ఇవి ప్రజాస్వామ్యానికి చీకటి రోజులు

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేయడంపై రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఘాటుగా స్పందించారు. ఇవి ప్రజాస్వామ్యానికి చీకటి రోజులని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే అన్నారు.

Updated : 25 Mar 2023 05:53 IST

కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే
రాహుల్‌పై వేటు రాజకీయ కక్ష సాధింపే: రేవంత్‌రెడ్డి

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేయడంపై రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఘాటుగా స్పందించారు. ఇవి ప్రజాస్వామ్యానికి చీకటి రోజులని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే అన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు, ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీగౌడ్‌, ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శి రోహిత్‌ చౌదరి, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌ తదితరులతో కలిసి ఆయన శుక్రవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు రాహుల్‌గాంధీ చేసిన పాదయాత్రతో ప్రజల్లో ఆయనపై విశ్వాసం పెరగడం చూసి నరేంద్రమోదీ భయపడుతున్నారు. పైకోర్టులో అప్పీలుకు వెళ్లేందుకు అవకాశం ఉన్నప్పటికీ భాజపా ఒత్తిడికి తలొగ్గి లోక్‌సభ కార్యాలయం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదు. భాజపా దుశ్చర్యలను ప్రజల్లోకి తీసుకెళతాం. శనివారం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, ఇతర ముఖ్య నాయకులతో గాంధీభవన్‌లో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తాం’ అని ఠాక్రే వివరించారు. అనంతరం కాంగ్రెస్‌ కార్యకర్తలు గాంధీభవన్‌ గేటు ఎదుట ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు.

‘మోదీ చర్యను దీటుగా ఎదుర్కొంటాం’

రాహుల్‌గాంధీపై అనర్హత వేటు ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపు చర్యే అని, దీన్ని దీటుగా ఎదుర్కొంటామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ‘దేశ ఐక్యతకు భారత్‌ జోడో యాత్ర చేపట్టడం, అదానీ-మోదీ చీకటి స్నేహంపై నిలదీయడం, జేపీసీ కోసం పార్లమెంటు వేదికగా కాంగ్రెస్‌ పోరాటం చేస్తుండటంతో మోదీకి కంటి మీద కునుకు ఉండటంలేదు. అందుకే ఇలాంటి అనైతిక చర్యకు పూనుకున్నారు’ అని ఆరోపించారు.

రాహుల్‌పై అనర్హత వేటును ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, సీనియర్‌ నాయకులు పొన్నం ప్రభాకర్‌ మల్లురవి, నిరంజన్‌ వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు. శనివారం నిరసనలు చేపట్టాలని కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు