ఓబీసీ సమాజానికి రాహుల్‌ క్షమాపణ చెప్పాలి

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఓబీసీ సమాజానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి క్షమాపణ చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. దిల్లీలో ఆయన మాట్లాడుతూ మోదీ ఇంటి పేరున్న వాళ్లంతా దొంగలేనంటూ రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, ఓబీసీ సమాజాన్ని అవమానించారని సంజయ్‌ విమర్శించారు.

Published : 25 Mar 2023 03:58 IST

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

ఈనాడు, దిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఓబీసీ సమాజానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి క్షమాపణ చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. దిల్లీలో ఆయన మాట్లాడుతూ మోదీ ఇంటి పేరున్న వాళ్లంతా దొంగలేనంటూ రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, ఓబీసీ సమాజాన్ని అవమానించారని సంజయ్‌ విమర్శించారు. ఓబీసీలను, కోర్టులను అవమానించడం, చట్టాన్ని ఉల్లంఘించడం కాంగ్రెస్‌ డీఎన్‌ఏలోనే ఉందని ఆరోపించారు. ఇందిరాగాంధీ నుంచి రాహుల్‌ గాంధీ వరకు న్యాయవ్యవస్థను అగౌరవపరుస్తూనే ఉన్నారన్నారు. కోర్టు తీర్పునిస్తే దానిని శిరసావహించకుండా జడ్జిలను కించపరచడం న్యాయవ్యవస్థను అవమానించడమేనన్నారు. ఈవిషయంలో దేశంలోని ఓబీసీలంతా జాగృతం కావాలని ఆయన కోరారు. దురదృష్టవశాత్త్తు ఎంపీనయ్యానని రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌ను అవమానించారని ఆయన విమర్శించారు. విదేశాల్లో భారత్‌ ప్రతిష్ఠను కించపరిచేలా మాట్లాడటం సిగ్గు చేటన్నారు. కోర్టు తీర్పును శిరసావహించకుంటే రాహుల్‌ గాంధీని సమాజం ఈ దేశ పౌరునిగా గుర్తించదన్నారు.

కేంద్రం పాత లెక్కలు అడుగుతుందని కేసీఆర్‌కు భయం..

ఎనిమిదేళ్లుగా రైతులకు నయా పైసా సాయం చేయని కేసీఆర్‌ కేంద్రం పైసా ఇవ్వడం లేదనడం సిగ్గుచేటని సంజయ్‌ అన్నారు.  2016-17లో కేంద్ర ప్రభుత్వం రూ.916 కోట్లు మంజూరు చేస్తే అందులో రూ.700 కోట్లు కూడా రైతులకు ఇవ్వలేదని మండిపడ్డారు. మళ్లీ సహాయం అడిగితే పాత లెక్కలు అడుగుతుందనే భయంతో కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపడం లేదని ఆరోపించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తుందనడం పచ్చి అబద్ధమని, ఎస్డీఆర్‌ఎఫ్‌ నిధులతోనే రైతులకు సహాయం చేస్తున్నట్లు జీవోలోనే చెప్పారన్నారు. ఆ నిధుల్లో 75 శాతం వాటా కేంద్రానిదే అనే మాట ఎందుకు చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. భాజపా రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ మాట్లాడుతూ రాహుల్‌ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పకపోతే ఏప్రిల్‌ 6 నుంచి 14 వరకు ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.  


ఎన్నికలు వస్తుండడంతోనే కౌలు రైతులు గుర్తుకువచ్చారు: రఘునందన్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌:ఎన్నికల ఏడాది కావడంతోనే రాష్ట్ర ప్రభుత్వానికి కౌలురైతులు గుర్తుకు వచ్చారని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. కౌలురైతులని ప్రభుత్వం గుర్తించడంలేదని గతంలో శాసనసభలో సీఎం ప్రకటించారని అన్నారు. శుక్రవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో రఘునందన్‌రావు మాట్లాడారు. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో గత ఏడాది పర్యటించిన సీఎం పంట నష్టానికి ఎకరాకు రూ.10 వేలు ఇస్తామని చెప్పారని ఎంతమందికి ఇచ్చారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. రాష్ట్రంలో 6 ఎకరాలకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు రైతుబంధు ఈ ఏడాది రాలేదన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీకి ఐటీశాఖమంత్రిగా కేటీఆర్‌ బాధ్యత వహించాలన్నారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని