిందా?

జైరాం రమేశ్‌


ప్రతిపక్ష గళాన్ని మూయించరాదు

దృఢమైన రాజకీయ భిన్నాభిప్రాయాలే ప్రజాస్వామ్య సారాంశం. ప్రతిపక్షం ప్రధాన గళాలను మూయించేలా చట్టాలను రూపొందించరాదు.

పి.చిదంబరం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత


ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం

ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక, భాజపా ప్రభుత్వ నిరంకుశ విధానానికి ప్రబల నిదర్శనం. పార్లమెంటులో రాహుల్‌ గళాన్ని నొక్కేసేందుకు మోదీ ప్రభుత్వం వేసిన ఎత్తుగడ.  

కె.సి.వేణుగోపాల్‌, కాంగ్రెస్‌


నియంతృత్వానికి మరో ఉదాహరణ

నియంతృత్వానికి మరో ఉదాహరణ. గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా కూడా జనసంఘ్‌ ఇదే పద్ధతిని అవలంబించి.. దాని పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. దాన్ని ఆ పార్టీ మర్చిపోవద్దు. ఈ దేశ ప్రజల కోసం రాహుల్‌ గళమెత్తారు. ఇప్పుడు మరింత గట్టిగా వినిపిస్తారు.

అశోక్‌ గహ్లోత్‌, రాజస్థాన్‌ సీఎం


భాజపా లక్ష్యం ప్రతిపక్ష నేతలే

ప్రధాని మోదీ నవ భారతంలో.. భాజపా ప్రధాన లక్ష్యం ప్రతిపక్ష నేతలే. నేర చరిత్ర కలిగిన భాజపా నేతలకు కేబినెట్‌ పదవులిస్తూ.. ప్రతిపక్ష నేతలను వారి ప్రసంగాల కారణంగా అనర్హులుగా ప్రకటిస్తున్నారు. మన ప్రజాస్వామ్యం నేడు మరింత పతనమవడాన్ని మనం చూస్తున్నాం.

మమతా బెనర్జీ, బెంగాల్‌ సీఎం


విస్మయం కలిగిస్తోంది

దేశం చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. యావత్‌ దేశాన్ని భయాందోళనలకు గురిచేస్తున్నారు. ఇది విస్మయం కలిగిస్తోంది. అహంకారంతో వ్యవహరిస్తున్న శక్తులకు వ్యతిరేకంగా 130 కోట్ల మంది ప్రజలు ఏకం కావాలి.

కేజ్రీవాల్‌, దిల్లీ సీఎం


రాజ్యాంగ సిద్ధాంతాలకు వ్యతిరేకం

రాజ్యాంగం ప్రాథమిక సిద్ధాంతాలకు వ్యతిరేకమైన, ఖండనార్హమైన చర్య. ప్రజాస్వామ్య విలువలను దిగజార్చడమే. మన ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడుకునేందుకు మనమంతా కలసికట్టుగా ఉండాలి.

శరద్‌ పవార్‌, ఎన్సీపీ అధ్యక్షుడు


దొంగను దొంగంటే నేరమైంది

ఇది ప్రజాస్వామ్యాన్ని చంపేయడమే. అన్ని సంస్థలు కేంద్రం ఒత్తిడితో పనిచేస్తున్నాయి. దేశాన్ని దోచుకుంటున్న దొంగను దొంగ అని పిలవడం కూడా నేరమైంది. నియంతృత్వ పాలనకు ముగింపు పలికే సమయం ఆరంభమైంది. ఈ పోరాటానికి ఇప్పుడు ఓ దిశ అవసరం.

ఉద్ధవ్‌ ఠాక్రే, మహారాష్ట్ర మాజీ సీఎం


ప్రజల దృష్టి మళ్లించే చర్య

ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, దేశ సంపదను మింగేస్తున్న పారిశ్రామిక మిత్రుడు వంటి అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించే చర్య. భాజపా నేతలు వాడిన భాష, చేసిన వ్యాఖ్యలపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపడితే ఆ పార్టీకి చెందిన అనేక మంది నేతలపై అనర్హత వేటు పడుతుంది.

అఖిలేశ్‌ యాదవ్‌, ఎస్పీ అధ్యక్షుడు


అనర్హత వేటును రద్దు చేయండి

రాహుల్‌పై అనర్హత వేటును రద్దు చేయాలి. జాతీయ రాజకీయ పార్టీ నేత, ఎంపీకి కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించే ప్రజాస్వామ్య హక్కు లేదని తాజాచర్య చాటుతోంది.

ఎం.కె.స్టాలిన్‌, తమిళనాడు సీఎం


సంఘ్‌ పరివార్‌ హింసాత్మక దాడి

రాహుల్‌పై చర్య ప్రజాస్వామ్యంపై సంఘ్‌ పరివార్‌ హింసాత్మక దాడి. ఇది వారి నయా అధ్యాయం. అసమ్మతిని అధికార బలంతో అణచివేయడం నియంతృత్వమే.

పినరయి విజయన్‌, కేరళ సీఎంTags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు